Image result for india Economic recession workersఆర్థిక మాంద్యం దెబ్బకు ఉద్యోగుల్లో టెన్షన్‌.. టెన్షన్‌
యాజమాన్యాల టార్గెట్లు.. తట్టుకోలేకపోతున్న శ్రామికులు
సైకియాట్రిస్టుల వద్దకు పరుగులు

మోడీ ఐదేండ్ల పాలనలో అనుసరించిన విధానాలతో ఇపుడు పరిశ్రమలన్నీ మాంద్య ఊబిలోకి నిట్టనిలువుగా కూరుకుపోతున్నాయి. ఆర్థికమాంద్యం దెబ్బకు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. పూట గడవటం ఎలా అని బడుగుబతుకులు తల్లడిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న,మధ్యతరహా కంపెనీలకు బాధ్యతలు చూసే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు(సీఈఓ) యాజమాన్యాల ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నారు. మానసిక వైద్యుల వద్దకు దౌడు తీస్తున్నారు.మీకు కౌన్సెలింగ్‌ చేయటమే తప్ప..ఒత్తిళ్లకు శాశ్వతపరిష్కారం మా చేతుల్లో లేదని సైకియాట్రిస్టులు అంటున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. నయా ఉదారవిధానాలే కారణమనటానికి మానసిక వైద్యుల వద్ద పెరుగుతున్న ఈ కేసులే ఇందుకు నిదర్శనమని ఆర్థికవిశ్లేషకులు అంటున్నారు.

న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంతో వ్యాపార సంస్థల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ ఆయా సంస్థలలో పనిచేస్తున్న సీఈవోలు, మేనేజింగ్‌ డైరెక్టర్‌లు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. మాంద్యం నేపథ్యంలో వీరందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నానాటికీ దిగజారుతున్న అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్లలో షేర్ల విలువలు ఒక్కసారిగా పడిపోతుండటం, కొండలా పేరుకుపోయిన ఉత్పాదకాలతో రోజంతా వీరు ఆందోళనకు గురవుతున్నారు. సంస్థ నిర్దేశించిన టార్గెట్‌లు, యాజమానుల నుంచి ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రతపై నెలకొన్న సందిగ్ధత, తదితర అంశాలతో సీఈవోలే గాక కింది స్థాయి ఉద్యోగులు సైతం ఒత్తిళ్లకు లోనవుతున్నామని తమవద్దకు వచ్చిన క్లయింట్లు చెబుతున్నారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా సైక్రియాటిస్టుల వద్దకు వెళ్లే వారు గత ఆరునెలల్లో 16 శాతం పెరిగారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న ఆర్థిక అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశ ఆర్థికరంగం కుదేలవుతున్నది. మాంద్యం కారణంగా ఇప్పటికే పలు సంస్థలు మూతపడే దిశగా సాగుతుం డగా.. చిన్న, మధ్యతరహా సంస్థలలో పని చేస్తున్న సీఈవోలు, ఎండీలు, ఉద్యోగులు, కార్మికులు ఒత్తిళ్లకు తట్టుకోలేకపోతున్నారు. బడా కార్పొరేట్‌ సంస్థల నుంచి ఎదురవుతున్న సవాళ్లు, ఆటోమొబైల్‌తో పాటు పలు రంగాలను బలంగా కుదిపేస్తున్న మాంద్యంతో.. ఉద్యోగులంతా తీవ్ర మానసిక ఆందోళనలోకి వెళ్తున్నారని సైక్రియాటిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి తట్టుకోని పలువురు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్యలో ఐటీ వేధింపులు ఉన్నా.. ఆయన ఆర్థికంగా చితికిపోవడం కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనతో పాటు ఇటీవలే చెన్నైకి చెందిన ప్రముఖ కార్ల సంస్థ డీలర్‌ రీటా లంకలింగం కూడా తన ఇంట్లో ఆత్మహత్య కు పాల్పడ్డ విషయం విది తమే. తమిళనాడు వ్యాప్తం గా టొయోటా కార్ల డీలర్‌గా ఉన్న లాన్సన్‌ సంస్థకు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. కొద్దిరోజులుగా ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న పరిస్థితులతో తమ సంస్థ అప్పుల పాలయ్యిందనే ఆవేదనలో ఆత్మహత్యకు పాల్పడ్డారని సమాచారం.కాస్మోస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ బిహావియరల్‌ సైన్సెస్‌ (సీఐఎంబీఎస్‌) అధ్యయనం ప్రకారం.. 2019లో ఈ రకమైన ఒత్తిళ్లతో తమవద్దకు వచ్చేవాళ్లు మూడు రెట్లు పెరిగారని తెలిపింది. కార్యాలయాల్లో పని, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా తాము తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నామని వారు చెబుతున్నారని సీఐఎంబీఎస్‌ సైకియాట్రిస్టు శోభన మిట్టల్‌ చెప్పారు. ఇది సీఈవోలు, ఎగ్జిక్యూటివ్స్‌కే పరిమితం కాలేదనీ, స్వయం ఉపాధి చేసుకునేవారిలోనూ ఎక్కువైందని అన్నారు. పని ఒత్తిళ్ల కారణంగా భార్యాభర్తలిద్దరూ ఆందోళన చెందుతున్న కేసులు కూడా తమ వద్దకు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ భద్రత, ఆర్థిక అనిశ్చితి, సంస్థ నష్టాల బాట పట్టడం వల్ల ఆందోళనకు లోనవుతున్నామని వచ్చే కేసులు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయని ఆమె వివరించారు.

కచ్చితమైన నివారణ మార్గం లేదు : ఆప్టమ్‌ 
ఇదే అంశంపై ప్రముఖ హెల్త్‌ సర్వీసెస్‌ సంస్థ ఆప్టమ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధి అంబర్‌ ఆలమ్‌ స్పందిస్తూ.. భారతీయ సంస్థలలో పనిచేస్తున్న సీఈవోలు, సీనియర్‌ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఒత్తిళ్లలో ఉన్న మాట వాస్తవమేననీ, దీనికి సంబంధించి తమకు రోజుకు వందలాది మంది కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. ఆటోమొబైల్‌, టెలికాం, రియల్‌ఎస్టేట్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థలలో అత్యున్నత స్థాయిలలో పనిచేసే ఉద్యోగుల నుంచి ఈ కాల్స్‌ ఎక్కువగా వస్తున్నాయని ఆయన అన్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక వారంతా ఆందోళనలకు గురవుతున్నారనీ, కానీ దీనిని తగ్గించడానికి కచ్చితమైన నివారణ మార్గాలేవీ లేవని ఆయన తెలిపారు. వారికి తాము కౌన్సిలింగ్‌ ఇచ్చినా ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు వారే అన్వేషించాలని సూచించారు.

(Courtesy Nava Telangana)