సూచిస్తున్న పలు రంగాల రుణాత్మక వృద్ధి
ఇప్పటికే వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన పలు సంస్థలు
న్యూఢిల్లీ : దేశంలో అంతకంతకూ ఆర్థిక మందగమనం తీవ్రరూపం దాల్చుతోంది. ఇదే విషయాన్ని ఆర్థిక వ్యవహారాల పరిశీలకులు ఇప్పుడు నొక్కి చెబు తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు భారత వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) అంచనా వేసింది. దాదాపుగా 8 నెలలు గడిచిన తర్వాత వృద్ధిరేటును 6.1 శాతానికి తగ్గిస్తూ తన అంచనాల్లో సవరణలు చేసింది. అదేవిధంగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ) కూడా వృద్ధిరేటును 5 శాతంగా అంచనా వేసింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఒక ఆర్థిక సంస్థ వృద్ధిరేటు 4.9 శాతంగా ఉండొ చ్చని పేర్కొంది. ఇలా వృద్ధిరేటు ముందుగా చేసిన అంచ నాల కంటే తరువాతి సవరణల్లో పడిపోవడానికి కారణా లేంటి?. పలు సూచీలు దీనికి తగిన వివరణ ఇస్తున్నాయి.

పడిపోతున్న ఇండిస్టియల్‌ డిమాండ్‌
గత కొంతకాలంగా రైల్వేల ద్వారా రవాణా అయ్యే సరుకు మొత్తం క్రమక్రమంగా తగ్గిపోయింది. 2019, ఏప్రిల్‌లో ఉన్న 4.3 వృద్ధి, సెప్టెంబర్‌ మాసం నాటికి -7.7 శాతానికి పడిపోయింది. సరుకు రవాణా తగ్గిపో యిందంటే పారిశ్రామిక డిమాండ్‌ తగ్గిపోయినట్లే. మే నెలల్లో సరుకు రవాణా వృద్ధి 6.6 శాతం, జూన్‌లో 4.3, జులైలో 3.3, ఆగస్టులో మరింత దారుణంగా పడిపోయి -5 శాతంగా నమోదైంది. అదేవిధంగా ప్రయాణికుల ద్వారా కూడా వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. ఏప్రిల్‌ నెలలో 7.4 శాతంగా ఉన్న వృద్ధి, మే నెలలో దిగజారి -0.6 శాతానికి చేరింది. తిరిగి మే జూన్‌లో పుంజుకొని 8.8 శాతం నమోదు కాగా, తిరిగి జులై 6.2, ఆగస్టు 1.2, సెప్టెంబర్‌ నెలలో 1.8 శాతానికి తగ్గింది.

విమానయాన రంగం నేలచూపులు
2019-20 ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటుందని అనుకున్న విమానయాన రంగం ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. ఈ రంగంలో కూడా తీవ్ర మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో ఈ ఏడాది జనవరిలో కనిపించిన 9.1 శాతం వృద్ధి ఆ తరువాతి నెలల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ సెప్టెంబర్‌ నెల నాటికి 1.2 శాతానికి దిగజారింది. ఫిబ్రవరిలో 5.6 శాతంగా ఉన్న వృద్ధి రేటు, జులై నెలలో 3 శాతానికి పడిపోయింది.

తగ్గిన డీజిల్‌ వినియోగం
గత కొన్ని నెలలుగా పెట్రోలు వినియోగం స్థిరంగా ఉన్నా, డీజిల్‌ వినియోగం మాత్రం దారుణంగా పడి పోయింది. సాధారణంగా డీజిల్‌ను రవాణా రంగం, పరి శ్రమల్లో యంత్రాలను నడిపేందుకు వినియోగిస్తుంటారు. దీన్నిబట్టి డీజిల్‌ వినియోగం పడిపోయింది అంటే పారిశ్రామిక రంగం సంక్షోభంలో పడినట్లు అర్ధం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో డీజిల్‌ వినియోగ వృద్ధి 2.1 శాతంగా ఉండగా, క్రమక్రమంగా దిగజారుతూ సెప్టెంబర్‌ నెలకు అది -7.4 శాతానికి పడిపోయింది. మే నెలలో 2.9 శాతం వృద్ధి, జూన్‌లో 1.5, జులైలో -1.2, ఆగస్టు నెలకు అది -3.3కి పడిపోయింది.

ఒత్తిడిలో పారిశ్రామిక ఉత్పత్తి
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి ఉన్న రంగాలను చూపిస్తుంది. గణాంకాలను పరిశీ లిస్తే చివరకు ఫార్మా రంగం కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. రంగాల వారీగా పరిస్థితులను ఒక్కసారి గమనిద్దాం. ఆర్థిక మాంద్యం ధాటికి టెక్స్‌టైల్‌ రంగం దారుణంగా ప్రభావితమైంది. ఈ రంగంలో ఏప్రిల్‌ నెలలో 3.1 శాతంగా ఉన్న వృద్ధి సెప్టెంబర్‌ నాటికి -5.3కి దిగజారింది. అదేవిధంగా 3.9 శాతంగా ఉన్న పెట్రో లియం ఉత్పత్తుల వృద్ధి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని -5.3కి పడిపోయింది. 4.1 శాతంగా ఉన్న ఫార్మా రంగం వృద్ధి -1.3 దగ్గరకు వచ్చింది. యంత్రాల తయారీ రంగం వృద్ధి మరీ దారుణంగా నేలచూపులు చూసింది. ఏప్రిల్‌ నెలలోనే -0.9 శాతం ఉండగా, అది సెప్టెంబర్‌ నెలకు -18.1కి పడిపోయింది. అటోమొబైల్‌ రంగం పరిస్థితి దాదాపు తెరిచిన పుస్తకమే. -5 శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి సెప్టెంబర్‌ నాటికి మాంద్యం దెబ్బకు తీవ్రంగా పడిపోయి -24.8 వద్దకు చేరింది. ఆయా రంగాల్లో ప్రజల నుంచి సరిపడా డిమాండ్‌ లేకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సాధారణం కంటే తగ్గిన ద్రవ్యోల్బణం
ధరలకు సంబంధించి అస్థిరంగా ఉండే ఆహార, ఇంధన రంగాలను మినహాయించి ప్రధాన(కోర్‌) ద్రవ్యోల్బ ణాన్ని లెక్కిస్తారు. ఇది వ్యాపార డిమాండ్‌ను, ధరలను నిర్ణయించే కంపెనీల సామర్ధ్యాన్ని లెక్కిస్తుంది. ఇటీవల వరకూ బలంగా ఉన్న ద్రవ్యోల్బణం(డిమాండ్‌ బాగా ఉన్నట్లు అర్ధం), ఇటీవలి కాలంలో సాధారణం కంటే తక్కువ(డిమాండ్‌ తగ్గినుట్ల)కు పడిపోయింది. ఏప్రిల్‌లో 4.64 శాతంగా ఉన్న కోర్‌ ద్రవ్యోల్బణం, సెప్టెంబర్‌ నెలకు 3.34 శాతానికి తగ్గింది.
పడిపోయిన ఎగుమతులు, దిగుమతులు
2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఆయా ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు కూడా పడి పోయాయి. ఏప్రిల్‌ నెలలో 0.4, 6 శాతాలుగా ఉన్న ఎగుమతులు, దిగుమతుల వృద్ధి రేటు, సెప్టెంబర్‌ నాటికి -1.1, -16.4 శాతానికి పడిపోయాయి.

ఆర్థిక తిరోగమనం లేదు : నిర్మలా సీతారామన్‌
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ తిరగమనంలో లేదని, ఇప్పటికే వృద్ధిరేటుపై ఒక నిర్ణయానికి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కేరళకు చెందిన ఎంపీ ఎన్‌కె రామచంద్రన్‌ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జి-20 దేశాలతో పోల్చుకుంటే భారత్‌ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని, 2025 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించి తీరుతామని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి కాలంలో కొంత క్షీణత ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొంటూ ముందుకు పోతున్నామని అన్నారు. దేశంలోని వివిధ రంగాల్లో పెట్టుబడులను పెంచేందుకు తమ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. జిడిపి వృద్ధి రేటును పెంచేందుకు వినిమయ రేటు, ఎగుమతులను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై త్వరలోనే సమావేశం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణం, కరెంట్‌ ఖాతా లోటు పెరగకుండా, స్థూల ఆర్థిక విధానాలను పాటిస్తూ దేశంలోకి పెట్టుబడులను పెంచేందుకు పలు సంస్కరణలు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తి కంపెనీలకు 15 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ అనేది ప్రపంచంలోనే అత్యల్పమని అన్నారు.

Courtesy Prajasakti…