కదిలిస్తున్న వలస కార్మికుల కష్టాలు

సంగారెడ్డి  నాలుగు రోజుల తర్వాత ఈరోజే అన్నం తింటున్నాం. దారిలో ఎవరైనా పండ్లు, అల్పాహారం ఇస్తే తిన్నాం. లేదంటే మంచినీళ్లు తాగుతూ నడుస్తున్నాం. ఇదీ బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న మదన్‌లాల్‌ అనే వలసకూలీ ఆవేదన. కేవలం అతనొక్కడే కాదు. పొట్టకూటి కోసం ఉత్తరాది నుంచి వలస వచ్చిన ఎంతోమంది కూలీలు, లాక్‌డౌన్‌తో పొట్ట గడవక ఇలాంటి కష్టాలతోనే తమ స్వగ్రామాలకు పయనం సాగిస్తున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన వలస కూలీలు, నాలుగు రోజుల క్రితం బెంగళూరు నుంచి తమ స్వగ్రామాలకు నడక మొదలుపెట్టారు. మార్గమధ్యంలో ఏదైనా వాహనం ఎక్కించుకుంటే కొంచెం దూరం దానిలో ప్రయాణం. ఆపై మళ్లీ నడక. ఇలా సాగుతున్న వారి పయనం, సోమవారం పటాన్‌చెరు మండలం ముత్తంగి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్దకు చేరింది. రింగ్‌ రోడ్డు కింద వలస కూలీలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్థానికులు భోజనాలు సమకూర్చడంతో అప్పటికి వారి ఆకలి తీరింది. ఈక్రమంలో ఒకరిద్దరిని పలకరించగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వాలు తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరారు.

Courtesy Andhrajyothi