మోసగాళ్ల చేతిలో చిక్కి సామాన్య జనం విలవిల
స్వల్ప కాలంలోనే ఎక్కువ సొమ్ము పొందాలనే జనం ధోరణితో మాయగాళ్ల వంచన
దొంగతనాల్లో పోయిన సొత్తు కంటే మోసపోయిన నష్టమే ఏడెనిమిది రెట్లు అధికం
గత సంవత్సర గణాంకాలు వెల్లడిస్తున్నదిదే
సొమ్ము చేజార్చుకోవద్దని హెచ్చరిస్తున్న తాజా ఈ-బిజ్‌ మోసం

తక్కువ కాలానికే ఎక్కువ వడ్డీ రావాలని.. కనీస పెట్టుబడితో అధిక లాభాలు కావాలని కోరుకోని వారు ఉండరు. అలా కోరుకోవడం పేరాశేమీ కాదు. వారి పరిస్థితులు అలాంటివి. కాచుక్కూర్చున్న ఆర్థిక అవసరాలు.. అంటే పిల్లల చదువులు… పెళ్లిళ్ల వంటివి ఆ వైపు ఆకర్షిస్తున్నాయి. గాలిలో దీపం పెట్టి ఆరిపోకుండా ఉండాలనుకున్నట్టుగా, పెట్టుబడిగానో… డిపాజిట్‌ రూపంలోనో చేజారిపోయే సొమ్ము సురక్షితంగా రావాలని కోరుకోవడం తప్ప వారి చేతుల్లో ఏమీ ఉండట్లేదు. చాలా సందర్భాల్లో మోసపోవడమే వారికి పరిపాటవుతోంది. 2018లో రాష్ట్రంలో దొంగతనాలు, దోపిడీల ద్వారా కొల్లగొట్టిన మొత్తం రూ.149.57 కోట్లు. ఇదే ఏడాది ఆర్థిక మోసగాళ్ల వలలో చిక్కి సాధారణ జనం పోగొట్టుకున్న సొమ్ము అక్షరాలా రూ.1,126.42 కోట్లు. దాదాపు ఏడెనిమిది రెట్లు అధికం. ఆర్థిక నేరగాళ్లు ఎంతగా చెలరేగిపోతున్నారో ఈ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. వేలాడుతున్న ఎరను చూసి అందివచ్చిన ఆహారమని భ్రమించి గాలానికి చిక్కిన చేపల్లా బాధితులు విలవిల్లాడుతున్నారు.

దొంగతనాలు జరగకుండా అటు పోలీసుశాఖే కాదు వ్యక్తిగతంగా కూడా ప్రతిఒక్కరూ అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. చాలామంది ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు అమర్చుకుంటారు. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌ను పెట్టుకుంటారు. ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ ఏర్పాట్ల వంటివి ఉంటున్నాయి. పోలీస్‌ శాఖ గస్తీ వాహనాల సంఖ్య పెంచుతోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా ఉపయోగిస్తోంది. వీటన్నింటివల్ల సాధారణ దొంగతనాలు తగ్గుతున్నాయి. మరోపక్క మాయమాటలు నమ్మి అతి తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము చేతికొస్తుందని ప్రజలు తమంతటతామే డబ్బు చేజార్చుకుంటుంటే ఇలాంటి నేరాలను నిరోధించడం పోలీసులకూ సాధ్యం కావడంలేదు. అంతేకాదు ఉద్యోగాలు ఇప్పిస్తామని, రుణాలు మంజూరు చేయిస్తామని, ప్రభుత్వ పథకాల కింద నిధులు తెప్పిస్తామని… ఇలా మోసగాళ్లు విసిరే వలలు ఎన్నో… ఎన్నెన్నో. టీవీలు, పత్రికలు ఈ ఘోరాలను కళ్లకు కడుతున్నా  మోసపోయే ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. తాజాగా బయటకొచ్చిన ఈ-బిజ్‌ మోసం విలువ రూ.1,000 కోట్లు.

ఆశపడ్డంత కాలం మోసం జరుగుతూనే ఉంటుందనడానికి ఇంతక్రితం వెలుగు చూసిన కరక్కాయ…మునక్కాయ మోసాలు ప్రబల నిదర్శనం. ఔషధ గుణాలున్న కరక్కాయ పొడికి మంచి డిమాండు ఉందని, దాన్ని పొడి చేసి ఇస్తే ఇంట్లోంచి కాలు కదపకుండా భారీగా సంపాదించవచ్చని మోసానికి తెరలేపాడు నెల్లూరుకు చెందిన ముప్పాల మల్లికార్జున్‌. మరి కొందరితో కలిసి హైదరాబాద్‌లో కార్పొరేట్‌ కార్యాలయం తెరిచాడు. ఎవరైనా రూ.వెయ్యి కడితే కిలో కరక్కాయలు ఇస్తామని, దాన్ని పొడి చేసి ఇస్తే రూ.1,300 చెల్లిస్తామని ప్రచారం చేశాడు. రోజుకు 2 కిలోలు పొడిచేస్తే ఇంట్లో ఉండే.. పెద్దగా శ్రమపడకుండానే రూ.600 సంపాదించవచ్చు. మధ్యతరగతి గృహిణులను ఇది బాగా ఆకర్షించింది. చెప్పినట్లుగానే మొదట్లో చేరిన వారందరికీ ఠంచనుగా కరక్కాయ పొడి చేసినందుకు డబ్బు చెల్లించాడు. ఇది చూసి చుట్టుపక్కల వారికీ ఆశ పుట్టింది. పొలోమని వందల మంది ఈ పథకంలో చేరారు. అనతికాలంలోనే 600 మంది సభ్యులయ్యారు. వారివద్ద రూ.5 కోట్లు వసూలు చేసి అడ్రస్‌ లేకుండా పోయాడు.

మునక్కాయ మోసం మరో తరహాది. తమ సంస్థలో సభ్యులుగా చేరి మునక్కాయలో ఉండే ఔషధ గుణాలను ప్రచారం చేయాలని మరికొన్ని ఆరోగ్య ఉత్పత్తులు కూడా అందజేస్తామని హరియాణాకు చెందిన రాధేశ్యాం ఫ్యూచర్‌ మేకర్‌ లైఫ్‌ కేర్‌ (ఎఫ్‌.ఎం.ఎల్‌.సి.) స్థాపించాడు. ఈ ఉత్పత్తులు కావాలంటే రూ.7,500 కట్టి సభ్యులుగా చేరాలని, మరికొందర్ని చేర్పించాల్సి ఉంటుందని చెప్పాడు. కట్టిన డిపాజిట్లు ఉత్పత్తులతోపాటు ఇస్తామని, భారీగా కమీషన్లు కూడా పొందవచ్చని ప్రచారం చేశాడు. ఈ వలలో ఇరుక్కొని చాలామంది రూ.కోట్లలో నష్టపోయారు.

చైతన్యమే పరిష్కారం

* బ్యాంకు వడ్డీ కంటే ఎవరు ఎక్కువ ఇస్తామన్నా అనుమానించాల్సిందే. అలా ఇవ్వడం ఎవరికీ సాధ్యంకాదు.

* తక్కువ ధరకు వస్తువులు ఎవరూ అమ్మరు. ఖరీదైన వస్తువులు చౌకధరలకు ఇస్తామని చేసే ప్రకటనలకు మోసపోవద్దు. నష్టానికి ఎవరూ వస్తువులు అమ్ముకోరు.

* ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఆశపడి ఎవరూ ముందుగా డబ్బు చెల్లించవద్దు. ఏ సంస్థ కూడా ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బు వసూలు చేయదు.

* గొలుసుకట్టు పథకాల్లో అసలే చేరవద్దు. వాటన్నింటి వెనుకా మోసం దాగి ఉంది. మొదట్లో చేరిన ఒకరిద్దరికి లాభం వస్తుంది. దాన్ని చూపి మిగతా వారిని ఊబిలోకి లాగుతారు.

మునిగిపోయే వరకూ తెలియదు
– ఫణీంద్ర, క్యూనెట్‌ బాధితుడుపూర్తిగా మునిగిపోయే వరకూ మనకు జరుగుతున్న నష్టం గురించి తెలియదు. బాగా తెలిసిన వారి ద్వారానే మనపై ఉచ్చు వేస్తారు. క్యూనెట్‌ ఉచ్చులో నేను అలానే చిక్కుకున్నా. సైన్యంలో పనిచేసే పెద్ద అధికారి కుమారుడు నాకు దీన్ని పరిచయం చేశాడు. అతని ఖాతాలో పడ్డ డబ్బు చూపించే సరికి నేను కూడా బోల్తాపడ్డా. రూ.ఐదు లక్షలు పోగొట్టుకున్నా. మన డబ్బులు ఎలాగూ వెన క్కురావు. అందుకే మరికొంతమందిని చేర్పిస్తే మీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెబుతారు. మన డబ్బు కాపాడుకునేందుకు ఇతరుల డబ్బు కొల్లగొట్టాలని చూస్తాం. ఈ ఉచ్చులో ఇరుక్కొని అతికష్టంమీద బయటపడ్డా. ఇప్పుడు నాలాంటి బాధితుల కోసం పోరాడుతున్నా.
ఇలాంటి పథకాల్లో చేరవద్దు
– సజ్జనార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌అధిక లాభాలు ఆర్జించవచ్చని చెప్పే ఎలాంటి పథకాలనూ నమ్మవద్దు. ముఖ్యంగా మనీ సర్క్యులేషన్‌ పథకాలు మన దేశంలో నిషేధం. వీటిలో డబ్బు పెట్టి మోసపోయిన వారు ఫిర్యాదు చేస్తే ఒకవేళ ఆ డబ్బు తిరిగి వెనక్కి వచ్చినా అది బాధితులకు చేరదు. అది ప్రభుత్వానికే చెందుతుంది.
ఇటీవలి కాలంలో వెలుగుచూసిన మోసాల విలువ (రూ.కోట్లలో)

* హీరా గ్రూప్‌ రూ.5,600
* ఈ-బిజ్‌ రూ.1,000
* సన్‌పరివార్‌ రూ.150
* ప్రోహెల్తీ వెజ రూ.30

 

(Courtacy Eenadu)