యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షులు)

గాంధీ కోసం ఆయన రచనల్లో కాదు, జీవితంలో అన్వేషిద్దాం. గాంధీతో ఏకీభవించనప్పటికీ ఆయన అడుగుజాడల్లో నడిచిన వారి జీవితాల్లో మహాత్ముడిని దర్శిద్దాం. గాంధీ బోధనలు, మార్క్స్ భావాలను సమ్మిళిత పరిచిన శంకర్ గుహ నియోగిలో బాపూను చూద్దాం. అంబేడ్కర్, గాంధీలలో ఒకరిని ఎంచుకోవడాన్ని తిరస్కరించిన దేవనూర్ మహదేవ్ కృషిలో గాంధీ తత్వాన్ని కనుగొందాం. మరీ ముఖ్యంగా గాంధీ స్ఫూర్తిని మన జీవితాల్లో ఇక్కడే ఇప్పుడే నింపుకుందాం. కశ్మీరీల దుస్థితికి ఆవేదన చెందకుండా గాంధీ గురించి ఎలా మాట్లాడగలం?

గాంధీ శత జయంతి (1969)కి కొన్ని సంవత్సరాల ముందు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (గాంధీజీ రాజకీయాలకు భాష్యం చెప్పిన వారిలో నిస్సందేహంగా మహావివేకవంతుడు) గాంధేయవాదులను మూడు తరగతులుగా వర్గీకరించారు. మొదటి శ్రేణివారు సర్కారీ గాంధేయులు–- అధికార సోపానాలను అధిరోహించేందుకు మహాత్ముడిని వినియోగించుకున్న కాంగ్రెస్ నాయకులు; -రెండో శ్రేణివారు మఠాధీశ్ (మఠాల నిర్వాహకులు) గాంధేయులు–- గాంధేయ సంస్థలకు నేతృత్వం వహిస్తున్నవారు. ఈ రెండు తరగతుల (వీటికి వరుసగా నెహ్రూ, వినోబా భావే ప్రతినిధులని లోహియా భావించారు) వారి పట్ల లోహియా తన తిరస్కార భావాన్ని ఏనాడూ దాచుకోలేదు. ఈ సంప్రదాయ గాంధేయులకు పూర్తిగా విరుద్ధమైన కుజాత్ (అవిశ్వాసి, అప్రాశ్యుడు) గాంధేయులు మూడో శ్రేణి వారు. ఈ కుజాత్‌లు గాంధీని సంప్రదాయ విరుద్ధ మార్గాలలో అనుసరించేవారని లోహియా అన్నారు.

మొదటి రెండు తరగతులకు చెందిన సంప్రదాయ గాంధేయులు మహాత్మునికి నిజమైన వారసులు కారని లోహియా విశ్వసించారు. గాంధేయ వాదాన్ని సమున్నతంచేసి ముందుకు తీసుకు పోగలిగేది కుజాత్‌లే గానీ సంప్రదాయ అనుయాయులు కారని ఆయన వాదించారు. డాక్టర్ లోహియా తనను తాను కుజాత్ గాంధేయ వాదిగా భావించుకున్నారు. గాంధీ పట్ల ప్రగాఢ గౌరవమున్నప్పటికీ మూఢభక్తి లేని మేధో అనుయాయి లోహియా. మహాత్ముడి మాటలను చిలుకపలుకుల్లా వల్లించకుండా గాంధీ భావనలను తన సొంతరీతుల్లో స్ఫూర్తిదాయకంగా అభివృద్ధి పరచిన వివేక శీలి డాక్టర్ లోహియా.

గాంధీ జన్మించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా మన మందరమూ ఆయన్ని భక్తి పూర్వకంగా స్మరించుకుంటున్నాము. మహాత్ముని ప్రపంచ దృక్పథాన్ని పూర్తిగా వ్యతిరేకించే ఒక నిర్దిష్ట భావజాల అనుయాయుల నుంచి గాంధీని సంరక్షించే మార్గాలను ఇప్పుడు (గాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా) మనం అన్వేషించవలసివున్నది. ఆ భావజాల అనుయాయులు తమ స్వార్థ ప్రయోజనాలకు గాంధీని చాలా మొరటుగా వినియోగించుకుంటున్నారు. అటువంటి సంకుచిత సైద్ధాంతికుల విషయమై లోహియా 1963లోనే భారతీయులను అప్రమత్తం చేశారు. ‘భారత్ స్వాతంత్ర్యం పొందిననాటి నుంచీ మఠాధీశ్ గాంధేయులు సర్కారీ గాంధేయుల కొంగుపట్టుకుని వేళ్ళాడుతూనే వున్నారు’. మంచి మనుషులుగా కన్పించే ఆధ్యాత్మిక గాంధేయవాదులు, కాంగ్రెస్ పార్టీ అధికార దళారుల మధ్య సంబంధాల గురించి కూడా డాక్టర్ లోహియా పదే పదే మాట్లాడారు. బోసినోటి తాతయ్యగా, కరెన్సీ

నోట్లపై మందహాసం చేస్తూ కన్పించే మూర్తిగా గాంధీని కుదించివేసి నిజమైన గాంధీని ప్రజల స్మృతి పథాల నుంచి దూరం చేయడంలో సర్కారీ గాంధేయులు సఫలమయ్యారు. అత్యవసర పరిస్థితి (1975–-77)కి పూర్వమూ, తదనంతరం కూడా గాంధేయ సంస్థలు అధికారంలో ఉన్నవారితో చెట్టా పట్టాల్ వేసుకొని తమ ప్రగతిశీల దృక్పథాన్ని, నిర్మాణ కృషిని విడిచిపెట్టాయి. ప్రభవిస్తున్న కొత్త తరం వారితో బాంధవ్యాన్ని నెలకొల్పుకోవడంలో విఫలమై, భ్రష్టు పట్టాయి.

ఈ భ్రష్టత్వమే, గాంధీని బలిగొన్న మతోన్మాది వారసులు మహాత్ముడిని తమ సంకుచిత ప్రయోజనాలకు నిస్సిగ్గుగా ఉపయోగించుకునేందుకు, రంగాన్ని సిద్ధం చేసింది. 2002 మారణకాండ బాధితులను, సబర్మతీ ఆశ్రమం తన తలుపులు తెరువకుండా నిరాదరించడమే అందుకొక తిరుగులేని నిదర్శనం. భారతీయ జనతా పార్టీ తొలుత గుజరాత్‌లోను, ఆ తరువాత కేంద్రంలోను అధికారాన్ని స్వాయత్తం చేసుకోవడంతో గాంధేయ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకోవడం వారికి కష్ట సాధ్యమేమీ కాలేదు. గాంధీ పీస్ ఫౌండేషన్, సర్వ సేవా సంఘ్ లాంటివి మినహా గాంధేయ సంస్థలన్నీ మనుగడను కోల్పోయాయి లేదా పాలకులకు సహకరించేవిగా మిగిలిపోయాయి. గాంధీ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ, ఉపయోగపడే వ్యక్తి అయిపోయారు. ప్రతి ఉద్యమమూ ఆయన్ని ఆసరాగా చేసుకొంటోంది. శాకాహార అలవాట్లను ప్రోత్సహించేందుకు ఆయనను ఆదర్శంగా చూపుతున్నారు. నిరర్థక పర్యావరణ ఉద్యమాలకూ ఆయన రక్షక ఋషిగా భాసిల్లుతున్నారు. సరే, స్వచ్ఛ భారత్‌కు మహాత్ముడే బ్రాండ్ అంబాసిడర్ అని ప్రత్యేకంగా చెప్పాలా? గాంధీని రక్షించేందుకు మనకు కుజాత్ గాంధేయుల గాంధేయవాదం అవసరం.

గాంధీ శత జయంతి ఆయన జీవితం నుంచి నేర్చుకోవల్సిన సందర్భం కాగా, 150వ జయంత్యుత్సవాలు మహాత్ముడి గురించిన మూస భావాలను త్యజించడాన్ని నేర్చుకోవల్సిన సందర్భం. పరస్పరం పూర్తిగా విరుద్ధమైన ఇరవయ్యో శతాబ్ది భావజాలాల అనుయాయులు– -మార్క్సిస్టులు, అంబేడ్కరిస్టులు, హిందూత్వ వాదులు గాంధీ గురించి మూసభావాలను సృష్టించడంలో భాగస్వాములయ్యారు. ఆధునిక యుగ స్ఫూర్తి లేని పూర్వాచార పరాయణుడు, మితవాద హిందువు అన్న మూస భావాన్ని గాంధీ గురించి ఆయన అభిమానులు, వ్యతిరేకులు ఇరువురూ కల్పించారు. ఈ మూసభావాలను పూర్తిగా పరిహరించడమే నూట యాభైయవ జయంత్యుత్సవాలలో ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. గాంధీజీ పరిపూర్ణ అహింసావాది అనడంలో సందేహం లేదు. అయితే అహింస పేరిట అన్యాయాలను సహించాలని ఆయన ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు.

పిరికితనంతో వ్యవహరించడం కంటే హింసాత్మకంగా ఎదురుతిరగడమే మేలని ఆయన పదేపదే చెప్పేవారు. అణచివేతను ఎట్టి పరిస్థితులలోను ఆమోదించకూడదని ఆయన స్పష్టం చేశారు. అహింసను ప్రబోధించడం కాకుండా ప్రతిఘటనకు ఒక ఆయుధంగా అహింసను ఉపయోగించుకోవడమే గాంధీ వాణి విశిష్టత. ఆయన నికార్సయిన శాకాహారి. అయితే తన ఆశ్రమంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు సదా మాంసాహారంతోనే ఆతిథ్యమిచ్చిన ఉదారవాది, విశాల హృదయుడు మహాత్ముడు. ప్రకృతిని రక్షించడం పట్ల ఆయన అమిత శ్రద్ధ చూపేవారు. ఆయన పర్యావరణ వాదం నిరర్థకమైనది కాదు. సారహీన ప్రతీకలతో ఆయన సంతృప్తి పడేవారు కాదు పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న ఆధునిక నాగరికతను మౌలికంగా మార్చివేయాలని ఆయన సంకల్పించారు. అయితే ఆయన ఏ విధంగాను సంప్రదాయవాది కాదు. ఆయన మేధో స్పందనలు, పద్ధతులు, సందేశం స్పష్టంగా ఆధునికమైనవి.

గాంధీజీ ఒక హిందువుగా పుట్టారు. అంతిమ శ్వాస విడిచే వరకు ఒక హిందువుగా జీవించారు. అయితే సంప్రదాయ హిందూ ధర్మానికి ఒకరు ఎంత దూరం జరగగలరో అంత దూరం జరిగిన విశాల హృదయుడు గాంధీజీ. ఏ మత గ్రంథానికి, చివరకు తాను ఎంతో గౌరవించే భగవద్గీతకు కూడా ఆయన గుడ్డిగా కట్టుబడలేదు. మత గ్రంథాలలో అంటరానితనాన్ని సమర్థించే ఉపదేశాలను ఆయన నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు. ‘ఇది నా మాతృమూర్తి బోధించిన హిందూ ధర్మం కాదు’ అని ఆయన అనేవారు. గాంధీజీ విశ్వసించిన హిందూ ధర్మం సదా పరిణామ శీలమైనది. వర్ణ వ్యవస్థను సమర్థించే వ్యక్తిగా ప్రారంభమైన గాంధీజీ కుల వ్యవస్థకు తీవ్రవ్యతిరేకిగా పరిణమించారు. దళిత, దళితేతర యువతీ యువకుల మధ్య జరిగే వివాహాలకు మాత్రమే హాజరయి వధూవరులను ఆశీర్వదించేవారు. ఏక మత, ఏక కులస్తుల మధ్య జరిగే వివాహాలకు ఆయన వెళ్ళేవారు కాదు. హిందూ మత దురహంకారులను వ్యతిరేకించడంలో అనాలోచిత లౌకికవాద రాజకీయవేత్తగా ఆయన ప్రవర్తించేవారు కాదు. 1924లో కొహట్‌లో సంభవించిన మతతత్వ అల్లర్లకు ప్రధాన బాధ్యులు ముస్లింలే అని చెప్పడానికి ఆయన వెనుకాడలేదు. ఇలా చెప్పడం వల్ల తనకు ఎంతో ఆప్తులైన అలీ సోదరులతో స్నేహబంధానికి భంగం కలుగుతుందని తెలిసి కూడా సత్యావిష్కరణకు గాంధీజీ భయపడలేదు. బైబిల్‌ను ఎంతగా గౌరవించినప్పటికీ క్రైస్తవ మిషనరీల మతాంతరీకరణ కార్యకలాపాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ నూట యాభైయవ జయంత్యుత్సవాల రొదలో గాంధీజీ సందేశాన్ని ఎలా సంగ్రహించుకోవాలి? గాంధీ జీవితమే ఆయన సందేశంగా అర్థం చేసుకోవడమే అందుకు ఉత్తమ మార్గం. ఇటీవలి కాలంలో గాంధీని ఒక రచయితగా కుదించిన వారు చాలా మంది వున్నారు. నిజానికి ఆయన రచయిత కాదు. ఆయన రచనలన్నీ గౌణ ప్రాధాన్యం కలవి మాత్రమే. అవి, ఆయన రాజకీయ కార్యకలాపాలకు ఉపకరణాలు మాత్రమే. తన కార్యాచరణకు ఆయన ఉత్తమ భాష్యకారుడు కాదని చెప్పక తప్పదు. గాంధీ కోసం ఆయన జీవితంలో అన్వేషిద్దాం. గాంధీతో ఏకీభవించనప్పటికీ ఆయన అడుగుజాడల్లో నడిచిన వారి జీవితాల్లో మహాత్ముడిని దర్శిద్దాం. గాంధీ బోధనలు, మార్క్స్ భావాలను సమ్మిళిత పరిచిన శంకర్ గుహ నియోగిలో బాపూను చూద్దాం.

అంబేడ్కర్, గాంధీలలో ఒకరిని ఎంచుకోవడాన్ని తిరస్కరించిన దేవనూర్ మహదేవ్ కృషిలో గాంధీ తత్వాన్ని కనుగొందాం, మరీ ముఖ్యంగా గాంధీ స్ఫూర్తిని మన జీవితాల్లో ఇక్కడే ఇప్పుడే నింపుకుందాం. కశ్మీర్ లోయలో కశ్మీరీలు ఎదుర్కొంటున్న దుస్థితికి మౌన ప్రేక్షకులుగా ఉండిపోతూ, ఎలాంటి ఆవేదన చెందకుండా గాంధీ గురించి ఎలా మాట్లాడగలం? అమానుషంగా జరుగుతున్న మూక హత్యలు, ఇతర విద్వేష నేరాలను ఉపేక్షిస్తూ అహింసా ధర్మాన్ని ఎలా ఉపదేశించగలం? అసత్యాలు చెప్పుతూ, వంచనకు పాల్పడుతున్న వారిని నిలదీయకుండా సత్యాన్ని మనసా వాచా కర్మణా ఆచరించిన మహాత్ముడి జయంత్యుత్సవాలలో ఎలా పాలు పంచుకోగలం? గాంధీ పేరును స్మరించడం, భక్తి ప్రపత్తులతో గాంధీ భజన చేయడం చాలా సులువు. అయితే ఆ మహత్ముడి అడుగుజాడల్లో నడవడం చాలా కష్టం. అది అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. ‘ఆచారపరుల కంటే సంప్రదాయ వ్యతిరేకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించవలసివున్నదని’ లోహియా ఏనాడో మనలను అప్రమత్తం చేశారు.