•  జలుబు, దగ్గు ఉంటే వైరస్‌ సోకినట్లు కాదు
  • హైదరాబాద్‌ దాటనివారు భయపడక్కర్లేదు
  • కరోనాను ఎదుర్కోవడానికి సర్కారు సిద్ధం
  •  నోడల్‌ అధికారి విజయ్‌కుమార్‌

కరోనా (కొవిడ్‌19) వైరస్‌.. ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలివి. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో  వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారి విజయ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వైరస్‌ వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

తెలంగాణలో తొలి కేసు నమోదైంది కదా.. మనకు ప్రమాదం పొంచి ఉందా..?
ముందుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తా. కరోనా వైరస్‌ బాధితుడు ఎవరెవరిని కలిశారో వారందరినీ సంప్రదిస్తున్నాం. వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు ఉంటే వారిని ఇతరులతో కలవకుండా చేస్తాం. దీనివల్ల వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. ఇక కరోనా ఒక విపత్తుగా మారకుండా చూడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కరోనాను ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు.

ప్రజలకు మీరిచ్చే సూచనలేమిటి?
కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలి. వారికి పరీక్ష చేస్తే వైరస్‌ ఉందో లేదో తెలుస్తుంది. హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లని వారు భయపడాల్సిన అవసరం లేదు. అయితే దగ్గు, జలుబు ఉన్న వారు తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. బహిరంగంగా తుమ్మకూడదు. ఇక్కడో విషయం మరోసారి చెబుతున్నా. ఈ సీజన్‌లో ఫ్లూవంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు ఉన్నవారు కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదు.

వైర్‌సపై కేంద్రం నుంచి ఎలాంటి సూచనలు అందాయి?
కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఒకవేళ ఎవరికైనా సోకితే వారికి ఎలా చికిత్స చేయాలనే అంశాలను కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కరోనా వైర్‌సకు చికిత్స చేయడానికి గాంధీ ఆస్పత్రిని ఎంపిక చేశాం. ఇక్కడే చికిత్స కూడా జరుగుతుంది.

  1. తరచూ చేతులు కడుక్కుంటూ ఉండండి. దీని వల్ల చేతికి అంటిన వైర్‌సలు పోతాయి.
  2. జలుబు, దగ్గు ఉంటే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించి మందులు వాడండి.
  3. జలుబు, దగ్గు ఉంటే మాస్కు/రుమాలు పెట్టుకొనే బయటకు వెళ్లండి.
  4. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
  5. పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే స్నానం చేయించడం మంచిది.

ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ వాడాలి
చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌ వాడడం మంచిది. దీనివల్ల వైరస్‌ సోకకుండా నివారించవచ్చు. ఎండలు అధికంగా ఉన్నందున వైరస్‌ వ్యాప్తి ఉండకపోవచ్చు. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్‌లో ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు పలు ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయి. అలాగే జలుబు, జ్వరంతో ఉన్న వారికి సమీపంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలి.
– డాక్టర్‌ నరహరి

Courtesy Andhrajyothi