-అమరావతి బ్యూరో
తెలుగు ప్రజలు గర్వించదగ్గ గొప్ప సామాజిక తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం ఆశయాలను వివాదం చేయడం తగదని ప్రజాశక్తి పబ్లిషింగ్‌ హౌస్‌ సంపాదకులు ఎస్‌ వెంకట్రావు, జనరల్‌ మేనేజర్‌ కె లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు వారు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం…’వీరబ్రహ్మం తాత్విక, సామాజిక అంశాల’ పై కర్నూలులో సాహితీ స్రవంతితో సహా వందకుపైగా సాహిత్య, సామాజిక సంఘాలు కర్నూలులో సభను నిర్వహించాం. ఈ సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ సమకాలీన సమాజంలోని అనేక రుగ్మతలను ఎత్తిచూపి, పరిష్కారం చెప్పడమే గాక వీరబ్రహ్మం ఆచరించారని, అవి ఈ నాటికీ ఎంతో విలువైనవని వివరించారు. సమాజంలో పాతుకుపోయిన కుల తత్వాన్ని వీరబ్రహ్మం వ్యతిరేకించారని, మతం మనుషులను కలపాలిగాని, విడదీయరాదని, మనుషులను విభజించే మతాన్ని ఆచరించవద్దని వీరబ్రహ్మం ఆనాడే తెలిపారు. దేవుడు మనిషిలోనే ఉంటాడు గనుక దేవునికీ, మనిషికీ మధ్యవర్తులు అవసరంలేదంటూ, విగ్రహారాధనను వ్యతిరేకించారని అన్నారు. ఆచరణలో వీరబ్రహ్మం తన శిష్యులుగా మాదిగ కులం నుండి కక్కయ్యను, ముస్లిం మతం నుండి సిద్ధయ్యను తీసుకున్నారని వివరించారు. ఆచారాల పేరుతో స్త్రీలపై వివక్షను వ్యతిరేకించారని గుర్తుచేశారు. వీరబ్రహ్మం ప్రవచించి, ఆచరించిన ఉన్నతమైన ఆలోచనలు, ఆచరణలను సమాజం ఇంతకాలం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల నుండి వీరబ్రహ్మం మీద పరిశోధనలు చేసిన ప్రముఖుల రచనలు, ఆయన గురించి రాసిన వ్యాసాలతో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించిన 11 పుస్తకాలను ఆవిష్కరించారు. పుస్తకాలకు ప్రముఖ సాహిత్య విమర్శలు, ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు చాపాళెం చంద్రశేఖరరెడ్డి సంపాదకత్వం వహించారు. ఇంత శ్రమ పడి వీరబ్రహ్మం ఆశయాల ప్రచారం కోసం ప్రచురించిన పుస్తకాలను సాహిత్య, సాంస్కృతిక, తాత్విక రంగ ప్రముఖులు అభినందిస్తున్న సందర్భంలో కొంతమంది వీటిని వివాదాస్పదంగా మార్చడానికి ప్రయత్నించడం విచారకరం. వీరబ్రహ్మం జీవిత చరిత్రమీద డాక్టర్‌ ఎంఎం వినోదిని రాసిన పుస్తకంలో ఆయన కృషిని, ఔన్నత్యాన్ని ఆమె ఎంతగానో ప్రశంశించారు. ఆమె వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని, భిన్నాభిప్రాయాలను మేం గౌరవిస్తాం. కానీ వాటిని వివాదాలుగా మార్చి రచయితను బెదిరించడం, దూషించడం తగదు. ఈ పుస్తకాలపై వివాదాలు సృష్టించడం అంటే వీరబ్రహ్మంను అగౌరవపరచడమే.. ఇప్పటికైనా ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆపి ఆయన ఆశయాలను ఆచరించడం ఈనాడు అవసరం అని పేర్కొన్నారు.

Courtesy Prajashakti