• ఆ ప్రాంతంలో సైన్యం కోసం భారత్‌ చేపట్టే మౌలిక ప్రాజెక్టులకు వ్యతిరేకం
  • ఒప్పందాలకు లోబడి.. మా భూభాగంలో మాత్రం అలాంటి ప్రాజెక్టులు చేపడతాం
  • చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
  • 1959లో చౌ ఎన్‌లై ప్రతిపాదిత ఎల్‌ఏసీకి
  • తాము కట్టుబడి ఉన్నట్టు ఓ ప్రకటనలో వెల్లడి
  • ఘర్షణలకు భారత్‌ కారణమని ఆరోపణ
  • ఆ రేఖను మేం గుర్తించలేదు: భారత్‌
  • సరిహద్దుల్లో యథాతథస్థితిని చైనాయే
  • ఏకపక్షంగా ఉల్లంఘిస్తోందని స్పష్టీకరణ
  • సరిహద్దుల్లో యుద్ధం లేదు.. శాంతీ లేదు
  • భారత వైమానిక దళాధిపతి భడౌరియా

న్యూఢిల్లీ : ‘‘భారతదేశం అక్రమంగా ఏర్పాటు చేసిన లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని మేం గుర్తించం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. లద్దాఖ్‌ ప్రాంతంలో భారత్‌ చేపట్టిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. 1962 యుద్ధ సమయంలో చైనా ఆక్రమించిన అక్సాయ్‌చిన్‌ను కూడా భారత భూభాగంగా పేర్కొంటూ ఏర్పాటు చేసిన లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని తాము గుర్తించబోమని ఆ దేశం మొదట్నుంచీ పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో సైనిక అవసరాల కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు వాంగ్‌ వెన్‌బిన్‌ మంగళవారం పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో అలాంటివి చేపట్టడం పరిస్థితిని తీవ్రం చేస్తుందన్నారు. మరి చైనా చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సంగతేంటని ప్రశ్నించగా.. చైనా అన్ని ఒప్పందాలనూ గౌరవిస్తూనే తమ భూభాగంలో అలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోందని బదులిచ్చారు. భారత్‌ కూడా తమలాగే వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మా రేఖే ఫైనల్‌!
వాస్తవాధీన రేఖ నిర్వచనంపై చైనా ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేసింది. 1959లో చైనా ప్రీమియర్‌ చౌ ఎన్‌ లై ప్రతిపాదించిన ‘వాస్తవాధీన’ రేఖ నిర్వచనానికే కట్టుబడి ఉంటామని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. లద్దాఖ్‌, గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలకు భారత సైన్యమే కారణమని ఎదురుదాడి చేసింది. ‘చైనా-భారత్‌ మధ్య సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ చాలా స్పష్టంగా ఉంది. అది 1959, నవంబరు 7న ప్రతిపాదించిన రేఖ. 1950ల్లో చైనా ఈ విషయాన్ని ప్రకటించింది. భారత్‌ సహా అంతర్జాతీయ సమాజానికి ఈ విషయంలో స్పష్టత ఉంది. కానీ ఈ ఏడాది భారత సైన్యం అక్రమంగా సరిహద్దులు దాటుతూ వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా పొడిగించే ప్రయత్నం చేస్తోంది.

ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఘర్షణకు కారణం ఇదే. ఆ రేఖను అక్రమంగా దాటిన భారత సైనికులను, ఆయుధాలను భారత్‌ ఉపసంహరించుకున్నప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుంది’’ అని పేర్కొంది. ఘర్షణ ఇప్పట్లో ముగియదనడానికి ఇది సంకేతమని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, చైనా చెబుతున్న 1959నాటి వాస్తవాధీన రేఖ అంగీకార యోగ్యం కాదని భారత్‌ తేల్చిచెప్పింది. చౌ ఎన్‌లై ప్రతిపాదనను భారత్‌ నెహ్రూ హయాంలోనే తిరస్కరించిందని, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఒప్పుకోలేదని, ఈ విషయం చైనాకు కూడా తెలుసని గుర్తుచేసింది. వాస్తవాధీన రేఖ పొడవునా శాంతి సామరస్యాలు కొనసాగేందుకు ఇరు దేశాలూ 1993, 1996, 2005 సం వత్సరాల్లో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను గుర్తు చేసింది. ‘‘వాస్తవాధీన రేఖను నిర్వచించేందుకు రెండు దేశా లు 2003 దాకా చర్చలు జరిపాయి. ఆ తర్వాత ఆ కసరత్తును కొనసాగించేందుకు చైనా ఒప్పుకోకపోవడంతో ఆ ప్రక్రియ కొనసాగలేదు’’ అని భార త విదేశాంగ శాఖ తెలిపింది. ‘‘పశ్చిమ సెక్టార్‌లోని పలు ప్రాంతాల్లో భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలు చేయడం ద్వారా చైనానే యథాతథస్థితిని ఏకపక్షంగా ఉల్లంఘిస్తోంది. ఇకనైనా చైనా త్రికరణశుద్ధిగా ఉంటుందని, ఎల్‌ఏసీ విషయంలో అంగీకారయోగ్యం కాని ఏకపక్ష నిర్వచనాలు ఇవ్వకుండా ఉంటుందని భావిస్తున్నాం’’ అని పేర్కొంది.

రైఫిళ్ల కొనుగోలు
చైనాతో ఘర్షణ నేపథ్యంలో భారత సైన్యం అమెరికన్‌ అసాల్ట్‌ (ఎస్‌ఐజీ716) రైఫిళ్ల కొనుగోలుకు సిద్ధమైంది. రూ.780 కోట్లతో 72,400 ‘ఎస్‌ఐజీ 716’ రైఫిళ్ల కొనుగోలుకు రక్షణ కొనుగోళ్లమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో భారత సైన్యం 72,400 ‘ఎస్‌ఐజీ 716 జీ2’ రైఫిళ్లను కొనుగోలు చేసి నియంత్రణ రేఖ వద్ద ఉన్న సైనికులకు, కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌ చేపడుతున్న సైనికులకు అందజేసింది. లద్దాఖ్‌లోని సైనికులకు కూడా కొన్ని రైఫిళ్లను పంపింది. అదనంగా మరో 72,400 రైఫిళ్ల కొనుగోలుకు ఇప్పుడు ఆమోదం లభించింది.

Courtesy Andhrajyothi