• దీనిపై వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి
  • ఇప్పుడు కూలిస్తే న్యాయ ప్రక్రియను కూల్చినట్లే
  • దసరా సెలవుల తర్వాత పిటిషన్లపై విచారణ
  • సర్కారుకు హైకోర్టు ఆదేశం
  • పిటిషన్లపై దసరా సెలవుల తర్వాత విచారణ
  • అడ్వొకేట్‌ జనరల్‌కు నిర్దేశించిన ధర్మాసనం

హైదరాబాద్‌ : సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయంపై దాఖలైన వ్యాజ్యాలు కోర్టు ముందు విచారణలో ఉన్నందున భవనాల కూల్చివేతలు చేపట్టరాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. కోర్టులో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉండగా కూల్చివేతలు చేపడితే న్యాయ ప్రక్రియ (జ్యుడీషియల్‌ ప్రాసె్‌స)ను కూల్చివేసినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యాలపై దసరా సెలవుల అనంతరం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, సచివాలయంలోని కార్యాలయాలను ఇతర భవనాల్లోకి తరలించారని ధర్మాసనం దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. తరలించిన కార్యాలయాలు ఎక్కడ ఉంటే అక్కడ నుంచే విధులు నిర్వహించుకోవచ్చని, వాటిని తిరిగి సచివాలయానికి మా ర్చాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.

భవనాలను మాత్రం కూల్చవద్దని తేల్చిచెప్పింది. సచివాలయ భవనాల కూల్చివేత నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సామాజిక కార్యకర్త ఓఎం దేబ్ర, ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు, మరికొందరు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సచివాలయ భవనాలను దసరా సెలవుల్లో కూల్చివేసే అవకాశం ఉందని, మంత్రిమండలి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, తమ వ్యాజ్యాలను అత్యవసరంగా వినాలని ధర్మాసనం ముందు మంగళవారం ఉదయం పిటిషనర్లు ప్రస్తావించారు. దాంతో, భోజన విరామ సమయం తర్వాత విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. అయితే, మునిసిపల్‌ ఎన్నికలపై దాఖలైన వ్యాజ్యాల్లో విచారణ ముగిసే సమయానికే కోర్టు సమయం ముగిసింది. ఈ నేపథ్యంలోనే, సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించిన వ్యాజ్యాల విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

Courtesy Andhra Jyothy..