• ధరణి కోసం డేటా సేకరణ 21 వరకూ నిలిపేయండి
  • ఇప్పటికే సేకరించిన సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు
  • సంక్షేమ పథకాల అమలుకే ఆధార్‌ సేకరించాలి
  • ఆధార్‌, కులం వివరాల సేకరణకు చట్టబద్ధత లేదు
  • ఇది ప్రమాదకర పరిస్థితి.. ఎటు పయనిస్తున్నాం?
  • వ్యవసాయేతర ఆస్తులకు ఆధార్‌, కులం ఎందుకు?
  • ధరణి సమాచారం హ్యాకింగ్‌ కాదని గ్యారంటీ ఏంటి?
  • వెబ్‌సైట్‌లో పెడితే దుర్వినియోగమయ్యే చాన్స్‌ ఎక్కువ
  • ఆధార్‌, కులం వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయొద్దు
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు
  • తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా

హైదరాబాద్‌ : ధరణి వెబ్‌సైట్‌ కోసం సమాచార సేకరణను ఈనెల 21వ తేదీ వరకూ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘సంక్షేమ పథకాల అమలుకు ఆధార్‌ సంఖ్యను మాత్రమే వినియోగించాలని పుట్టుస్వామి కేసులో సుప్రీం కోర్టు చెప్పింది. కానీ, ధరణి కోసం ఆధార్‌ సంఖ్యతోపాటు కులం వివరాలు సేకరిస్తున్నారు. ఇలా ఏ చట్టంలోనూ లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మనం ఎటువైపు పయనిస్తున్నాం!?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్న సమాచారం హ్యాకింగ్‌కు వీలు కాదనడానికి గ్యారంటీ ఏమిటని నిలదీసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కౌంటర్‌ ప్రతులను మూడు రోజులు ముందుగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు అందించాలని తెలిపింది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుకు ఆధార్‌ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌ శర్మ వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి కె.ఆనంద్‌ కుమార్‌ దాఖలు చేసిన మరొక రిట్‌ పిటిషన్‌ను కూడా ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా, ధరణి వెబ్‌ పోర్టల్‌ హ్యాక్‌ అయిందని మంగళవారం ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సీజే చౌహాన్‌ ఉటంకించారు. ఆ కథనం ప్రకారం ధరణి వెబ్‌ పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్నాయని, దీంతో ప్రజలు అయోమయానికి గురవుతారని వ్యాఖ్యానించారు.

చట్టబద్ధత ఏదీ!?
ప్రజల ఆస్తులను ధరణిలో నమోదు చేయడానికి ఆధార్‌ సంఖ్య, కులం వివరాలను ఏ చట్టం ప్రకారం సేకరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎలాంటి చట్టబద్ధత లేకుండా ప్రభుత్వం కీలకమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించి వెబ్‌సైట్‌లో పెడుతోందని, ఇది దుర్వినియోగమయ్యే అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించింది. ధరణిలో అప్‌లోడ్‌ చేసేందుకు ఆధార్‌ సంఖ్య, కులం వివరాలు చెప్పాలంటూ ఒత్తిడి చేయరాదని నిర్దేశించింది. ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద కోరినా మూడో వ్యక్తికి ఇవ్వరాదని తేల్చి చెప్పింది. ‘‘రైతు బంధు పథకం అమలు చేస్తున్నందున ఆధార్‌ సంఖ్య సేకరిస్తున్నామని చెబుతున్నారు. మరి, వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్‌ సంఖ్యతోపాటు కులం, కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు?’’ అని సీజే ప్రశ్నించారు. ధరణిలోని సమాచారం ఇతరులకు చేరకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించారు.

సుపరిపాలన కోసమే ధరణి
వివాదరహిత సుపరిపాలన కోసమే ప్రభుత్వం ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టిందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ధర్మాసనానికి నివేదించారు. తద్వారా, భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయన్నారు. ధరణి సమాచారం హ్యాకింగ్‌కు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తుప్పుబట్టిన రెవెన్యూ చట్టాలను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం అర్హులకు చేరేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉదాహరణకు, అప్పటికే ఇల్లు ఉన్న వ్యక్తి ప్రభుత్వం పేదలకు కట్టిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ విధానం ద్వారా నియంత్రించవచ్చని తెలిపారు. ధరణి పోర్టల్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే కోటి మందికిపైగా నమోదు చేసుకున్నారని, ఇందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వివరాల నమోదుకు అనుమతించాలని ఏజీ కోరారు. ‘రైతు బంధు’ సంక్షేమ పథకమని, అందుకే, రైతుల ఆస్తుల వివరాల సేకరణకు ఆధార్‌ను లింక్‌ చేయడంలో తప్పు లేదని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు రెండు వారాలు గడువు కోరారు.

ఏజీ వాదనల తర్వాత సీజే జోక్యం చేసుకుంటూ.. రైతు బంధు సంక్షేమ పథకమని, అందుకే, వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ సంఖ్య సేకరిస్తున్నామని చెబుతున్నారని, మరి, వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్‌ సంఖ్యతోపాటు కులం, కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. ధరణిలో వివరాలన్నీ పొందుపరుస్తున్నారని, ఈ సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడితే.. మూడో వ్యక్తికి అందుబాటులో ఉంటే.. ప్రజల గోప్యత హక్కు ఉల్లంఘించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తుల వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని, ఇది ఆందోళనకరమైన విషయమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం న్యాయ సమ్మతం కాదని, ఏ చట్టంలోనూ లేదని సీజే వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi