కరోనాతో ఉపాధి గల్లంతు
చిల్లిగవ్వలేక.. కుటుంబం గడువక
దిక్కుతోచని స్థితిలోపనిమనుషులు
నేడు డొమెస్టిక్‌ వర్కర్స్‌ డే

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మం ది వరకు ఇంటి పనిమనుషులు (డొమెస్టిక్‌ వర్క ర్స్‌) ఉంటారని అంచనా. వీరిలో ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల నుంచి 5 లక్షలు మంది ఉంటారు. కొందరు మహిళలు ఇంటిపని, వంట పని, వృద్ధులు, చిన్నపిల్లల ఆలనాపాలన చూసుకుంటూ పూర్తిగా యజమాని ఇంటివద్దే ఉంటారు. వీరు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు సంపాదిస్తూ పొట్టపోసుకొంటున్నారు. ఇలాంటివారు 10శాతం వరకు ఉంటారు. కొద్దిమంది పొద్దుపొడవక ముందే లేచి తమ ఇండ్లలో పని పూర్తిచేసుకొని మూడు నుంచి నాలుగు ఇతరుల ఇండ్లలో పనిచేస్తుంటారు. ఇల్లు శుభ్రంచేసి, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం వీరిపని. వీరు నెలకు ఒక్కో ఇంట్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు సంపాదిస్తుంటారు. మన రాష్ట్రంలోనివారే గాక, బీహార్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు చెందిన మహిళలు కూడా ఇండ్లల్లో పనిచేస్తుంటారు. కొన్నిచోట్ల పురుషులు కూడా డొమెస్టిక్‌ వర్కర్స్‌గా కొనసాగుతున్నారు. వీరు తోటపని, సెక్యూరిటీ గార్డు తదితర పనులు చేస్తుంటారు.

కరోనాతో దెబ్బతిన్న ఉపాధి
కరోనా మహమ్మారి కారణంగా చిన్నాచితక పనులు చేసి పొట్టపోసుకొనే వారితోపాటు ఇంటి పనిమనుషుల పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది. వైరస్‌ ఎవరిద్వారా, ఎక్కడినుంచి వస్తుందోనన్న భయంతో అత్యధికులు తమ ఇండ్లలో పనిచేస్తున్నవారిని ముందుగా తొలిగించారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు పనిమనుషులకు ద్వారాలు మూసివేశాయి. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కరోనా దెబ్బకు పనిమనుషుల్లో 75 శాతం మంది ఉపాధి కోల్పోయారని తెలంగాణ డొమెస్టిక్‌ వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది.

పనిలేదు.. పూట గడువదు
ఇంటి పని చేసేవాళ్లలో చాలామంది కిరాయి ఇండ్లలో నివసిస్తున్నవారే. కరోనా నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో ఇల్లు గడవడమే కష్టమైపోగా.. ఇప్పుడు కిరాయి కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఇతర రాష్ర్టాలవారు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇండ్లలో పనిచేస్తున్నవారిలో అత్యధికులు ఫుల్‌టైమ్‌ వర్కర్లే. ప్రత్యామ్నాయంగా వేరే పనులు చూసుకుందామనుకున్నా ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయని వారు వాపోతున్నారు.

డొమెస్టిక్‌ వర్కర్స్‌ యాక్ట్‌ 2008
పనిమనుషుల భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్‌ వర్కర్స్‌ యాక్ట్‌ 2008ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం 18 ఏండ్లు పైబడి 60 ఏండ్లలోపు ఉన్నవారెవరైనా ఒక ఇంటిలో ఏడాదికి 90 రోజులకు తక్కువకాకుండా పనిచేస్తూ ఉంటే వారిని డొమెస్టిక్‌ వర్కర్‌గా గుర్తిస్తారు. అసంఘటితరంగ కార్మికులలో వీరు కూడా ఒక భాగం. ఈ చట్టం వారికి కొన్ని రక్షణలను కల్పించింది. అందులో ప్రధానంగా పనిచేస్తున్న చోటే ఉన్న డొమెస్టిక్‌ వర్కర్‌కు ఆ రోజు పని పూర్తయి, మళ్లీ పని మొదలయ్యే మధ్య వ్యవధిలో కనీసం 10 గంటల విశ్రాంతి ఉండాలి. ఏడాదికి 15 రోజుల సెలవివ్వాలి. పెన్షన్‌తో కూడిన వేతనం, మెటర్నిటీ లీవ్‌, వీక్లీ ఆఫ్‌ కల్పించాలి. పనిచేస్తున్న చోట మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తే రూ.50 వేల జరిమానా, 6 నెలల నుంచి గరిష్ఠంగా ఏడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశమున్నది.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన విజయలక్ష్మి భర్త కొన్నేండ్ల క్రితం మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇండ్ల లో పనిజేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నది.కరోనా మాయరోగానికి జడిసి ఇంటి యాజమానులు ఆమెను పనికి రావొద్దన్నారు. దీంతో చేతిలో పనిలేక.. ఇంటి కిరాయి కట్టలేక.. బిడ్డలను ఎలా సాకాలో తెలియక పొట్టచేతపట్టుకొని ముసలి తల్లి పంచనచేరింది. పూరిగుడిసెలో తల్లి, ముగ్గురు పిల్లలతో కలిసి భారంగా బతుకీడ్చుస్తున్నది.

ఎల్బీనగర్‌కు బాలమణి భర్త కొన్నేండ్ల క్రితం కాలం చేయడంతో ఆ ఇంటా ఈ ఇంటా పనిచేసి ఉన్న ఒక్క బిడ్డ పెండ్లి చేసింది. తాగుడుకు బానిసై అల్లుడు చనిపోగా.. కొన్ని రోజులకే బిడ్డకూడా కాలం జేసింది. దీంతో ఆమె ముగ్గురు పిల్లలకు బాలమణే దిక్కయింది. ఇండ్లళ్ల పనిజేసుకుంటూ వారిని సాకుతున్నది. కరోనా దెబ్బకు ఇప్పుడు ఆమెకు పనిలేకుండా పోయింది.

ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా వల్ల చాలామంది ఇంటి పనివాళ్లు ఉపాధి కోల్పోయారు. ఇంటి కిరాయిలు కట్టలేక, కుటుంబాన్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నారు. పని మనుషులను ప్రభుత్వమే ఆదుకోవాలి. వలస కార్మికులకు అందించినట్టుగానే వారికి రేషన్‌ సరుకులను, కొంత నగదు సాయం అందజేయాలి. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాం.
– లిస్సీ జోసెఫ్‌, తెలంగాణ డొమెస్టిక్‌ వర్కర్స్‌ ,యూనియన్‌ ప్రెసిడెంట్‌

Courtesy Namasthe Telangana