తాగుబోతు మొగుళ్లపై డయల్‌-100కు ఫిర్యాదులు
అమ్మకాలు మొదలైన రోజే రికార్డు కేసులు

హైదరాబాద్‌ : హలో సార్‌.. మా ఆయన తాగొచ్చి గొడవ పడుతున్నాడు. మీరు వచ్చి కేసు పెట్టండి.. సార్‌.. నా భర్త మద్యం మత్తులో నన్ను, పిల్లల్ని కొడుతున్నాడు.. జర భయం చెప్పండి. ఇవి గత 10 రోజులుగా డయల్‌-100కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలుగా లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా.. రోజూ తాగొచ్చి గొడవ పెట్టుకునే భర్త, మందు దొరక్క ఇంటి పట్టునే ఉండటంతో ఎంతోమంది గృహిణులు సంతోషపడ్డారు. 45 రోజులు మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. అయితే మే 7 నుంచి ప్రభుత్వం మద్యం అమ్మకాలను అనుమతించింది. దీంతో లిక్కర్‌ అమ్మకాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి గృహహింస కేసులు తిరిగి ఊపందుకున్నాయి. 45 రోజులుగా అడపాదడపా గృహహింస కేసులు నమోదు కాగా, గడిచిన పది రోజుల్లో పరిస్థితి తారుమారైంది. జనవరి నుంచి ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకుపైగా గృహ హింస కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతంలో రోజుకు సగటున 400 వరకు కేసులు నమోదయ్యేవి. లాక్‌డౌన్‌లో ఆ సంఖ్య సగానికిపైగా తగ్గింది. ఏప్రిల్‌లో గరిష్ఠంగా ఒకరోజు 90 కేసులే నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 35,765 కేసులు నమోదయ్యాయి. అందులో జనవరి-11,461, ఫిబ్రవరి-10,875, మార్చి-10,414, ఏప్రిల్‌ (23వరకు)- 3,015 కేసులు ఉన్నాయి. మే మొదటి ఆరు రోజుల్లో గృహహింస కేసులు 325 నమోదయ్యాయి. అది కూడా మద్యం అమ్మకాలు మరుసటి రోజు(మే 7 నుంచి) మొదలవుతాయనగా అత్యధిక కేసులు నమోదయ్యాయి. అంత కు ముందు వరకు గరిష్ఠ కేసుల సంఖ్య మే లో 165. మద్యం అమ్మకాలు ప్రారంభమైన మొదటిరోజే 524 కేసులు నమోదవడం విశేషం. మే 1 నుంచి 17 వరకు 5,034 గృహహింస కేసులు నమోదయ్యాయి. మొదటి 6 రోజుల్లో 1,042, మిగతా పదిరోజుల్లో 3,992కేసులునమోదయ్యాయి.

పోలీసుల టెలీ కౌన్సెలింగ్‌..
గృహహింసకు సంబంధించి డయల్‌-100తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కేవలం మద్యం తాగడం వల్లనే కాకుండా ఇతరత్రా కారణాలతో భర్త, అత్తింటి వారు తమపై చేస్తున్న దాడులపై బాధిత గృహిణులు పోలీ్‌సలకు ఫిర్యాదు చేస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న కేసుల్లో పోలీసులు సత్వరమే కేసులు నమోదు చేస్తున్నారు. కౌన్సెలింగ్‌తో పరిస్థితిలో మార్పు వస్తుందనుకునే వారికి మహిళా భద్రత విభాగం నేతృత్వంలో ప్రత్యేకంగా టెలీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

Courtesy Andhrajyothy