ధరమ్‌కరం రోడ్డులో శునకాల వీరంగం
వీధి కుక్కలను కరిచిన పిచ్చికుక్క
ఆనక రెచ్చిపోయిన శునకాలు
ఫిర్యాదు అనంతరం కుక్కలను తీసుకెళ్లిన జీహెచ్‌ఎంసీ

అమీర్‌పేట/రాంనగర్‌/హైదరాబాద్‌ : సమయం మధ్యాహ్నం 3 గంటలు.. ప్రాంతం అమీర్‌పేటలోని ధరమ్‌కరం రోడ్డు… పాఠశాలల నుంచి విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారు. ఇంతలో ఓ పిచ్చికుక్క అక్కడి రోడ్లపై కొన్ని కుక్కలను కరిచింది. అంతే ఆ కుక్కలూ రెచ్చిపోయాయి. రహదారిపై నడుచుకుంటూ, వాహనాలపై వెళ్తున్న వారిని విచక్షణారహితంగా కరిచాయి. నిమిషాల వ్యవధిలోనే 50 మందికిపైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. గాయపడ్డ వారిలో విద్యార్థులు, యువకులు, వయోధికులు ఉన్నారు. అప్రమత్తమైన స్థానికులు పిచ్చి కుక్కను చంపేశారు.

మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు శునకాలు బీభత్సం సృష్టించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ధరమ్‌కరమ్‌ రోడ్డులో పాఠశాల విద్యార్థులు, పాదచారులు భయంతో పరుగులు తీశారు. కుక్కలు రెచ్చిపోతుండడంతో తమను ఎక్కడ కరుస్తాయో అన్న భయంతో పిల్లలను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాత్రి 6 నుంచి 7 గంటల మధ్య ఆ రోడ్డుపై వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. కుక్కల దాడిలో గాయపడిన వారు వివిధ ఆస్పత్రులతో పాటు ఫీవర్‌ ఆస్పత్రిలోనూ చికిత్స పొందారు. ఎదురుపడ్డ ప్రతిఒక్కరినీ గాయపరిచిన పిచ్చికుక్కను అమీర్‌పేటలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సమీపంలో స్థానికులు కర్రలతో కొట్టి చంపారు. దీంతో ధరమ్‌కరమ్‌ రోడ్డు, శ్యాంకరమ్‌రోడ్డు, లీలానగర్‌, ప్రకృతి చికిత్సాలయం ఏరియా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అమీర్‌పేటలో పిచ్చికుక్కలు వీరంగం చేస్తున్నాయన్న సమాచారంతో ఖైరతాబాద్‌ వెటర్నరీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చి వాహనంలో వీధికుక్కలను తీసుకెళ్లారు.

ఫీవర్‌ ఆస్పత్రికి 77 మంది
నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం కుక్కకాటుకు గురైన 77 మంది చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ కొద్ది రోజులుగా నగరంలో కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయని, మంగళవారం ఒక్కరోజే 77 కేసులు వచ్చాయని తెలిపారు. కుక్కకాటు బాధితులకు ఫీవర్‌ ఆస్పత్రిలో తగిన ఇంజెక్షన్‌, ఇతరత్రా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కుక్కకాటుకు గురైతే బాధితులు నేరుగా ఫీవర్‌ ఆస్పత్రికి రావాలని సూచించారు.

(Courtesy Andhrajyothi)