– మనుషుల మరణాలపై కేసులేవీ?
– సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు

అసలే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ప్రగతిభవన్‌. అందులో పెంపుడు కుక్క. ఆరోగ్యం బాగాలేక వైద్యానికి తీసుకెళ్లారు. అది కాస్తా చనిపోయింది. వైద్యం వికటించి కుక్క చనిపోయిందని చికిత్స చేసిన వైద్యునిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది. అంతే ఆ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్ల పలు రకాల కామెంట్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా డెంగ్యూ, ఇతర జ్వరాల బారిన పడి ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సమయానికి వైద్యం అందక, వైద్యం వికటించి పలువురు చనిపోయినా దానిపై ఎలాంటి చర్యలు లేవు. ప్రజలు వైద్యం అందక మరణిస్తుంటే ఎవరిపై కేసు నమోదు చేయాలని నెటిజన్లు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కుక్కకున్నపాటి విలువ కూడా మనుషులకు ఇవ్వడం లేదన్ని కామెంట్లుతో మెతపుట్టిస్తున్నాయి. ఎన్నికలు,గెలుపు తప్ప మరో యావలేని ప్రభుత్వం పారిశుధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాపానికి ప్రజలు శిక్ష అనుభవించాలా అని నిలదీస్తున్నారు. జనవరి నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 4500 వరకు డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఇతర జ్వరపీడితుల సంఖ్య లక్షలకు చేరింది.

ప్రతి రోజు జ్వరంతో వచ్చే వారి సంఖ్య సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే రోగులకు రెట్టింపయింది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, నీలోఫర్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులు సంఖ్య బారీగా పెరిగింది. గాంధీ ఆస్పత్రికి మామూలు రోజుల్లో 1500 నుంచి 2000 మధ్యరోగులు వస్తుండగా ఇది కాస్తా 3000ను మించిపోయింది. మిగిలిన ఆస్పత్రుల్లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది.

అయితే ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సరిపడినంత వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది లేకపోవడం, మందుల కొరత, రోగ నిర్ధారణ పరికరాలు పాడైపోవడంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లలేని వారు ప్రభుత్వాస్పత్రుల్లోనే అరకొర వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు. పూర్తిస్థాయి వైద్యం అందించకపోవడంతో చోటుచేసుకుంటున్న మరణాలకు ఇప్పటి వరకు ఎవరిపైనా కేసులు నమోదుకాలేదు. అయితే కుక్క చావుకు మాత్రం కేసు నమోదు చేయడం గమనార్హం.

జ్వర బాధితుల్లో కూడా 30 శాతం నుంచి 40 శాతం మంది వరకు ఉంటున్నారు. వీరికి వైద్యం సకాలంలో అందడం లేదు. చాంతాడంత క్యూలు దాటుకుని వైద్యునికి చూపించుకున్నప్పటికీ తర్వాత ఔషధాలు పూర్తిగా దొరకక ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది. పలుమార్లు రోగ నిర్ధారణ పరీక్షల కోసం తప్పనిసరిగా ప్రయివేటు ఆస్పత్రికి పంపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం డెంగ్యూతో ఇంత వరకు ఎలాంటి మరణాలు జరగలేదని చెబుతున్నది. అధికారులు డెంగ్యూ కేసులు 4000కు పైగా ఉన్నాయని అంటున్నారు. పారిశుధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఫలితమే జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయని వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా జ్వరం కేసులు పెరిగిపోయాయని, వాటిని తాము ఫీవర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నట్టు గాంధీ ఆస్పత్రి వైద్యుడొకరు తెలిపారు.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలా? వైద్యఆరోగ్య శాఖ మంత్రిపైనా? లేక పూర్తి మంత్రివర్గంపైనా ? అని వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

(Courtacy Nava Telangana)