స్థానిక సంస్థల ద్వారా ఆదాయలు పొందటానికి పాలక పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మార్కెట్‌ కమిటీలు, రైతుబంధు సమన్వయ కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలు, పాఠశాల కమిటీలు, హాస్పిటల్‌ కమిటీల లాంటివి ఎన్ని ఏర్పాటు చేసినా ఇవి ప్రజల కొరకు కాకుండా పాలక పార్టీల కొరకే పని చేస్తున్నాయి. అందువల్ల నేటికి 1946 నాటి పోరాట స్ఫూర్తిని ప్రజలు కొనసాగించక తప్పని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. అందుకు సిద్ధంగా అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించడమే నేటి మార్గం.

తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు కా|| దొడ్డి కొమరయ్య మరణించి 73సంవత్సరాలు గడిచింది. ప్రపంచమంతా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ”చారిత్రక” పోరాటంగా అభివర్ణిస్తున్నది. దేశంలోని, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ పోరాటాన్ని ఏదో రూపంలో బలపరుస్తున్నవారే? కొంత మంది ఈ పోరాటానికి తామే వారసులమని కూడా పోటీలు పడడం జరుగుతున్నది. ఈ పోరాటం భూ సమస్యల పరిష్కారమే కాకుండా, కుల వివక్షత, మత ఘర్షణలను రూపుమాపింది. నాడు తెలంగాణలో అన్ని కులాలు, మతాలు ఈ పోరాటంలో ఏకతాటిపై నిలిచాయి. నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలోని ముస్లింలు అందరికన్నా ముందు ”కామ్రేడ్స్‌ అసొసియేషన్స్‌” ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ”నీబాంఛన్‌, కాల్లు మొక్కుతా?” అన్న స్థాయి నుంచి అన్ని స్థాయిలలో ధైర్యంగా నిలబడి తమ హక్కులు సాధించుకున్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ నాటి పొరాట స్ఫూర్తితో వచ్చినదే.

నాటి ఫ్యూడల్‌ అనుభవాలు సమిసిపోయి, పెట్టుబడిదారీ విధానం అమలులోకి వచ్చినా.. నేటి పాలక వర్గాలు గత ఫ్యూడల్‌ భావాలనే పాలనలో ప్రజలకు చూపిస్తున్నాయి. నాడు పంపిణీ చేసిన భూములను తిరిగి భూస్వాములకు కట్టబెట్టటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. మొదటి ప్రయత్నంగా కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభారు పటేల్‌ తన సైన్యాలను దించి 2500మంది కమ్యూనిస్టు నాయకులను సైన్యాలతో ఊచకోత కోయించాడు. ఆ తరువాత భూ సంస్కరణల పేరుతో ధనికులకు భూములు కట్టబెట్టాటానికి పి.వి. నర్సింహ్మారావు ముఖ్యమంత్రిగా 1.1.1973న భూసంస్కరణల చట్టం తెచ్చినప్పటికీ.. 1.1.1975న జలగం వెంగళరావు దాని అమలుకు పూనుకున్నాడు.

ఈ రెండు సంవత్సరాలలో పోరాటం సాధించిన భూములలో కొంత భాగాన్ని తిరిగి పారిపోయిన భూస్వాములకు అప్పగించారు. ఆ చట్టం ప్రకారం వచ్చిన సీలింగ్‌ మిగులు భూములు నేటికి టీఆర్‌ఎస్‌ పాలనలో ఇంకా 89,000ఎకరాలు పంచాల్సి ఉంది. అయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ భూములను పంచటానికి సిద్ధంగా లేదు. సీలింగ్‌ భూములు, భూదాన యజ్ఞభూములు, ప్రభుత్వ భూమి, అటవి భూములు, భూస్వాములకు, పెట్టుబడి దారులకు వేల ఎకరాలలో అప్పగిస్తున్నారు. అభివృద్ధి కొరకు అని చెపుతున్నప్పటికీ అభివృద్ధి లేకపోగా ఆ భూములు మాత్రం వారికి రియలేస్టేట్‌ వ్యాపారంలో వేల కోట్లు అర్జించి పెడుతున్నాయి. తరతరాలుగా వస్తున్న కౌలు చట్టాలను మార్చి పాత భూ పట్టా దారులకు భూమి కట్టబెట్టటానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతున్నది. తెలంగాణ వ్యవసాయం కౌలు రైతులతోటే ప్రారంభమైందన్న వాస్తవాన్ని నేటికైనా పాలకులు గుర్తించాలి. చట్టాలను మార్చడం కాదు, చట్టాలను అమలు చేయటానికి ప్రయత్నించాలి. అందరికీ చదువు అన్న నినాదం నేటికి తెలంగాణలో 66శాతం దాటలేదు. వామపక్ష ప్రభుత్వాలు కేరళ, బెంగాల్‌, త్రిపురలలో 96శాతానికి అక్ష్యరాస్యతను కల్పించాయి. అవి కల్పించడం ద్వారానే భారత దేశంలో 74శాతం అక్ష్యరాస్యత ఉంది. రాష్ట్రంలో 32.65లక్షల కుటుంబాలున్నప్పటికీ ఇందులో 10లక్షల కుటుంబాలకు ఎకరంలోపు, 7లక్షల కుటుంబాలకు 2ఎకరాలలోపు మాత్రమే భూములు ఉన్నట్లు సర్వే చెప్తున్నది.

గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని వారు 48శాతం ఉన్నట్టు ఒక సర్వే నిర్ధారించింది. వారికి ఉపాధి లేకపోవడంతో విద్య, ఆరోగ్యం అందుబాటులో లేకుండా పోతున్నది. పట్టణ ప్రాంతాలలో మురికి వాడలలో నివాసిస్తున్న వారి పరిస్థితి ఆధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వం మాత్రం అనేక పథకాలను ప్రకటిస్తున్నది. సంవత్సరం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాను ఎన్నికలలో హామీ ఇచ్చిన పనులన్ని పూర్తి చేశాననీ, ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే చెప్పండి అని ఒక బహిరంగా సభలో ఉద్ఘాటించారు. కానీ నేటికి 20 లక్షల ఇండ్లులేని కుటుంబాలు ఉన్నాయి. 35సంవత్సరాలకు పైబడిన వారిలో 50శాతం మందికి అక్ష్యరాస్యత లేదని రాష్ట్ర ఎకనమిక్‌ సర్వే తెలియజేస్తున్నది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు 2.83లక్షలు మంజూరు చేసి 42,000 మాత్రమే పూర్తి చేసినట్టు ప్రభుత్వమే చెప్పింది. దళితులు 6లక్షల కుటుంబాలకు, కుటుంబానికి 3ఎకరాల భూమి పంపిణీ చేస్తామని నేటికి 1600మందికి మాత్రమే భూమి పంపిణీ చేయడం జరిగింది. మిషన్‌ భగీరథ కింద రాష్ట్రంలో 23,968 గ్రామాలు, 63పట్టణాలు ఉండగా నేటికి 10,000గ్రామాల నుంచి మాత్రమే తాగునీటి సరఫరా అందినట్లు తీర్మాణాలు వచ్చాయి. మిషన్‌ కాకతీయ కింద చెరువుల బాగుచేతకు 46,531 నీటి వనరులు ఉండగా పని మొదలుపెట్టినవి 26,000 కాగా, పూర్తి అయినవి 14,000 మాత్రమే. ఇంత ఆట్టహాసంగా ప్రకటించిన పథకానికి వ్యయం రూ.4,500 కోట్లు మాత్రమే.

గ్రామ పంచాయతీలను స్వయం పాలన కిందికి తెస్తానని చెప్పిన ప్రభుత్వం నేటికీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనున్న 29అంశాలను గ్రామ పంచాయతీలకు మార్చలేదు. 2014 నుంచి 2019 వరకు గ్రామ పంచాయితీలకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి 48,612 కోట్లు కేటాయించగా, వ్యయం చేసింది 29,789 కోట్లు మాత్రమే. చివరికి కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చే నిధులు కూడా సకాలంలో గ్రామాలకు చేరడంలేదు. రహదారుల విషయం పరిశీ లన చేస్తే రాష్ట్రంలో 67,409 కి.మీ.లు ఉండగా అందులో నేటికి 18,864 కి.మీ.లు మట్టి రోడ్లే. మరో 12,732 కి.మీ.లు గ్రావెల్‌ రోడ్లుగా ఉన్నాయి. అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు.

ఒక సమాజం నాగరిక సమాజంగా మారలంటే, సాగునీరు, తాగునీరు, ఉపాధి, విద్య అత్యంత అవసరం. ఈ మూడు సమకూరితే ఆ సమాజంలో మార్పు వస్తుంది. కానీ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హమీలైన కేజీ టు పీజీ విద్య, అందరికీ ఉపాధి, అందరికీ ఆరోగ్యం, నేటికీ అందని ఫలాలుగానే ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధిలేని, పౌష్టికాహారం లేని 5ఏండ్లలోపు పిల్లల మరణాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ మరణాల నివారణలో కేరళను భారత దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిన్నటి సర్వేలో తేల్చారు. ఇక్కడి పాలకులు ఆస్తులు సంపాదించడం ఎలా?, బడ్జెట్‌ ఎంత పెంచి ఎంత కోత పెట్టాలనే ఆలోచన తప్ప, ప్రజల కొరకు, వారీ అవసరాలను పరిష్కరించే వారు కారని గత 73ఏండ్ల అనుభవం చెపుతున్నది. స్వాతంత్య్రనంతరం నుంచి నేటికి రెండు తరాలు గడిచిపోగా, ప్రస్తుతం మూడవ తరం అధికారంలోకి వస్తున్నది. అయినా ప్రాథమిక, మౌలిక, సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. కారణం పాలకుల విధానాలే.

ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటీకరణ పేరుతో స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి కేంద్రం సహాకారంతో చట్టాలను రూపొందించి, ఆర్డినెన్స్‌లు తెచ్చి, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో నిర్మాణం చేసిన సంస్థలను కైంకర్యం చేస్తున్నారు. ఈ మధ్య నిర్మల సీతారామన్‌ ప్రవేశ పెట్టిన 21లక్షల ఆర్థిక ప్యాకేజీలో భారత పారిశ్రామిక రంగంలో సంస్కరణలను ప్రోత్సహించి అమలు జరపాలని చెపుతూ.. బొగ్గు, ఖనిజ సంపద, విద్యుత్‌ తదితర సంస్థలను ప్రయివేటీకరించ బూనుకున్నారు. 500 బొగ్గు బ్లాకులను దేశంలో ప్రయివేట్‌ రంగంలోకి తెస్తారట. చివరికి ఆయుధ ఉత్పత్తిని కూడా ప్రయివేట్‌ రంగానికి అప్పగించారు. విద్యుత్‌, విమానయాన సంస్థలను ప్రయివేట్‌ రంగంలోకి నెట్టుతున్నారు.

వైద్యంలోనూ ప్రయివేట్‌ రంగంలో పడకలను పెంచటానికి నిర్ణయం తీసుకున్నారు. చివరికి ప్రయివేట్‌ భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశోధనలకు కూడా రంగం సిద్ధం చేశారు. కేంద్రం కన్నా తామేమి తక్కువ తినలేదని రాష్ట్ర ప్రభుత్వం సెజ్‌ల పేరుతో, పరిశ్రమల అభివృద్ధి పేరుతో దళిత, గిరిజనులకు ఇచ్చిన భూములను పూర్తిగా లాగేసుకుంటున్నది. 14ఏండ్ల లోపు వయస్సు కలిగిన వారితో పనులు చేయించకూడదని లెబర్‌ యాక్ట్‌ చెప్తున్నా, హైదరాబాద్‌ పట్టణంలోనే 20,000మంది ఆనాధ పిల్లలు రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లో.. ఆటో రిపేర్లు, హోటళ్ళు, చెత్త ఎరడం తదితర ప్రమాదకర పనులు చేస్తున్నారు. వీరేకాక గ్రామాలలో కూడా బడికి వెళ్ళాల్సిన వారిలో 10శాతం పిల్లలు వ్యవసాయ పనులకు, కూలీ పనులకు వెళ్తున్నారు. ఉన్న భూములు, ఆస్తులు కోల్పోయి ప్రభుత్వం చౌక డిపోల ద్వారా ఇచ్చే బియ్యంపై ఆధారపడుతున్నారు. పౌష్టిక ఆహారం లోపం వల్ల పుట్టుకలోనే చనిపోతున్నారు.

గిరిజనుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 70ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను హరితహారం పేరుతో బేధకలు చేస్తున్నారు. ఫారెస్టు అధికారులు, పోలీసులతో ఆక్రమకేసులు బనాయిస్తున్నారు. గిరిజనులను కూడా అడవుల నుంచి వెళ్ళగొట్టి వారి స్థానంలో పెట్టుబడి దారులను ప్రవేశ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం సాధించిన ఫలితాలను విస్తృతపరచగా పోగా, ఒక్కోక్కటిగా కాజేసే విధంగా ప్రభుత్వాల విధానాలు కొనసాగుతున్నాయి. కానీ చరిత్ర ముందుకే వెళ్తుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా. ఫ్యూడల్‌ భూస్వాములు, పెట్టుబడిదారీ భూస్వాములు, పెట్టుబడి దారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ప్రజలు కండ్లు తెరిచే వరకేనని తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేస్తున్నది.

సామాజికంగా పరిశీలిస్తే పోరాట రోజులలో కుల మతాల సమస్య ముందుకు రాలేదు. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరిగాయి. అభివృద్ధి చెందినదని చెపుతున్న నేటి సమాజంలో కులంతార వివాహాలు జరిగితే ఆ జంటను గౌరవ హాత్యల పేరుతో చంపుతున్నారు. ప్రభుత్వమే కులాల మధ్య తగాదాలు పెంచిపోషిస్తున్నది. కొన్ని కుల సంఘాలను ప్రోత్సహించడం, కొన్నింటిని నిర్లక్ష్యం చేయటం జరుగుతున్నది. మాఫీయా ముఠాలు హైదరాబాద్‌లో విచ్చలవిడిగా స్వైర్య విహారం చేస్తున్నాయి. వ్యభిచార కేంద్రాలను నడుపుతున్నాయి. ఏటా 3000మంది అమాయక మహిళలను అపహరించి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. చిన్న బాలికలకు హార్మోన్స్‌ ఇంజక్షన్స్‌ ఇచ్చి ఈ వ్యాపారం సాగించడం అందరికీ తెలిసిందే. రాష్ట్రాన్ని తాగుడుకు బానిసగా చేశారు.

ఏటా 500 కోట్ల ఆదాయం నుంచి నేడు 32,000కోట్ల ఆదాయం వచ్చే విధంగా మధ్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారు. కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతినడమే కాక, ప్రజలు వక్రమార్గం పట్టే పరిస్థితి ఏర్పడింది. నాటి పోరాట ఫలితంగా 3,000 గ్రామరాజ్యాలు వెల్లివిరిసాయి. అలాంటి గ్రామ రాజ్యాలను నేటి పాలకులు తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారు. స్థానిక సంస్థల ద్వారా ఆదాయలు పొందటానికి పాలక పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. మార్కెట్‌ కమిటీలు, రైతుబంధు సమన్వయ కమిటీలు, గ్రామ అభివృద్ధి కమిటీలు, పాఠశాల కమిటీలు, హాస్పిటల్‌ కమిటీల లాంటివి ఎన్ని ఏర్పాటు చేసినా ఇవి ప్రజల కొరకు కాకుండా పాలక పార్టీల కొరకే పని చేస్తున్నాయి. అందువల్ల నేటికీ 1946 నాటి పోరాట స్ఫూర్తిని ప్రజలు కొనసాగించక తప్పని పరిస్థితి పాలకులు కల్పిస్తున్నారు. అందుకు సిద్ధంగా అమరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించడమే నేటి మార్గం.

సారంపల్లి మల్లారెడ్డి

Courtesy Nava Telangana