బాధితుల సేవలో వైద్యులు, సిబ్బంది
 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు
 ప్రమాదాన్ని కూడా లెక్కచేయని వైనం

తాము చేసేది అత్యంత ప్రమాదకరమని ప్రాణాలకు అపాయమని తెలుసు. ఎటువైపు నుంచైనా మహమ్మారి విరుచుకు పడవచ్చు. అయినా.. వెనుకంజ  వేయకుండా అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులు వారు. ప్రజల ప్రాణాలను కాపాడే మహాక్రతువులో భాగమైన వారంతా తమ భద్రతను కూడా పణంగా పెట్టి.. రోగులకు కొండంత భరోసా కల్పిస్తున్నారు.. మీకేం కాదని.. మేమున్నామని అండగా నిలుస్తున్నారు. వారే వైద్యులు.. నర్సులు, వైద్య సిబ్బంది! కరోనా విజృంభిస్తున్న వేళ.. గాంధీ, ఫీవర్‌, ఛాతీ వ్యాధుల ఆసుపత్రులతోపాటు ఎయిర్‌పోర్టులో సేవలు అందిస్తున్న వైద్యులు, వందలమంది సిబ్బంది ఒక మహమ్మారితో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. బాధితుల బాగోగులే ధ్యేయంగా సేవలందిస్తూ ‘వైద్య నారాయణులనే’ స్ఫూర్తిని నిలుపున్నారు.

నిరంతర వైద్య సేవలు
ఎవరైనా కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది పని మొదలవుతుంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక వార్డుకు తరలించి అక్కడి సిబ్బందికి అప్పగిస్తారు. ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో పెట్టి శాంపిళ్లు సేకరిస్తారు. ఫలితాలు వచ్చేవరకు అక్కడే అన్ని సేవలు అందిస్తున్నారు. 24 గంటలూ మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు 11 మంది ఆర్‌ఎంఓలు, 9 మంది స్పెషలిస్ట్‌ వైద్యులు, 40 మంది నర్సులు, 10 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, అయిదుగురు సీనియర్‌ రెసిడెంట్లు, 12 మంది పేషెంట్‌ కేర్‌ సిబ్బంది, ఆరుగురు హెల్ప్‌డెస్క్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడో అంతస్తులో 20 పడకల ఐసోలేషన్‌ వార్డు, ఓపీ భవనంలో పది పడకలతో కూడిన ఎక్యూటీ మెడికల్‌ ఎమర్జెన్సీ ఐసీయూ వార్డులు ఉన్నాయి. వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏడు గదులను సమకూర్చారు. ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలోనూ 10 వెంటిలేటర్లు సిద్ధం చేశారు. అక్కడ 10 మంది పల్మనాలజిస్ట్‌లతో పాటు మరో 50 మంది పీజీలు సేవలందిస్తున్నారు. మరో 400 మంది వరకు ఇతర సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. ఫీవర్‌ ఆసుపత్రిలో 20 పడకలు అందుబాటులో పెట్టారు. ఇక్కడా అయిదుగురు వైద్యులు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.

ఆత్మీయుల్లా భరోసా
కరోనా అనుమానితుల వద్దకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో వారు ఒంటరితనంతో బాధపడుతుంటారు. వైద్యులు, నర్సులే వారికి కుటుంబ సభ్యుల్లా, ఆత్మీయుల్లా మారుతున్నారు. చికిత్స చేస్తూనే వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు. ప్రతి రోగికి గంటకోసారి బీపీ, రక్తపోటు పరిశీలించాలి. లక్షణాలను బట్టి ఔషధాలు ఇవ్వాలి. మనోధైర్యం కల్పించడం వల్లే త్వరగా కోలుకునే అవకాశం ఉండటంతో ఆ దిశగా ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే..
* ఎలాగైనా ఈ మహమ్మారిని అరికట్టాలనే ఏకైక లక్ష్యం వైద్యుల్లో కనిపిస్తోంది. కరోనా వార్డుల్లో ప్రత్యేక సూట్‌, చేతులకు తొడుగులు, ముఖానికి మాస్క్‌లతో విధులు       నిర్వర్తిస్తున్నారు. .
* ఎయిర్‌పోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సివిల్‌ ఏవియేషన్‌కు చెందిన 400 మంది మూడు షిష్టుల వారీగా పనిచేస్తున్నారు. మరో 2,000 మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు.
* వార్డుల్లో వైద్యులు చికిత్సకు వాడిన ప్రతి వస్తువును జాగ్రత్తగా జీవ వ్యర్థాల (బయోవేస్ట్‌) కింద ధ్వంసం చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా 20 మంది నాలుగో తరగతి సిబ్బంది రాత్రి పగలు కష్టపడుతున్నారు.

Courtesy Eenadu