ముగ్గురు డాక్టర్ల కుటుంబం…అందరూ కొవిడ్‌పై సమరంలో యోధులే…
డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, ఛాతీ వైద్యశాల
ఆయన శ్రీమతి డాక్టర్‌ షహానాఖాన్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, గాంధీ వైద్యశాల
వారి కూతురు రషికాఖాన్‌, కోరంటి ఆసుపత్రిలో హౌస్‌ సర్జన్‌
ఇది దేవుని దీవెన : ఖాన్‌ సాబ్‌ వ్యాఖ్య

అమీర్‌పేట, హైదరాబాద్ : కరోనా… పదం వింటేనే భయపడుతున్న ఈ వాతావరణంలో…డాక్టర్‌గా విధులు నిర్వర్తించడం పెద్ద సాహసమే…! అలాంటిది …ఓ కుటుంబంలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్లూ అదేపని చేస్తున్నారు. ఓ భర్త, భార్య, వారి పెద్ద కూతురు… ముగ్గురూ డాక్టర్లే… అందరూ కొవిడ్‌పై సమరంలో మునిగి తేలుతున్నారు. ఛాతీ వైద్యుల ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ కుటుంబం అది….

పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో వైద్యవృత్తిపై మక్కువ పెంచుకున్న వీరు నేడు ఎందరో అభాగ్యులకు సేవలందిస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. ఎర్రగడ్డ ఛాతీ వ్యాదుల ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న మహబూబ్‌ఖాన్‌ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ షహానా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన షహానా పూర్తి చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఎండీ (డెర్మటాలజీ) పూర్తి చేశారు. ప్రస్తుతం గాంధీలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిన్నారు. వీరి పెద్ద కుమార్తె రషికా ఖాన్‌ కూడా గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పట్టా పొందారు. ఈ ముగ్గురూ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్‌ బాధితుల ఐసోలేషన్‌ సెంటర్‌లలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రషిక ఖాన్‌ కోరంటి ఆసుపత్రిలో హౌస్‌ సర్జన్‌గా పని చేస్తూ కొవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నారు.

అదే ధ్యాస…
కరోనా వైద్యానికి ప్రభుత్వం డిజిగ్నేట్‌ చేసిన ఆసుపత్రులలో కీలకమైన ఛాతీ వైద్యశాలకు డాక్టర్‌  మహబూబ్‌ఖాన్‌ సూపరింటెండెంట్‌. ఆయన శ్రీమతి డాక్టర్‌ షహానా ఖాన్‌ది డెర్మటాలజీ విభాగం అయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా అనుమానితుల, పీడితుల సేవలో ఉన్నారు. ఇక.. వారి కూతురు రషికా ఖాన్‌ సరిగ్గా అయిదు రోజుల (26/3/2020) నుంచి కోరంటిలో యుద్ధ రంగంలోకి దిగారు. ఆమె కూడా కరోనా వ్యాధి అనుమానితుల సేవలోనే ఉన్నారు.

ఇది పరీక్షా సమయం : డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌
ఇది ప్రపంచానికి పరీక్షా సమయం. మానవాళి మనుగడుకు ఎదురైన పెను సవాలును ఎదుర్కొనే అవకాశం మాకు లభించింది. మేం దానికి గర్విస్తున్నాము. మాకు ఓ బాబు (18) ఉన్నాడు. ఒక వేళ ఇప్పటికే డాక్టర్‌ అయి ఉంటే ఆయనా ఇదే పనిలో ఉండేవాడు.

అంతా దైవ లిఖితం : డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌
కరోనాపై నేరుగా పోరు చేసేది వైద్యులు. ప్రాణాలకు తెగించి చేసే ఈ పోరులో నేనూ, నా భార్య, నా కూతురు…ముగ్గురం పాల్గొనే అవకాశం రావడం దైవకృప అని భావిస్తున్నాను. ఇదో పెద్ద విషయం అని కూడా మేము ముగ్గురం అనుకోము. ఇంత చర్చించుకోము. మాలో ఎవరికీ భయం లేదు. భయపడే టైం ఎక్కడుంది. ముగ్గురం మూడు దిక్కులా ఉన్న ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సిందే. ఎప్పుడు ఇంటికి వస్తామో కూడా తెలియదు. ఊపిరి సలపని పని. నేను అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చాను. పేదలు డాక్టర్లు కావడం అతి అరుదు. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. సమాజం నన్ను నిలబెట్టింది. ఆ రుణం తీర్చుకోవాల్సి ఉంది.

Courtesy Andhrajyothi