పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం
ఒంటిమీద నీళ్లు పోసి కాపాడిన పోలీసులు
ఆస్పత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీ స్కాం: వసంత్‌
దుర్భాషలాడారనే వసంత్‌పై చర్య: డీఎంఈగాంధీలో శానిటేషన్‌, సెక్యూరిటీ స్కాం!
ఈఎ్‌సఐ కంటే  ఇది పెద్ద కుంభకోణం

హైదరాబాద్‌: ‘‘గాంధీ ఆస్పత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీలో పెద్ద కుంభకోణం జరిగింది. అది ఈఎ్‌సఐ కంటే కూడా పెద్ద స్కాం.  ఆస్పత్రిలో అన్నీ కుంభకోణాలే’’ అని ఆ ఆస్పత్రి నుంచి డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు సరెండరైన డాక్టర్‌ వసంత్‌ ఆరోపించారు. పదవీ విరమణ వయసు పెంపు విషయంలో తామంతా డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డికి సహకరిస్తే.. ఆయన తమను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తనను సరెండర్‌ చేయడాన్ని నిరసిస్తూ.. వసంత్‌ మంగళవారం పెట్రోల్‌ సీసాలు షర్ట్‌ లోపల పెట్టుకుని లైటర్‌తో అంటించుకుంటానంటూ హల్‌చల్‌ చేశారు. వైద్య, విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు.

నాపై ఎందుకు బురద చల్లారు? వీళ్లు నన్ను చంపుతున్నారే. చెడు రాతలతో వీరందరితో(ఆర్‌ఎంవోలు) సంతకాలు పెట్టించి, పెట్టని వాళ్లతోనూ పెట్టిస్తే వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? సూపరింటెండెంట్‌ చేస్తున్నది తప్పు. ఆయన ఎన్ని గంటలకు వస్తారో తెలుసా మీకు(మీడియానుద్దేశించి)? 12 గంటలకు వస్తాడు. శ్రావణ్‌ 11 గంటల వరకు సొంత క్లినిక్‌లోనే ఉంటడు. దానిని ఎవరూ ప్రశ్నించరు’’ అన్నారు. ఊరికే వేధించొద్దని, తప్పు చేస్తే శిక్షించాలని సూచించారు. ‘‘నాకు డీఎంఈ నమ్మక ద్రోహం చేసిండు. ఏజ్‌ హైక్‌ కోసం వస్తరు, వారికి ఎలాంటి లెటర్‌ ఇవ్వొద్దని డీఎంఈ అన్నడు. అయితే పదవీ విరమణ వయసు పెంపును డీఎంఈ జూన్‌లో తెచ్చుకున్నాడు. ఇక్కడ అన్నీ కుంభకోణాలే’’ అని వసంత్‌ ఆరోపించారు. తమకు అసోసియేషన్లు లేవని, అవన్నీ చచ్చిపోయాయని నిర్వేదంగా అన్నారు. తనను ఇప్పటికి రెండుసార్లు సరెండర్‌ చేశారన్నారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. మంగళవారం వైద్యమంత్రి ఈటలను కలిసినప్పుడు.. ఆయన తనకు  కనీసం ధైర్యం కల్పించి ఉంటే బాగుండేదన్నారు. తాను మీడియాకు ఎటువంటి లీకులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. వసంత్‌ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకుని ఆయన భార్య, గాంధీ ఆస్పత్రి డాక్టర్‌ కిరణ్మయి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుంది. ఆమె గర్భిణి కావడంతో పోలీసులు దూరంలోనే నిలువరించారు. వసంత్‌ సరెండర్‌ను వ్యతిరేకిస్తున్నామని మెడికల్‌ జాక్‌ చైర్మన్‌ బొంగు రమేష్‌, కో కన్వీనర్‌ పుట్ట శ్రీనివాస్‌, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరహరి చెప్పారు. విచారణ లేకుండా ఎలా సరెండర్‌ చేస్తారని నిలదీశారు.

వసంత్‌ బ్లాక్‌మెయిలర్‌:డీఎంఈ
కరోనా వైర్‌సపై తప్పుడు ప్రచారం చేశారన్న విషయంలో డాక్టర్‌ వసంత్‌పై చర్యలు తీసుకోలేదని డీఎంఈ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సమీక్షలో సంబంధం లేకుండా ఆర్‌ఎంవోను దుర్భాషలాడిన విషయంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే వసంత్‌ను సరెండర్‌ చేశామన్నారు. వసంత్‌ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. ఆయన తప్పులు బయటకు వస్తాయనే హంగామా చేస్తున్నాడని ఆరోపించారు. అతనో పెద్ద బ్లాక్‌ మెయిలర్‌ అన్నారు. తనపై ఆరోపణలు చేసినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని రమేశ్‌రెడ్డి చెప్పారు. గాంధీలో ఫార్మసీ కుంభకోణం జరిగిందని, అందులో తన పాత్ర ఉందన్న ఆరోపణలను ఖండించారు.

వర్గపోరుతో  పరువు  బజారుపాలు
కొందరు ప్రభుత్వ వైద్యుల వర్గపోరు కారణంగా సర్కారీ ఆస్పత్రుల పరువు బజారున పడుతోంది. రాష్ట్రంలో వైద్య, విద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేసే వైద్యుల్లో 3, 4 సంఘాలున్నాయి. కొద్ది రోజుల క్రితం నిమ్స్‌లో డైరెక్టర్‌, ఇతర హెచ్‌వోడీలపై కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు వైద్యులే ఈ సమాచారాన్ని బయటపెట్టారు. అలాగే నిలోఫర్‌లో చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయని, అందుకు వైద్యులే కారణమన్న ఆరోపణలు కూడా వర్గపోరు వల్లే బయటకొచ్చాయి. ఇక గాంధీలో డాక్టర్‌ వసంత్‌ హల్‌చల్‌ వెనకా వర్గపోరు ఉందన్న ఆరోపణలున్నాయి. ఇక సంఘాల పేరిట కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొందరు ఉన్నతాధికారులు సంఘాల నాయకుల బాధపడలేక వారి తప్పుల్ని, బేరసారాలను రహస్యంగా సేకరిస్తున్నారు. గాంధీలో ఫార్మసీ షాపులను, ఫుడ్‌ కాంట్రాక్టర్లను ఓ వైద్యుడు బెదిరించగా.. దాని తాలూకు వీడియోను ప్రభుత్వానికి పంపారు.

Courtesy Andhrajyothi