– ఐసీయూలో వ్యక్తి మృతితో బంధువు ఆగ్రహం
– మరో ఘటనలో మృతదేహం తారుమారు

గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం చోటుచేసు కున్న రెండు ఘటనలు మళ్లీ కలకలం రేపాయి. ఐసీయూలో కరోనాతో ఒకరు మృతిచెందడంతో ఆగ్రహానికి గురైన బంధువు జూనియర్‌ డాక్టర్‌పై ఇనుప కుర్చీతో దాడికి దిగాడు. ఘటనలో వైద్యుడి చేతి నడుముకి స్వల్పగాయాల య్యాయి. విషయం తెలుసుకున్న మిగతా వైద్యులు రాత్రివరకు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు ముందు కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహానికి బదులు శ్మశానావాటికకు మరొకరి మృతదేహాన్ని తరలించడం వైద్యుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు, వైద్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి మూడ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో గాంధీలో చేరగా, ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అప్పటికే బీపీ, షుగర్‌, డయాలసిస్‌తో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి సీరియస్‌గా ఉందని, మాస్కు, మూతికి ఉన్న పైపును తీసేయొద్దని డాక్టర్లు సూచించారు. అయితే బాత్‌రూంకు వెళ్లే సమయంలో పైపు, మాస్కు తీసేయడంతో పరిస్థితి విషమించి మృతిచెందినట్టు కొందరు వైద్యులు తెలిపారు. కానీ, వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే మరణించినట్టు ఆగ్రహానికి గురైన మృతుడి కుటుంబ సభ్యులు ఐసీయూలోని జూనియర్‌ డాక్టర్‌పై ఇనుప కుర్చీతో దాడిచేశారు. ఘటనలో వైద్యుడు స్పల్పంగా గాయపడ్డాడు. దాడిని నిరసిస్తూ ఆస్పత్రిలోని వైద్యులు సహా సమీపంలో కొందరు డాక్టర్లు చేరుకుని ఆవరణలో ధర్నాకు దిగారు. వైద్యులకు కనీస భద్రత లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కరోనా రోగుల సంఖ్య పెరగడంతో ఒత్తిడి అధికమైందనీ, అందువల్ల జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనే ఉంచాలనీ డిమాండ్‌ చేశారు. సగం వైద్యులు డ్యూటీలో ఉంటే మిగతా సగం క్వారంటైన్‌లో ఉంటున్నామని చెప్పారు. గచ్చిబౌలిలో టిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా కేసులను అడ్మిట్‌ చేసుకోకుండా లక్షణాలు ఉన్న వారందరినీ గాంధీకే తరలిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న రోగులకనుగుణంగా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని పెంచాలన్నారు.

శ్మశానానికి ఇతర మృతదేహం..
బేగంపేటలోని గురుమూర్తినగర్‌కు చెందిన కరోనా బాధితుడు (48) మంగళవారం మృతి చెందడంతో అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలిం చారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం తో వారు అక్కడికి చేరుకున్నారు. మృతదేహంపై కవర్‌ తీయగానే తమకు చెందిన వ్యక్తిది కాదని వారు వైద్యులకు సూచించారు. ఈ క్రమంలో వైద్యులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని గాంధీకి తిరిగి తరలించారు. బేగంపేటకు చెందిన వ్యక్తి మృతదేహం గాంధీలో ఉన్నట్టుగా సాయంత్రం గుర్తించారు. నేడు శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Courtesy Nava Telangana