•  శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఉరి
  • భవనం ఖాళీ చేయాలంటూ యజమాని ఒత్తిడి
  • కొందరితో కలిసి వేధింపులు
  • ఆస్పత్రి సిబ్బంది దుష్ప్రచారం
  • సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావన

కొత్తపేట/హైదరాబాద్‌ : మానసిక వేధింపులను భరించలేక నగర శివారు హస్తినాపురం సరస్వతి నగర్‌లోని శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ కర్నాల అజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆస్పత్రిలోనే ఆయన ఉరి వేసుకున్నారు. ఎల్బీ నగర్‌ ఠాణా పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యేటిగడ్డ శాకపురానికి చెందిన కర్నాల అజయ్‌ కుమార్‌ (38) భార్య శ్వేత, కుమారులు వర్షిత్‌ (11), అశ్విత్‌ (07), తండ్రి శ్యాం, తల్లి అరుణ, తమ్ముడు అజయ్‌తో కలిసి బీఎన్‌ రెడ్డి నగర్‌లో ఉంటున్నారు. సరస్వతి నగర్‌లో టి.కర్నాకర్‌ రెడ్డికి చెందిన భవనాన్ని లీజుకు తీసుకుని శ్రీవైష్ణవి ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి అనుగుణంగా భవనంలో మార్పుచేర్పులు చేయడానికి కర్నాకర్‌ రెడ్డికి రూ.10 లక్షలు చెల్లించారు.

కానీ, భవన యజమాని స్పందించలేదు. దాంతో, తానే సొంత డబ్బుతో ఆస్పత్రికి కావాల్సిన విధంగా భవనం లోపల నిర్మాణాలు, ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ అంశంపై భవన యజమానికి, ఆయనకూ మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగింది. తన భవనాన్ని ఖాళీ చేయకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నాడంటూ అజయ్‌పై కర్నాకర్‌ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తుర్కయాంజల్‌ మాజీ సర్పంచి శివకుమార్‌, సరస్వతి నగర్‌ కాలనీ అధ్యక్షుడు మేఘా రెడ్డి, అతని బావ కొండల్‌ రెడ్డితో కలిసి భవనం ఖాళీ చేయాలంటూ అజయ్‌ను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. తీవ్ర మానసిక క్షోభకు గురై ఆయన.. మంగళవారం తెల్లవారు జామున ఆస్పత్రి సెల్లార్‌లోని విశ్రాంతి గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఉదయం 9 గంటలకు ఆస్పత్రి సిబ్బంది స్వామి గది వద్దకు వెళ్లి పిలిచినా అజయ్‌ పలకలేదు. దాంతో, బలవంతంగా డోర్‌ తెరిచి చూస్తే.. అజయ్‌ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య శ్వేత ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. గదిలో బెడ్‌పై ఉన్న అజయ్‌ డైరీని స్వాధీనం చేసుకున్నారు.

లోకం వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నా.. డైరీలో అజయ్‌
‘‘లోకం వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నా. వీళ్ల మోసాన్ని భరించే శక్తి లేదు. భవన యజమాని కర్నాకర్‌రెడ్డి, తుర్కయాంజల్‌ మాజీ సర్పంచి శివకుమార్‌, సరస్వతినగర్‌ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, కర్నాకర్‌రెడ్డి బావమరిది అని చెప్పుకొనే కొండల్‌రెడ్డి నా చావుకు కారణం’’ అంటూ డైరీలో అజయ్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అదే ఆస్పత్రిలో పని చేసే డాక్టర్‌ రమేశ్‌, యాదగిరి రెడ్డి, శివా రెడ్డి కూడా అజయ్‌ను తరచూ మానసికంగా వేధించారంటూ శ్వేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్‌ రమేశ్‌ గోవా వెళ్లి డబ్బులు పోగొట్టుకున్నాడని, అతడిని అజయ్‌ ఆదుకున్నాడని. అయినా, అజయ్‌ ఇమేజీని దెబ్బతీసేలా రమేశ్‌ దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. ‘నా ఉసురు నీకు తగులుతుంది’ అనీ డైరీలో రాసినట్లు తెలిపారు. పిల్లలను బాగా చూసుకోవాలని భార్యను కోరుతూ అజయ్‌ డైరీలోని ఓ పేజీలో రాశాడు. సమస్యలతో సతమతమవుతూ భార్యనూ చక్కగా చూసుకోలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

Courtesy Andhrajyothi