శ్రీ వృత్తిని చేపట్టాలంటూ పెత్తందారుల ఒత్తిడి
శ్రీ పోలీసులను ఆశ్రయించిన రజకులు
-గోనెగండ్ల (కర్నూలు)
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామంలో రజకులను సాంఘీక బహిష్కరణ చేశారు. తాము చెప్పిన ధరకు బట్టలు ఉతకడం లేదని గ్రామ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. రజకులను సాంఘీక బహిష్కరణ చేస్తున్నట్లు గ్రామ పెత్తందారులు దండోరా వేశారు. రజకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. తాత్కాలికంగా పోలీసులు రాజీ కుదిర్చారు. బాధితులు , స్థానికుల వివరాల ప్రకారం….గ్రామ జనాభా 3,040 ఉంది. రజకుల కుటుంబాలు 12 ఉన్నాయి. గత ఏడేళ్ల క్రితం తీవ్ర నీటి కొరతతో రజకులు కులవృత్తిని వదిలేశారు. ఎవరి పొలాల్లో వారు వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం గ్రామస్తులంతా రజక వృత్తిని చేయాలని పంచాయతీ పెట్టారు. రెండు సార్లు సమావేశం పెట్టినా కులవృత్తిపై అనాసక్తితో ఉన్న రజకులు తాము వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని, కులవృత్తిని చేయలేమని గ్రామ పెద్దలకు చెప్పారు. కిరాణ షాపుల్లో రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు. కూలి పనులకు పిలువడం లేదు. మీ అవసరం మాకు లేదని, వేరే వారిని పనులకు తీసుకుంటామని ఎద్దుల బండ్లను నిలిపేశారు. తమ న్యాయం చేయాలని రజకులు గోనెగండ్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పెత్తందారులను పిలిచి మాట్లాడారు. వేముగోడు గ్రామంలో రజకులకు ఇష్టం లేకపోయినా కచ్చితంగా రజక వృత్తి చేయాలని, లేదంటే గ్రామస్తుల నుంచి ఎలాంటి సహకారం ఉండదని, గ్రామం వదలి వెళ్లాలని చెప్పడం సమంజసం కాదని రజకవృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్‌ పేర్కొన్నారు. రజకులు, గ్రామ పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు తెలిపారు.

Courtesy Prajashakti..