CAA– బీజేపీ సర్కారుపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం

బెంగళూరు : ‘మీరు (యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కారు) ప్రతి నిరసననూ అణచివేయాలని చూస్తున్నారా..? నిరసన తెలిపే వారికి ముందు అనుమతినిచ్చి తర్వాత అక్కడ 144 సెక్షన్‌ను ఎలా విధిస్తారు..?’. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో నిరసనకారులు చేపట్టిన ర్యాలీలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో.. ఇదే విషయమై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందిస్తూ కర్నాటక హైకోర్టు పై విధంగా స్పందించింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అభరు శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ‘నిరసనకారులు తెలిపే ప్రతి నిరసన హింసకు దారితీస్తుందని సర్కారు భావిస్తున్నదా..? ఒక రచయిత గానీ, ఒక కళాకారుడు గానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపట్టే హక్కు కూడా లేదా..?’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై పోలీసులు ఈ సభకు ముందు అనుమతినిచ్చి తర్వాత రద్దు చేయడంపై తమకు పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. గురువారం బెంగళూరులో జరిగిన శాంతియుత ర్యాలీలో సీఏఏపై నిరసన తెలపడానికి వచ్చిన చరిత్రకారుడు రామచంద్రగుహ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.

(Courtesy Nava Telangana)