-నావల్‌ హెలికాప్టర్‌ తయారీనీ ఇవ్వొద్దు
– 21వేలకోట్ల ఆర్డర్లపై కార్పొరేట్ల కన్ను

న్యూఢిల్లీ : బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌, ప్రయివేటు కంపెనీల డిమాండ్‌లకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. ఈ సారి ఏకంగా ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ ఏఎల్‌) పొందే ఆర్డర్లపై ఆంక్షలు పెట్టాలని పలు ప్రయివేటు రక్షణ రంగ కంపెనీలు డిమాండ్‌ చేశాయి. రూ.21వేల కోట్ల విలువ చేసే నావల్‌ యుటిలిటీ హెలికాప్టర్ల (ఎన్‌యూహెచ్‌) తయారీ నామినేటెడ్‌ ఆర్డర్‌లో హెచ్‌ఏఎల్‌ పాల్గొనకుండా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని పలు కంపెనీలు డిమాండ్‌ చేస్తున్నాయని ఈటీ ఓ కథనంలో వెల్లడించింది.

ఈ పోటీలో హెచ్‌ఏఎల్‌కు కూడా అవకాశం ఉంటుందని గత మేలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా దీనిపై అదానీ డిఫెన్స్‌, భారత్‌ ఫోర్గ్‌, టాటా ఎరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, మహీం ద్రా డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కంపెనీలు వ్యతిరేక స్వరాన్ని అందుకున్నాయి. ఎస్‌యూహెచ్‌ ఆర్డర్‌ను పూర్తిగా ప్రయివేటు కంపెనీలకు రిజర్వ్‌ చేయా లని డిమాండ్‌ చేస్తున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా హెచ్‌ఏఎల్‌కు మాత్రమే ఆర్డర్లు ఇస్తున్నారని ప్రయివేటు కంపెనీలు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలతో పేర్కొన్నాయి. తమకూ అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. ఇంతక్రితం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఫిక్కీ) కూడా హెచ్‌ఏఎల్‌ను పోటీ నుంచి తప్పించాలని కోరింది. అప్పుడే ప్రయివేటు సంస్థలు ముందుకు సాగగలవని రక్షణ మంత్రిత్వ శాఖకు తెలిపింది.

మోడీ సర్కార్‌ యుద్ధ విమానాలు, రక్షణ ఉత్పత్తుల తయారీలో ప్రభుత్వ రంగ సంస్థలను కాదని ప్రయివేటుకు పక్షపాతంగా కట్టబెడుతున్నారనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విష యం తెలిసిందే. కనీసం కాగితపు విమానాన్ని కూడా తయారు చేయని అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌కు 36 రాఫెల్‌ విమానాల తయారీ కాంట్రాక్టును అప్పగించిన విషయం తెలిసిందే. దీని విలువ ఎంతో కూడా ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం బయట పెట్టలేదు. ప్రస్తుతం హెచ్‌ఎఎల్‌ వద్ద 60వేల కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉంది. మరో రూ.39,000 కోట్ల విలువ చేసే తేలికపాటి యుద్ధవిమనాలు (ఎల్‌సీఏ), కొమొవ్‌ కేఏ 226టీ చాపర్స్‌ లాంటి నామినేటెడ్‌ ఆర్డర్‌ను పొందడానికి సిద్ధంగా ఉంది.

దేశ కదన రంగంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, యంత్రాల మద్దతును అందిస్తున్న హెచ్‌ఏఎల్‌ వాటాల ఉపసంహరణను బీజేపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. 2018లోనే 10 శాతం మేర వాటాలను అమ్మేసింది. మరో 15 శాతం వాటాను మార్కెట్‌ శక్తులకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హెచ్‌ఏఎల్‌లో కేంద్రానికి 89.97 శాతం వాటా ఉంది. ఆర్ధిక సంవత్సరం 2019-20 హెచ్‌ఏఎల్‌ రూ.21,100 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.

Courtesy Nava Telangana