హైదరాబాద్‌: ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నందుకు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈవిషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో గతేడాది నవంబర్‌ నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేయడంతో ఇద్దరూ కలిసి బీహెచ్‌ ‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు.

ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా వ్యతిరేకించారు. అవంతి తల్లి దండ్రులకు ఇష్టంలేకపోవడంతో యువజంట గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి.. బావలు, వదినలు, మామయ్యలు, మరి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించుకెళ్లారు. మార్గ మధ్యలో అవంతి కారులోంచి దూకేసి తప్పించుకోగా.. హేమంత్‌ను కొట్టుకుంటూ కారులోనే తీసుకెళ్లారు. ఈవిషయాన్ని హేమంత్‌ ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు గచ్చిబౌలి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఆచూకీ తెలియలేదు. నిన్న సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా.. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్‌ శవమై కనిపించాడు. ప్రేమ వివాహం ఇష్టం లేని యువతి తండ్రి కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్‌ తల్లి రాణి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వారే హత్య చేయించారు: హేమంత్‌ భార్య అవంతి
‘‘హేమంత్‌ నేనూ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. జూన్‌ 10న వివాహం చేసుకున్నాం.‌ పెళ్లి తర్వాత చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెటిల్‌మెంట్‌కు వెళ్లాం. నా పేరిట ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకు రాసిచ్చేశా. అప్పటి నుంచి వారికి దూరంగా గచ్చిబౌలిలో ఉంటున్నాం. మా నాన్నకు ఇష్టం లేకుంటే నన్ను చంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది నేను. మా బావలు, వదినలు, మామయ్యలు, ఇద్దరు రౌడీలు నిన్న సాయంత్రం మూడు కార్లలో వచ్చి మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లారు. నేను మధ్యలో కారులోంచి దూకేసి తప్పించుకున్నాను. హేమంత్‌ను రౌడీలు కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్‌ చెరులో దిగారు. మా బావలు, వదినలు, మామయ్యలే ఈ హత్య చేయించారు’’ అని హేమంత్‌ భార్య అవంతి మీడియాకు వెల్లడించారు.

Courtesy Eenadu