జీవన డెస్క్‌

ఆ తల్లిదండ్రులకు 19 ఏళ్ల సజీవకాలం కలలా మారిపోయింది. ఇంకెప్పటికీ తిరిగి రాకుండా తమ బిడ్డ కాలగర్భంలో కలిసిపోయింది. ఆడపిల్లల్ని చదివించడం ఎందుకనుకునే రోజుల్లోనూ తమ కుమార్తెను ఖ్యాతి గడించిన విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్యకు పంపించారు. బాగా చదివి తమ కంటే మెరుగైన జీవితాన్ని జీవిస్తుందని అనుకున్నారు. అయితే వివక్ష విశ్వరూపం వారి విశ్వాసాన్ని వమ్ముచేసింది. తమ కుమార్తె రాసిన మరణవాంగ్మూలం దాన్ని స్పష్టంగా తెలియజేసింది. ఈ దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యల జాబితాలో ఇప్పుడు ఫాతిమా లతీఫ్‌ పేరు కూడా చేరింది. ఇలాంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తులు గతంలోనూ అర్ధాంతరంగా ఆత్మహత్యలతో ముగిసిపోయాయి. ఇవి ఆగేదెప్పుడు…? ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య అయినా మార్పును తీసుకొస్తుందా…? దీని పూర్వాపరాలపైనే జీవనఫోకస్‌..

పందొమ్మిదేళ్ల ఫాతిమా లతీఫ్‌ కేరళలోని కొల్లాం ప్రాంతానికి చెందిన యువతి. ఇంటర్మీడియట్‌ పూర్తయిన తర్వాత డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్‌ఏ కోర్సు కోసం ప్రఖ్యాత ఐఐటి-మద్రాస్‌లో చేరింది. చేరిన మొదటి సంవత్సరంలోనే… నవంబరు 9వ తేదీన తన హాస్టల్‌ గదిలో విగతజీవిగా సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. నవంబరు 8వ తేదీ రాత్రి ఫాతిమా ఈ ‘నాగరిక’ సమాజాన్ని ఏమని నిందించి ఉంటుందో..?!
మరణ వాంగ్మూలం
నవంబరు 9వ తేదీన ఫాతిమా సోదరి కొత్తూరుపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ టేబుల్‌ పైన ఫాతిమా ఫోను కన్పించింది. దాన్ని ఛార్జింగ్‌ పెట్టిన తర్వాత ఆన్‌ చేసి చూస్తే ఫోన్‌ లాక్‌ చేసి లేదు. ఆమె ఫోన్‌లోని హోమ్‌ స్క్రీన్‌పై మరణ వాంగ్మూలం లాంటి నోట్‌ ఒకటి కనిపించింది. ఫాతిమా మరణం తర్వాత ‘ఇదే మరణ వాంగ్మూలమంటూ’ ‘శీర్షిక లేని’ ఈ స్మార్ట్‌ఫోన్‌ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.
‘ఒకవేళ నేను చనిపోతే… పోరాడి మరణించిన నేను మాట్లాడిన చివరి వాంగ్మూలంగా దీన్ని పరిగణించండి.
నాకు ఇంటిపైన ఇంత బెంగ ఉందని నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను. ఈ ప్రదేశంపైన నాకు జుగుప్స కల్గుతోంది. ఇంటిపై నాకున్న ఈ కాంక్షను ఎప్పటికీ లేవలేని ఈ అనంతనిద్ర అనే అర్థవంతమైన జడత్వంలోకి తోసేస్తున్నాను. నేను చనిపోతే కచ్చితంగా దానికి కారకులు మిస్టర్‌ హేమచంద్రన్‌ కారా, మిస్టర్‌ మిళింద్‌ బ్రహ్మి’.
అయితే ఇది నిజమైనది కాదని ఫాతిమా తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌ అన్నారు. ‘సుదర్శన్‌ పద్మనాభన్‌ నా చావుకు కారణం’ అని చెప్పే ఒక స్క్రీన్‌ షాట్‌ను ఫాతిమా తండ్రి మీడియాతో పంచుకున్నారు. ఇప్పుడు ఫాతిమా ఆత్మహత్య కేసు సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచి చేతిలోకి వెళ్లింది. ఆ వాంగ్మూలాల్లో నిజమెంతో త్వరలోనే గుర్తిస్తారు. అయితే రెండింటిలోనూ కనిపిస్తుంది మాత్రం ఫాతిమా చనిపోవడానికి కారణం ఐఐటి-మద్రాస్‌లోని అధ్యాపకులేనని తెలుస్తుంది.
కథలో మరో మలుపు
ఫాతిమా అధ్యాపకులందరికీ ఇష్టమైన విద్యార్థిని అని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అంతేకాదు ఆమె తరగతిలో ఉత్తమ విద్యార్థి అని అందరూ చెప్పారు. అయితే ఇటీవల తర్కశాస్త్రంలో నిర్వహించిన ఇంటర్నల్‌ పరీక్షల్లో 20 మార్కులకుగాను ఫాతిమాకు 13 మార్కులు వచ్చాయి. తాను బాగా రాసినా తక్కువ మార్కులు వచ్చాయంటూ విభాగాధిపతి దగ్గరకు వెళ్లి, విన్నవించుకుంది కూడా. దాన్ని పరిశీలించిన విభాగాధిపతి సమాధాన పత్రాన్ని సదరు సబ్జెక్టు ప్రొఫెసర్‌ సుదర్శన్‌ పద్మనాభన్‌కు పరిశీలన కోసం పంపారు. నిజానికి ఇందులో మొట్టమొదటి ర్యాంక్‌ వచ్చింది ఫాతిమాకే. రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థికి 11 మార్కులు వచ్చాయి. ఈ విషయమై మాట్లాడటానికి సుదర్శన్‌ పద్మనాభన్‌ ఫాతిమాను నవంబరు 11వ తేదీన కలవమని చెప్పారు. అయితే నవంబరు 9న ఆమె శవమై కనిపించింది. ఫాతిమా ఆత్మహత్య కేసు దర్యాప్తులో బయటకొచ్చిన కొన్ని వివరాలివి. అయితే అంతకుమించిన నిగూఢ రహస్యమేదో ఆ విశ్వవిద్యాలయంలో తచ్చట్లాడుతోంది. మైనారిటీ వర్గాల విద్యార్థులను భయాందోళలనకు గురిచేస్తూ విహరిస్తోంది. ఈ ఏడాదిలో ఇక్కడే నలుగురు చనిపోయారు. గత పదేళ్లలో14 మంది మరణించారు. ఉన్నత చదువుల కోసం వచ్చిన ఈ విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడానికి కారణాలేంటీ…? దీనికి సమాధానం చెప్పేదెవరు?
పాత ప్రశ్నేగాని సమాధానమేది?
ఇప్పటికే మద్రాసు ఐఐటిలో విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఇద్దరు విద్యార్థులు ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఫాతిమా మరణానికి సమాధానం చెప్పమని దేశవ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న హింసపైన… మతం, కులం, లింగ, జాతి ప్రాతిపదికగా జరుగుతున్న వివక్షపైన స్వతంత్ర విచారణ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల మరణం దగ్గర నుంచి జెఎన్‌యూలో ముత్తుకృష్టన్‌… ఇంకా… ఇంకా… ఎందరో విద్యార్థుల ఆత్మహత్యల వెనుక కారణం బహిర్గత రహస్యం. దళిత మైనారిటీలపై విద్యాలయాల్లో పెరిగిపోతున్న ఈ వివక్ష నిజానికి జాతీయ సమస్యగా గుర్తించాల్సిన విషయమని అర్థం చేసుకునేదెవ్వరు? వివక్ష పూరితమైన హింసను నిర్మూలించాల్సిన అధికార వర్గాలు ఆయా విద్యాలయాలు పేరు ఎక్కడ పాడవుతుందోనని ఆలోచిస్తున్నారు. ఐఐటి మద్రాస్‌లో విద్యార్థుల మానసిక సమస్యలను పరిష్కరించడానికి ఒక కౌన్సెల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయమని అక్కడున్న విద్యార్థి సంఘాలు అడిగితే.. దాన్ని తిరస్కరించారు అక్కడి అధికారులు. అప్పుడే ఈ కౌన్సెల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఉంటే.. ఫాతిమా మరణం జరిగుండేది కాదేమో కదా! గత పదేళ్లలో దేశంలో ఉన్న ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పరిశీలిస్తే మద్రాస్‌ ఐఐటీలోనే 14 జరిగాయి. ఇక ఐఐటి ఖరగ్‌పూర్‌లో 13, గౌహతిలో 8, రూర్కీలో 5, ఢిల్లీలో 4, కాన్పూర్‌లో 4, హైదరాబాద్‌లో 2, ముంబయిలో 2 ఆత్మహత్యలు జరిగాయి. ‘అణగారిన వర్గాలు ఇప్పుడిప్పుడే విద్యా, సాంకేతిక, వైద్య రంగాల్లోకి ప్రవేశిస్తుంటే, ఉన్నత చదువుల కోసం ఆరాటపడుతుంటే… వారిపైన ఎందుకింత కక్ష?’ అంటూ ప్రశ్నిస్తున్నారు తోటి విద్యార్థులు. మనిషిని మనిషిగా చూడలేని ‘విజ్ఞాన కేంద్రాలు’ చూపిస్తున్న మార్గదర్శకత్వం ఏమిటి? ఇన్ని ఆత్మహత్యలు సమాధానం వెలువడని పాత ప్రశ్నలుగా మిగిలిపోవడమేనా?!
చివరి గమ్యం
ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలను పరిశీలిస్తే అందులో ఎక్కువమంది దళిత మైనారిటీలే. ‘రిజర్వేషన్లతో సీటు సంపాదిస్తున్నారనీ, ఉద్యోగాలు సాధిస్తున్నారనీ, భోజనం కోసమే వీళ్లు హాస్టళ్లకు వస్తారనీ…’ నానా రకాల మాటలతో కొందరు పెట్టే హింసను ఎదుర్కొంటున్నారు ఈ విద్యార్థులు. ముఖ్యంగా స్త్రీలకు సామాజిక గుర్తింపుతో జరిగే హింసతో పాటు, లైంగిక వేధింపులు అదనంగా వచ్చి చేరతాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వలేకపోతున్న విద్యావ్యవస్థలో నేర్చుకునేదేమిటి? విద్య ఉద్యోగం కోసమే గానీ ఇంక ఎలాంటి జ్ఞానాన్నీ ఇవ్వదని చెబితే ఎంత సిగ్గుచేటు! తల్లిదండ్రులు తమ బిడ్డలు తమ కంటే ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడతారు. దానికోసం ఎంతో కష్టానికోర్చి పిల్లలకు సాధ్యమైనంత సహకరిస్తారు. మరి ఆ పిల్లలు అకస్మాత్తుగా శవమైపోతే… ఇంకెప్పటికీ కనిపించని కలలా అదృశ్యమైపోతుంటే… ?!
ఈ పరిస్థితి మారాలి. సమసమాజ నిర్మాణానికి అందరూ విద్యాధికులవ్వడమే ప్రధాన మార్గం… చివరి గమ్యం. దాన్ని చేరుకోనివ్వకుండా చేసే ఎలాంటి అడ్డుగోడనైనా కూల్చివేయాల్సిందే. కులమైనా, మతమైనా, జాతి, లింగ భేదమేదైనా నిర్మూలన కావాల్సిందే. అప్పుడే ఇలాంటి చావులుండవు.