దశాబ్దాల క్రితం అధికారుల అవగాహనా రాహిత్యం కారణంగా చోటుచేసుకున్న తప్పిదం ఇంకనూ కొనసాగుతూ, ఒక సామాజిక కులానికి శాపంగా పరిణమించింది.

ధర్మపురి మండలంలోని రాజవరం గ్రామంలోని ఒక సామాజిక వర్గాన్ని ప్రత్యేక కులంగా పరిగణించే, గణించే అంశంలో సవరింపులు జరుగక, అదే తప్పిదం కొనసాగుతూండడమే కాకుండా, సదరు ఘోర తప్పిదం ఒక కులానికి ఎలాంటి ధృవీకరణలు లేకుండా చేస్తున్నది. అదలా ఉంచి…అధికారుల తప్పిదం, కులధృవీకరణ దొరకని స్థితి, పిల్లల విద్యావకాశాలు, రిజర్వేషన్ల లబ్ది వెరసి, ఒక ప్రత్యేక సాంప్రదాయ , సాంస్కృతిక వారసత్వం కలిగిన ఒక కులం క్రమంగా కనుమరుగు కాబోతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘‘గిరుకల’’ కులానికి చెందిన వారు ఏకంగా, తమ కులం మార్చుకుని, ‘‘ఎరుకుల’’ కులస్తులుగా ధృవీకరణలు పొంద జూడడం, నాటి తప్పిద ఫలితంగా, ప్రస్తుతం గిరుకుల కులస్తులకు నేరుగా ఎస్టీ ధృవీకరణలు ఇస్తున్న అధికార గణ బ్రహ్మరాతలు తప్పిదాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. 1991 జనాభా సేకరణ సమయాన భాగంగా ఆనాటి జనాభా గణకులు, రాజవరం గ్రామంలోని ‘‘గిరుకల’’ కులస్తులను ‘‘షెడ్యూల్డ్ తెగల’’ వారిగా పొరపాటున అవగాహనా రాహిత్యంతో నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి రాజవరంలో ‘గిరుకల’ కులస్తులు వ్యవసాయ కూలీలుగా, పని దొరకని సమయంలో భిక్షాటన గావిస్తూ జీవిస్తు, జాతర సందర్భాలో ‘‘రంగురాట్నం గిరుకల’’లో వినోదం కోసం కూర్చోబెట్టి తిప్పుతూ, పాటలు పాడి జీవనోపాధి పొందడం వలన ‘గిరుకల ’ అనే పేరు వచ్చిందని అధికారులు తర్వాతి నివేదికలలో పలు సందర్భాలలో ఉన్నతాధికారులకు నివేదించారు. సాంఘికసంక్షేమ శాఖ కరీంనగర్, ప్రభుత్వ మెమో నెంబర్ 481/పి 2/84-2 తేది 16-6-1984 క్రమం సీరియల్ 13 నందు నోమాడిక్ ట్రైబ్స్ (దేశ దిమ్మరులు)గా గిరుకల కులం నమోదై ఉందని, ఎస్టీజాబితాలో లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ మెమో సంఖ్య 481/పి-2/84-2 ఎస్.డబ్ల్యు.డి తేది 16-06-1984 క్రమం సీరియల్ 13నందు నోమాడిక్ ట్రైబ్స్ కింద గిరుకల కులం నమోదై ఉన్నదని, ఎస్టీ జాబితాలో లేదని పేర్కొనడం జరిగింది. నాటి ధర్మపురి ఎమ్మార్వో 18-9-2000 నాటి నివేదికలో, గతంలో గిరుకల కులస్తులు తెనుగు (బిసి-డి సీరియల్ నెం.19) గా పరిగణింపబడినట్లు తన స్వీయ విచారణలో, కులపెద్దలు స్పష్టం చేశారని, కనుక గిరుకల కులానికి వీరు చెందరని మరియు ఎపి గజెట్ నెంబర్ 16…తేది 15-5-97 ప్రచురణలో ఈకులం నోటిఫై చేయబడలేదని ఎమ్మార్వో నివేదికలో పేర్కొనడం జరిగింది. అధికారుల తప్పిదం వల్ల ‘‘గిరుకలవారు ఎస్టీలు’’గా అదే పొరపాటు పునరావృతం కావడం, రిజర్వేషన్ల రోటేషన్ పద్దతిలో రాజవరం సర్పంచ్ స్థానం ఎస్టీ కేటగిరీకి కెటాయించ బడగా, ఆ గ్రామంలో ఎస్టీలుగా ఎవరికీ ధృవీకరణ పత్రాలు లేక, సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయలేని విచిత్ర స్థితి ఫలితంగా ఐదేళ్ళు సర్పంచ్ స్థానం ఖాళీగానే ఉండి పోయింది. వాస్తవానికి వీరికి ఎలాంటి ధృవీకరణలు లేవు. గిరుకుల కులస్తులంతా తమకు ఎస్టీ ధృవీకరణలు ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ తిరుగాడడం నిత్యకృత్యమే అవుతున్నది. ధర్మపురి క్షేత్రంలో ఏకంగా ఒక ‘‘గిరుకల కాలనీ’’ ఉంది. వీరికి పందుల పెంపకం, రోజువారీ కూలీలు, పాత సామాను ప్రోగు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి.
ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు గోదావరిఖని, మందమర్రి, బెల్లంపెల్లి, దండెపెల్లి, మోతె, కరీంనగర్, బీర్పూర్, రాజారం, జైనా, బుగ్గారం, తాళ్ళపేట, ధర్మారం, లక్సెట్టిపేట, దొనబండ తదితర గ్రామాలలో ఉంటున్నారు. ఒక ప్రాతిపదికంటూ లేకుండా వీరికి వేరువేరు చోట్ల బీసీలుగా, ఎస్టీలుగా సర్టిపికెట్లు జారీ చేస్తున్నారు. బోయిని, మేకల, కుర్రాల, కోట, గుమ్ముల, మొగిలి లాంటి ఇంటిపేర్లు కలిగి ఉన్నారు. ఎల్లమ్మ తల్లి వీరి కులదేవత. మైసమ్మ, దుర్గమ్మలను పూజించే ఆచారం ఉంది. ఏటా దుర్గమ్మ పూజ నిర్వహించి, పందులను బలి ఇచ్చి, విందు చేసుకుంటారు. రెండు రోజుల పాటు పెళ్ళిళ్ళ తంతు పాటిస్తారు. హిందూ సాంప్రదాయ రీతిలో మరణించిన వారి భౌతిక కాయాలను పాతి పెడతారు. గిరుకల వారి ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే, ఎరుకల వారికి భిన్నంగా ఉంటాయనేది స్పష్టం. తెలంగాణ ప్రభుత్వ సంబంధిత జీవో నెం.2 తేది 22.01.2015 (షెడ్యూల్డు కులాలు); జీవో నెం.16 తేది 11.03.2015 (బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖ)లలో కులాల జాబితాలలో గిరుకల కులం చేర్చబడలేదు. కనుక వీరికి ఎలాంటి కుల ధృవీకరణలు జారీ కావడం లేదు. చేసేదేమీ లేక ఇటీవలి కాలంలో తాము ఎరుకల వారిమని, తమకు ఎస్టీ ధృవీకరణలు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. తద్వారా ఒక ప్రత్యేకత కలిగిన కులం కనుమరుగు కాబోతోంది. వీరికి ఎస్టీ ధృవీకరణ జారీ చేసే చర్యలు చేపడితే తప్ప దీనికి పరిష్కారమే లేదనేది యదార్థం. లేకుంటే వీరికులం ప్రశ్నార్థక మవుతుందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

(ఆంధ్రభూమి సౌజన్యంతో)