దిశ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం

అత్యాచారాలకు పాల్పడితే జీవితఖైదు.. లేదా ఉరి
మహిళలను ఏ రకంగా వేధించినా కఠిన శిక్షలు
21 రోజుల్లో న్యాయం చేయడం లక్ష్యం: సీఎం జగన్‌
సీజేఐ సూచనలూ పరిగణనలోకి తీసుకోవాలి: చంద్రబాబు

మృగాళ్లకు ఉరి.. ఊచలు

మహిళలు, బాలికలను ఏ రకంగా వేధించినా.. ఇక కఠినాతి కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సిందే. వేధింపులు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి పదేళ్ల జైలుశిక్ష నుంచి.. జీవితఖైదు, అవసరమైతే మరణశిక్ష వరకు విధించేందుకు వీలుకల్పించే దిశ బిల్లు-2019ను శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌ దిశచట్టం – క్రిమినల్‌ లా (ఏపీ సవరణ) బిల్లు-2019పై సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. మహిళలపై అత్యాచారాలు చేసినా, లైంగికంగా వేధించినా అత్యంత కఠినశిక్షలు విధించడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. తండ్రిలా ఆలోచించి పిల్లల రక్షణ కోసం ఈ చట్టాన్ని తెస్తున్నామని సీఎం జగన్‌చెప్పగా.. సత్వరన్యాయం విషయంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని విపక్ష నేత చంద్రబాబు సూచించారు.

తప్పుచేసి తప్పించుకోకూడదనే..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏం జరిగింది?   హక్కుల కమిషన్‌ దర్యాప్తు.. సుప్రీంకోర్టు కమిటీలు.. వీళ్లంతా ఏంచేస్తారు? అత్యాచారం చేసి చంపడం తప్పే అయినా పోలీసులు కాల్చడం తప్పే అంటారు. అలా చెబితే.. రేపు ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ ముందుకు రారు. ఏ ప్రభుత్వ పెద్దా ముందుకు రారు. అప్పుడేం జరుగుతుంది? తప్పు చేసినవాళ్లు యథేచ్ఛగా బయటకు వస్తారు. బాధితుల తల్లిదండ్రులు రోదిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చట్టపరంగా ఏం చేయాలనే ఆలోచనల్లోంచే దిశ చట్టం తీసుకొస్తున్నాం.

– ముఖ్యమంత్రి జగన్‌
ఇదే ఉత్సాహంతో అమలుచేయాలి

మృగాళ్లకు ఉరి.. ఊచలు

దిశ చట్టానికి, చట్ట సవరణలకు తెదేపా పూర్తి మద్దతు పలుకుతోంది. మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు దిశ చట్టం తీసుకురావడంలో ముఖ్యమంత్రి సంకల్పాన్ని తప్పుబట్టడం లేదు.  ఇదే ఉత్సాహంతో చట్టాన్ని అమలు చేయాలి.  దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం అత్యాచార కేసుల్లో దేశంలోనే వైకాపా మూడోస్థానంలో ఉంది. ఇవి మేం చెబుతున్న లెక్కలు కావు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో ఉన్నవే.

– చంద్రబాబు నాయుడు
మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారికీ ఈ చట్టం కింద శిక్షలు తప్పవు

మృగాళ్లకు ఉరి.. ఊచలు

తెలంగాణ పోలీసులను తప్పుపట్టకూడదు
సుప్రీంకోర్టు కమిటీ, జాతీయ మానవహక్కుల  కమిషన్‌ ఏమంటాయి?
రేప్‌ తప్పే అయినా పోలీసులు  కాల్చడమూ తప్పే అని నిర్ధారిస్తాయి
అప్పుడు ఏ పోలీసూ, ఏ ప్రభుత్వ పెద్దా శిక్షించేందుకు ముందుకు రారు
  సీఎం జగన్‌ వ్యాఖ్యలు

అమరావతి: దిశ ఘటనలో తెలంగాణ పోలీసులు చేసింది తప్పేనని జాతీయ మానవహక్కుల కమిషన్‌, సుప్రీంకోర్టు కమిటీలు నిర్ధారిస్తాయని.. అదే జరిగితే రేపు అత్యాచారం చేసినవారిని శిక్షించేందుకు ఏ పోలీసు అధికారి, ఏ ప్రభుత్వ పెద్దా ముందుకు రారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించారు. అప్పుడు దోషులు యథేచ్ఛగా బయట తిరుగుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం ‘దిశ బిల్లు 2019’పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో వివరిస్తూ దిశ చట్టం రూపకల్పనకు దారితీసిన పరిస్థితులను వివరించారు.
‘‘రాష్ట్రంలో దారుణ పరిస్థితులను మార్చేందుకు ఎక్కడో ఒకచోట విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. 26 ఏళ్ల డాక్టరమ్మ దిశను టోల్‌గేట్‌ వద్ద బండికి పంక్చరు చేసి తీసుకెళ్లి అత్యాచారం చేసి కాల్చేసిన ఘటన మనం చూశాం. ఇందుకు కారకులైనవారిని ఏం చేసినా తప్పులేదని సమాజం అనుకుంది. ఇదే రకమైన ఒత్తిడి తెలంగాణ ప్రజల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంపై వచ్చింది. ఇదే ఘటన సినిమాల్లో జరిగితే పోలీసుగానో, బాధ్యతగల స్థానంలోనో ఉన్న హీరో తుపాకీతో వారిని కాల్చేస్తే మనం చప్పట్లు కొడతాం. తెలంగాణ పోలీసులు, ప్రభుత్వం కూడా కఠినచర్య తీసుకుంటేనే ఇలాంటివి ఆగుతాయనే నిర్ణయం తీసుకున్నారు. మరోసారి తెలంగాణ పోలీసులకు, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతున్నాను. తెలంగాణ పోలీసులు స్పందించిన తీరును ఎవరూ తప్పు పట్టకూడదు. చట్టానికి అర్థం వచ్చేలా, తల్లిదండ్రులందరికీ నమ్మకం కలిగేలా, పిల్లలను బయటకు పంపాలంటే భయపడే పరిస్థితి రాకుండా ఉండాలనే తపన, తాపత్రయంతోనే వాళ్లు నాలుగు అడుగులు ముందుకు వేసి చేయాల్సింది చేశారు’’ అన్నారు.

వాళ్లని చంపడం తప్పే అంటారు!
‘‘దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏం జరిగింది? జాతీయ మానవహక్కుల కమిషన్‌ దర్యాప్తు, సుప్రీంకోర్టు కమిటీలు.. సిట్‌ అంట, కమిటీలు అంట.. వీళ్లంతా ఏంచేస్తారు? అత్యాచారం చేసి చంపడం తప్పే అయినా పోలీసులు కాల్చడం కూడా తప్పే అంటారు. అలా చెబితే.. రేపు ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి ఘటనలు జరిగితే వాళ్లను శిక్షించేందుకు ఏ పోలీసు అధికారీ ముందుకు రారు. ఏ ప్రభుత్వ పెద్దా ముందుకు రారు. అప్పుడేం జరుగుతుంది? తప్పు చేసినవాళ్లు యథేచ్ఛగా బయటకు వస్తారు. బాధితుల తల్లిదండ్రులు రోదిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే చట్టపరంగా ఏం చేయాలనే ఆలోచనల్లోంచే దిశ చట్టం తీసుకొస్తున్నాం. ఇలాంటి ఘటనల్లో త్వరగా న్యాయం జరగాలని ప్రతి కుటుంబం కోరుకుంటోంది. నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లయినా ఇప్పటికీ దోషులకు శిక్ష పడలేదు. ఈ చట్టాలను మార్చేందుకు దేశం మొత్తం అడుగు వేయాలి. ఇలాంటి చట్టాల్లో కొన్ని రాష్ట్ర పరిధిలో, కొన్ని ఉమ్మడి జాబితాలో ఉన్నాయి.. అందుకే రాష్ట్రంలో రెండు చట్టాలు తెచ్చాం. ఒకటి రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. అప్పుడు జాతీయస్థాయిలో చర్చ జరుగుతుంది. మరో చట్టం రాష్ట్రంలోనే ఆమోదం పొందుతుంది. పిల్లల విషయంలో ఒక తండ్రి ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించి ఈ చట్టాలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.
తొలుత మంత్రి సుచరిత దిశ-2019 బిల్లును, చట్టసవరణ బిల్లులను ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అన్నారు. విడదల రజని మాట్లాడుతూ సీత, ద్రౌపది కూడా తమకు అన్యాయం జరిగినప్పుడు తక్షణ న్యాయమే కోరుకున్నారని చెప్పారు. మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, రెడ్డి శాంతి, కళావతి, ఉషాచరణ్‌ అధికారపక్షం నుంచి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ మహిళలకు రక్ష అని కొనియాడారు.


రాష్ట్రంలో జిల్లాకో ప్రత్యేక కోర్టు

ఈ చట్టంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలపై జరిగే నేరాలమీదే అక్కడ విచారిస్తారని సీఎం చెప్పారు. వీరికి సహకరించేలా డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాచారానికి పాల్పడినట్లు కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉంటే మరణశిక్ష విధించేలా చట్టం మారుస్తున్నామన్నారు. అత్యాచారానికి అందుబాటులోని (సబ్‌స్టాన్షియల్‌) సాక్ష్యాలున్నప్పుడు జీవితఖైదు విధించేలా మార్పులు చేస్తున్నామన్నారు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో పోస్కో చట్టం కింద ఇప్పుడు 3-7 ఏళ్లవరకు శిక్ష ఉండగా దాన్ని జీవితఖైదుగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడంపై ఇంతవరకు ఎలాంటి చట్టమూ లేదని, ఇప్పుడు సీఆర్‌పీసీలో కొత్త సెక్షన్‌ ఏర్పాటుచేసి ఇందుకూ శిక్షలు నిర్ణయించినట్లు చెప్పారు. తొలిసారి తప్పు చేస్తే రెండేళ్లు, మరోసారి తప్పు చేస్తే నాలుగేళ్ల శిక్ష విధించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళలకు సంబంధించిన నేరాల్లో నిందితుల జాబితాను అన్ని దర్యాప్తు సంస్థలకూ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.


అత్యాచార కేసుల్లో వైకాపాది మూడో స్థానం
తొలి రెండు స్థానాల్లో  భాజపా.. కాంగ్రెస్‌
ఏడీఆర్‌ నివేదిక చెబుతోంది  చూడండి
దిశ బిల్లుకు, సవరణలకు తెదేపా పూర్తి మద్దతు
  తెదేపా అధినేత చంద్రబాబు

అమరావతి: మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు దిశ చట్టం తీసుకురావడంలో ముఖ్యమంత్రి సంకల్పాన్ని తప్పుబట్టడం లేదని, ఇదే ఉత్సాహంతో చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లయినా నిర్భయ దోషులకు ఇప్పటికీ శిక్ష పడలేదన్నారు. దేశంలో ఉన్న ఇతర చట్టాలను, ప్రముఖుల సలహాలనూ పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయాలన్నారు. దిశ చట్టానికి, చట్ట సవరణలకు తెదేపా పూర్తి మద్దతు పలుకుతోందని చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. సత్వర న్యాయం చేయాలంటే ప్రమాదం వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే అన్నారని.. ఆయన మాటలు కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిర్దోషులకు శిక్షలు పడకుండా చూడాలన్నారు. దిశ బిల్లు-2019పై చర్చ సందర్భంగా తెదేపా అధినేత మాట్లాడారు. దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం అత్యాచార కేసుల్లో దేశంలోనే వైకాపా మూడోస్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇవి తాను చెప్పే లెక్కలు కావని, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదికను ప్రస్తావిస్తున్నానని అన్నారు. దేశంలో ఈ విషయంలో భాజపా తొలి స్థానంలోనూ, కాంగ్రెస్‌ రెండో స్థానంలోనూ, వైకాపా మూడో స్థానంలోనూ ఉన్నాయని చెప్పారు. వైకాపాకు చెందిన ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలపై అత్యాచారం కేసులు ఉన్నట్లు వారే తమ అఫిడవిట్లలో పేర్కొన్న విషయాల ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై అధికారపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. తాను విమర్శలు చేయడం లేదని, వారి పేర్లు బయటపెట్టలేదని, మీ వాళ్లయినా, మా వాళ్లయినా సరిదిద్దుకోవడానికే ఈ విషయం చెబుతున్నానన్నారు. విజయవాడలో రవాణా కమిషనర్‌పై తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాలర్‌ పట్టుకుని దాడిచేసినా చర్యలు తీసుకోలేదని, పైగా చంద్రబాబు పంచాయతీ చేసి ఆ విషయాన్ని ఘనంగా ప్రకటించుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. తిరిగి చంద్రబాబు ఏడీఆర్‌ నివేదికపై మాట్లాడబోగా మంత్రి వెల్లంపల్లి అభ్యంతరం చెబుతూ.. కాల్‌మనీ కేసును ప్రస్తావించారు. కొడాలి నాని, అప్పలనాయుడు తదితరులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమాలకు సంబంధించిన ఘటనలను ప్రస్తావించారు.

 ఎర్రగడ్డ.. వెటర్నరీ ఆస్పత్రి..  మానసిక వైద్యాలయం
ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొడాలి నానీని ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపాలన్నారు. దీంతో కొడాలి ఆగ్రహిస్తూ అచ్చెన్నాయుడిని వెటర్నరీ ఆస్పత్రికి పంపాలన్నారు. దీంతో అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన శరీరాకృతిని విమర్శించడం ఏమిటన్నారు. అమరావతిలో చంద్రబాబు పేరుతో మానసిక వైద్యకేంద్రం ఏర్పాటుచేసి చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు తదితరులను పంపాలని మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చర్చ పక్కదోవ పడుతోందని ఈ వ్యాఖ్యలన్నీ సరికావని, వీటిని రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. చంద్రబాబు చర్చను పక్కదోవ పట్టించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.

ఇప్పుడంతా చంద్రజపమే!
తిరిగి తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడుతూ అందరూ రామజపం అంటారని, సభలో ఇప్పుడంతా చంద్రజపం అయిపోయిందని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసభ్యపదం వాడిన అంశంపై చంద్రబాబు వివరణ ఇవ్వబోగా సభాపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సభ తనకు అనుమతిచ్చిందని, తాను నిర్ణయం తీసుకుంటానని అన్నారు. వక్రీకరించడంలో చంద్రబాబు దిట్ట అంటూ, అంతకు ముందు విషయాన్ని ముఖ్యమంత్రికి ఆపాదించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మంత్రి కన్నబాబు తప్పుబట్టారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెదేపా సభ్యురాలు ఆదిరెడ్డి భవాని అన్నారు.

Courtesy Eenadu…