Image result for ఏపీలో దిశ చట్టం"వారంలో దర్యాప్తు పూర్తి
మరో 14 రోజుల్లోనే విచారణ ముగియాలి
ఆధారాలుంటే ఉరి శిక్షే
అసభ్య పోస్టులు పెడితే రెండేళ్ల జైలు శిక్ష
పిల్లలపై రేప్‌ నేరాలకు 20 ఏళ్ల పాటు ఖైదు
కేసీఆర్‌ హ్యాట్సాఫ్‌

‘‘దిశ ఘటన మన రాష్ట్రంలో జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే… మనమూ తెలంగాణ సర్కారు తరహాలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్సాఫ్‌!’’  సీఎం జగన్‌

క్రూరులకు ఉరే సరి!… 14 రోజుల్లోనే విచారణ ముగియాలి
అమరావతి, డిసెంబరు 11: మహిళలు, బాలికలపై అకృత్యాలకు పాల్పడితే…. దీనికి సంబంధించిన తిరుగులేని ఆధారాలు లభిస్తే… 21 రోజుల్లోనే ఉరి శిక్ష! సోషల్‌ మీడియాలో మహిళలను కించపరిస్తే రెండేళ్లు జైలు! పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి… నేర తీవ్రతను బట్టి ఇరవై ఏళ్ల వరకు కారాగారవాసం! ఇది… ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం – 2019. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా ‘క్రిమినల్‌ లా’ను సవరించాలని నిర్ణయించింది.
బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కేబినెట్‌ భేటీలో 21 అజెండా అంశాలతో పాటు, రెండు టేబుల్‌ ఐటమ్స్‌ ప్రవేశపెట్టారు. ‘‘దిశ ఘటన మన రాష్ట్రంలో జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే… మనపైనా ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చేది. మనమూ తెలంగాణ సర్కారు తరహాలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం నిజంగా హ్యాట్సాఫ్‌. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుందాం. భవిష్యత్తులో ఆడపిల్లలపై చేయి వేయాలని, మానభంగం చేయాలన్న ఆలోచన వచ్చేందుకూ భయపడేంత కఠినమైన చట్టం తీసుకొద్దాం. ఈ చట్టం పేరు వింటేనే భయపడిపోవాలి’’ అని జగన్‌ అన్నారు.
మహిళలపై అత్యాచారం, హత్యలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరి శిక్షను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టంలో నేరుగా ‘ఉరి శిక్ష’ అని కాకుండా… జైలు శిక్ష లేదా మరణ శిక్ష అని పెడితే బాగుంటుందేమో అని సీఎస్‌ నీలం సాహ్ని, లా కార్యదర్శి అభిప్రాయపడ్డారు. అందుకు సీఎం జగన్‌ నిరాకరించారు. ‘‘అత్యాచార హంతకులకు శిక్ష పడుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. నిర్ధారించదగ్గ ఆధారాలతో దొరికిన వారిని ఉరి తీయాల్సిందే’’అని స్పష్టం చేశారు. 
ఎలాంటి నేరాలు
మహిళలపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, చిన్నారులపై దాడుల కేసుల్లో సత్వర విచారణ. జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటవుతాయి. ఇవి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లా పని చేస్తాయి.
సోషల్‌పోస్టింగ్‌లూ…
సోషల్‌ మీడియాలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా.. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారీ తప్పు చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
పిల్లలపై నేరాలకు
పోక్సో చట్టం కింద 3 నుంచి ఐదేళ్ల వరకూ ఉన్న శిక్షలను కేబినెట్‌ సవరించింది. ఇకపై… పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష వేస్తారు. నేర తీవ్రతను బట్టి గరిష్ఠంగా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.
కేసు నుంచి శిక్ష దాకా…
7 రోజులు: అత్యాచార కేసుల్లో పోలీసులు వారంలో దర్యాప్తు చేయాలి.
14 రోజులు: కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత 14 రోజులపాటు రోజువారీ విచారణ జరుగుతుంది.
21 రోజులు: సంఘటన జరిగిన రోజు నుంచి 21 పనిదినాల్లో శిక్ష ఖరారవుతుంది.

(Courtesy Andhrajyothi)