– అంచనాలకు దూరంగా ప్రత్యక్ష  పన్నులవసూళ్లు..!

– తొలి అయిదున్నర నెలల వసూళ్లు 4.4 లక్షల కోట్లే
– ప్రభావం చూపుతున్న ఆర్థిక మందగమన పరిస్థితి
– ఖాజానాకు మరింతగా పెరుగనున్న సర్కారు ద్రవ్యలోటు
– అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కొత పడే ప్రమాదం!
– మెరుగైన పన్ను వసూళ్లపై దృష్టి సారిస్తాం: సీబీడీటీ
వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. మందగమనానికి అద్దం పడుతూ సర్కారుకు ప్రత్యక్ష పన్నుల రూపంలో లభించే ఆదాయపు వృద్ధి పడిపోతూ వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)) తొలి ఐదున్నర నెలల కాలంలో సర్కారు నిర్ధేశించుకున్న ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో కేవలం మూడో వంతు ఆదాయం మాత్రమే సర్కారు ఖజానాకు చేరింది. ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు ఏప్రిల్‌- సెప్టెంబరు 15వ తేదీ వరకు పరిశీలించి చూస్తే నికరంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేవలం 5 శాతం మేర పెరిగి రూ.4.4 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. అంటే సర్కారు రానున్న ఆరున్నర నెలల కాలంలో ఇప్పుడు సాధించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లకంటే దాదాపు రెండింతలుగా ప్రత్యక్ష పన్నులను కలెక్ట్‌ చేయాల్సి ఉంటుంది. సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17.3 శాతం మేర పెరిగి రూ.13.35 లక్షల కోట్లకు చేరగలవని అంచనా కట్టింది. ఇందులో రూ.7.66 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్నుల ద్వారా, రూ.5.69 కోట్లు ఆదాయం పన్ను ద్వారా సమకూరనున్నట్టు బడ్జెట్‌ అంచనాల్లో విశ్లేషించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కారుకు ప్రత్యక్ష పన్నుల ఆదాయం వృద్ధిలో తగ్గుదల కనిపిస్తోంది.

ఆర్థిక క్రమశిక్షణ లోపించే ప్రమాదం..
ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు తగడం కారణంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ పక్కదారి పట్టే ప్రమాదం కనిపిస్తోంది. ద్రవ్యలోటు పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ ఏడాది బడ్జెట్‌లో ద్రవ్యలోటు అంచనా రూ.7,03,760 కోట్లు కాగా, జులై నెల వరకే అది రూ.5,47,605 కోట్లుగా నమోదైంది. అంటే ఏడాది మొత్తానికి గణించిన అదనపు ఖర్చు అంచనాలో 77 శాతం ఇప్పటికే అయిపోయింది. ప్రత్యక్ష పన్ను ఆదాయం తగ్గడం వల్ల ద్రవ్యలోటు సర్కారు నిర్ధేశించుకున్న జీడీపీలో 3.3 శాతం పరిధిని దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇదే జరిగితే పాలనపై ప్రభుత్వ వ్యయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫలితంగా సంక్షేమ పథకాలకు కొత పడే ప్రమాదము లేకపోలేదు. ఇదే సమయంలో సర్కారు లెక్కల ప్రకారం ముందస్తు పన్ను చెల్లింపుల రూపంలో వచ్చిన దాదాపు రూ.లక్ష కోట్ల సొమ్మును పన్ను రిఫండ్ల రూపంలో ప్రభుత్వం వెనక్కి ఇవ్వాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే సర్కారు పన్ను ఆదాయం మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదున్నరేండ్ల కాలంలో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లుకూడా 5.5 శాతానికే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు శుక్రవారం నిర్వహించనున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశంలో వివిధ వస్తుసేవలపై జీఎస్టీని తగ్గించే అవకాశాలు తగ్గిపోనున్నాయి. పరిశ్రమల వర్గాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ తన ఆదాయం పడిపోతున్న నేపథ్యంలో సర్కారు జీఎస్టీని తగ్గించి.. తన ఇన్‌కమ్‌కు మరింతగా కోత విధించుకొనేందుకు పెద్దగా ఆసక్తి కనబరిచకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధి అంచనాకన్నా తక్కువగా నమోదు కావడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టుగా ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీడీటీ) సభ్యుడు అఖిలేశ్‌ రంజన్‌ అన్నారు. ఈ విషయంలోరానున్న రోజుల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.
సెప్టెంబరు 15 ప్రత్యేకం..
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో సెప్టెంబరు 15కు ఒక ప్రత్యేకత ఉంది. కార్పొరేట్‌, వ్యాపార సంస్థలు రెండో త్రైమాసికం ముందస్తు పన్ను చెల్లింపులను ఈ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తేదీ లోపు సంస్థలు తమ పన్ను చెల్లింపు బాధ్యతల్లో దాదాపు 45 శాతం వరకు ముందస్తు పన్ను చెల్లింపులను జరపాల్సి ఉంటుంది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో వ్యాపార సంస్థలు వరుసగా 30%, 25% మేర ముందస్తు పన్ను చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కీలకమైన సెప్టెంబరు 15వ తేదీ ముగింపు నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంచనాల కంటే భారీగా పడిపోవడం ఇప్పుడు సర్కారును ఇబ్బంది పెడుతోంది. సెప్టెంబరు 15 నాటికి ప్రభుత్వ ఖజానాకు చేరిన ముందస్తు పన్ను చెల్లింపుల్లో కేవలం 6% వృద్ధి మాత్రమే కనపించడం విశేషం. గతేడాది ఇదే కాలంలో ఈ ముందస్తు పన్ను చెల్లింపుల్లో దాదాపు 18% వృద్ధి కనిపించింది. దీనిని బట్టి చూస్తే ప్రత్యక్ష పన్నుల ముందస్తు చెల్లింపులపై మందగమనం ప్రభావం ప్రస్ఫుటంగా వెల్లడిస్తున్నాయని పేరు చెప్పేందుకు ఇష్టపడి ప్రభుత్వ అధికారి ఒకరు విశ్లేషించారు.

Courtesy NavaTelangana..