దిగంబర కవి భైరవానంద అస్తమయం
సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా కవిత్వ రచన
విప్లవ భావాల నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం
విజయనగరం జిల్లాలో 4ఎకరాల్లో ఆశ్రమ స్థాపన
అక్కడే నివాసం, ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు

విజయనగరం: దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో మరో దీపం ఆరిపోయింది. విప్లవ రచనలతో సమాజాన్ని తట్టిలేపిన భైరవానంద స్వామి(77) డిసెంబరు 19న కన్నుమూశారు. ఆధ్యాత్మిక విలువలతో సమాజానికి సేవలందించిన ఆయన విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వింధ్యవాసి గ్రామ సమీపంలో పన్నెండేళ్ల కింద ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడే కుటీరాన్ని నిర్మించుకుని ప్రజలకు భక్తి బోధనలు చేసేవారు. నగ్నముని, నిఖిలేశ్వర్‌, జ్వాలాముఖి, చెరబండ రాజు, భైరవయ్య, మహాస్వప్న దిగంబర కవులుగా గుర్తింపు పొందారు.

వీరు సంయుక్తంగా రచించిన మూడు కవితా సంకలనాలను దిగంబర కవుల పేరుతో ఏకసంపుటిగా ముద్రించారు. శ్రీశ్రీ సాహచర్యంతో భైరవయ్య తన రచనలకు మరింత పదును పెట్టారు. సాహిత్యానికి దూరమైన తరువాత ప్రశాంత వాతావరణంలో జీవనం గడిపేందుకు 1983-84లో సన్యాసం పుచ్చుకున్నారు. వింధ్యవాసి పొలిమేరల్లో నాలుగెకరాలు కొనుగోలు చేసి ఆశ్రమం నిర్మించారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో శారదాదేవి, బాలగంగాధర్‌ తిలక్‌ దంపతులకు 1942 డిసెంబరు 8న భైరవానంద జన్మించారు. తెలుగు సాహిత్యంలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన శారదాదేవి హైదరాబాద్‌ తెలుగు ఆంధ్ర మహిళా కళాశాలలో ఆచార్యురాలు, విభాగాధిపతి కాగా, తండ్రి బాలంగాధర్‌ తిలక్‌ హోమియో వైద్యునిగా పనిచేసేవారు. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన సాహిత్యంలోనే విశేషంగా రాణించి, విప్లవ కవుల్లో ఒకరిగా భైరవయ్య పేరు తెచ్చుకున్నారు.

గోదావరి తీరప్రాంత గ్రామాలు, వారి సమస్యలు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు ఇతివృత్తంగా ‘గలగలా గోదారి’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’లో చిన్న కథలు రాసేవారు. విశాఖ ఆకాశవాణి నుంచి ప్రసారమయ్యే భక్తిరంజనిలో ఆధ్యాత్మిక సూక్తులు అందించేవారు. ‘అగ్నిప్రవేశం’, ‘తెరచిన గీతం’, ‘షష్టిపూర్తి’, ‘కురు భిక్షం’, ‘అనుయజ్ఞం’, ‘నరమాంసం’, ‘రుచిమరిగి’, ‘దిగంబరి’ వంటి రచనలు ఆయనకు మంచి పేరుతెచ్చాయి. భైరవానందకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రాగద్వేషాలకు అతీతంగా…
భైరవానంద స్వామి సహచర్యంతో విప్లవ సాహిత్యం, రచనలు, ఆధ్యాత్మిక అంశాలతో పరిచయం ఏర్పడింది. రాగద్వేషాలు, మతం లేని భావనతో నడిచారు. మనసు నిర్మలంగా ఉండేందుకే కుటుంబానికి దూరంగా ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు వచ్చి చూసి వెళ్తుండేవారు.
శ్రావణకుమార్‌, శిష్యుడు, బ్యాంకు ఉద్యోగి

సాధారణ జీవనానికి ప్రతీక
సాధారణ జీవనం కోసం భైరవానంద ఆశ్రమాన్ని స్థాపించారు. విప్లవ సాహిత్యం పట్ల ఆసక్తిగా ఉండే ఆయన మధ్యలో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, మానవతా విలువలకు పెద్ద పీట వేశారు. ఆయన మృతి సాహిత్యానికి తీరని లోటు.
గంటేడ గౌరునాయుడు, కవి, పార్వతీపురం

(Courtesy Andhrajytohi)