సింగరేణిలో తాజా స్థితిపై నివేదిక ఇవ్వాలి
  జాతీయ గిరిజన కమిషన్‌ ఛైర్మన్‌ నంద్‌కుమార్‌సాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల కారణంగా నిర్వాసితులైన గిరిజనుల్లో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జాతీయ గిరిజన కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నంద్‌కుమార్‌సాయి సూచించారు. గనుల కేటాయింపు కారణంగా ఆస్తులు, భూములు కోల్పోయిన వారిలో ఎందరికి ఉద్యోగాలిచ్చారని సింగరేణి అధికారులను ఆయన ప్రశ్నించారు. సీనియారిటీ ప్రకారం ఉద్యోగాలు కల్పించడం కాదని, అర్హులందరికీ గడువులోగా ఉపాధి కల్పించాలని ఆదేశించారు. నిర్వాసితులకు ఉద్యోగాలు, కనీస మౌలిక సదుపాయాల కల్పన, పునరావాసం అంశాలపై తాజా నివేదిక అందజేయాలని ఛైర్మన్‌ కోరారు. ఆదివారం ఒకరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన ఇక్కడి దిల్‌ఖుష అతిథిగృహంలో సింగరేణితో పాటు గిరిజన సమస్యలు, సంక్షేమశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి పదోన్నతులలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపచేసి, ఖాళీగా మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు.

నిర్మాణాత్మకంగా మాట్లాడాలి
పర్యటనలో భాగంగా వివిధ సంఘాల నుంచి అభ్యర్థనలు స్వీకరించారు. లంబాడీలు, ఎరుకల సామాజిక వర్గాలవారు తమ సమస్యలు విన్నవించారు. గిరిజన జాబితా నుంచి తొలగించాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయని, రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయమై గొడవలు జరుగుతున్నాయని సంఘాల నాయకులు చెప్పగా.. ‘‘గొడవ చేస్తే అది సాధారణ సమస్యవుతుంది. ఇక్కడికి వచ్చినపుడు రాజ్యాంగబద్ధంగా, నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. రిజర్వేషన్ల అంశం రాజ్యాంగ అంశం’’ అని కమిషన్‌ ఛైర్మన్‌ తెలిపారు. గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి కింద జనాభాదామాషా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చుచేసేలా ఆదేశాలివ్వాలని సంఘాల ప్రతినిధులు కోరారు. రాష్ట్రంలో గిరిజనులకోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేయాలని పలుసంఘాలు కోరగా.. ఈ విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన గ్రామ పంచాయతీల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని, గోండు, కోయ, లంబాడీ భాషలకు కేంద్రప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని వినతులు వచ్చాయి. జాతీయ ఎస్టీ కమిషన్‌ నిర్వహించిన సమీక్ష, బహిరంగ విచారణలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ క్రిస్టీనా, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

(Courtesy Eenadu)