Image result for ‘కొత్త పౌరసత్వం’తో మేధో వలసలు"రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

పౌరసత్వ సవరణ చట్టం పర్యవసానంగా మేధావుల వలసలు (బ్రెయిన్ డ్రెయిన్) ముమ్మరమయ్యే అవకాశం ఎంతైనా వున్నది. విదేశాలలో చదువుకున్న భారతీయ శాస్త్రవేత్తలలో అతి కొద్దిమంది మాత్రమే, సంకుచిత దురభిమనాలు పెచ్చరిల్లిపోయిన స్వదేశానికి తిరిగివస్తారు. భారత్‌కు వాటిల్లే నష్టం అమెరికాకు లాభదాయకం కానున్నది.

పౌరసత్వ సవరణ బిల్లు (ఇప్పుడు చట్టం)కు వ్యతిరేకంగా అనేక మంది అనేక విధాలుగా నిరసన తెలుపుతున్నారు. ఆ నిరసనలు ఇంకా వెల్లువెత్తనున్నాయి. భారత్‌ను పూర్తిగా ఒక భిన్న దేశంగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్న ఈ చట్టం భారత రాజ్యాంగ హృదయంపై శరాఘాతానికి పాల్పడింది. కనుకనే వివిధ రంగాలకు చెందిన సంఖ్యానేకులు ఆ చట్టానికి వ్యతిరేకంగా తమ గళమెత్తారు.

కొత్త పౌరసత్వ చట్టంతో విభేదిస్తున్న వారిలో భారతీయ శాస్త్రవేత్తలూ అగ్రగాములుగా వున్నారు. మన శాస్త్రవేత్తలు సాధారణంగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపరు. ప్రజాహిత అంశాలపై సమష్టి కార్యాచరణకు పేరుపడినవారూ కాదు. మన ఉన్నత విద్యా సంస్థలకు చెందిన దాదాపు వేయి మంది ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్న దశలోనే వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్‌పై తమ సంతకాలు చేశారు. ఆ పిటీషన్ ఇలా పేర్కొంది: ‘భారత స్వాతంత్య్రోద్యమం నుంచి ఆవిర్భవించిన భారత్ భావనను మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అన్ని మతాల అనుయాయులను సమానంగా చూడాలని ఆ భావన ఉద్బోధిస్తుంది. ప్రతిపాదిత బిల్లులో పౌరసత్వానికి మతాన్ని ప్రమాణంగా పాటించడం ఆ సమున్నత చరిత్రతో పూర్తిగా విభేదించడమే అవుతుంది. మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఆ బిల్లు పూర్తిగా విరుద్ధమైనది. ఆ బిల్లు పరిధినుంచి మైనారిటీ మతస్థులను ముఖ్యంగా ముస్లింలను మినహాయిస్తుండడం వల్ల మన లౌకిక, ప్రజాస్వామ్య, బహుతావాద వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవగలదని మేము భయపడుతున్నాము’. వారు ఇంకా ఇలా అన్నారు: ‘పౌరసత్వ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి. దాని స్థానంలో శరణార్థుల, మైనారిటీల సమస్యలను వివక్షారహిత పద్ధతిలో పరిష్కరించేందుకు దోహదం చేసే మరో సముచిత బిల్లును తీసుకురావాలి’.

ఈ పిటిషన్‌పై సంతకం చేసిన వారిలో రాయల్ సొసైటీ (ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక శాస్త్ర పరిశోధనా సంస్థ) ఫెలోలు, మన దేశంలోని ప్రపంచ ప్రమాణాలకు దీటుగా సరితూగే పరిశోధనా సంస్థల డైరెక్టర్లు, ఐఐటీల ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు వున్నారు.

నేను చరిత్రకారుడినే అయినప్పటికీ శాస్త్రవేత్తల కుటుంబం నుంచి వచ్చాను. నా పరిశోధనా వ్యాసంగంలో మూడు దశాబ్దాలకు పైగా భారతీయ వైజ్ఞానిక జగత్తులోని ఉత్కృష్ట ధీమంతులతో కలిసిపనిచేయడం జరిగింది. ఈ అనుభవ ప్రాతిపదికన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మన శాస్త్రవేత్తల ప్రకటన అసాధారణమైనదని నిశ్చితంగా చెప్పగలను. ఈ ప్రకటన చేసినవారు నిత్యం ఏదో ఒక అంశంపై తప్పకుండా సంతకాల ఉద్యమాన్ని నిర్వహిస్తుండే జేఎన్‌యూ విద్యార్థులు, అధ్యాపకులు కారు; మానవహక్కుల కార్యకర్తలూ కారు; వామపక్షాల వైపు మొగ్గే సృజనాత్మక కళాకారులూ కారు. శాస్త్ర ప్రపంచంలో సమున్నత గౌరవాదరాలు గల ప్రతిభావంతులూ, ప్రభవిస్తోన్న యువ వైజ్ఞానికులు. జాతి హిత అంశంపై వారు సమష్టిగా ఒక బహిరంగ ప్రకటన చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన ప్రకటనపై సంతకం చేసిన శాస్త్రవేత్తలలో ఒకరు బ్రిటన్‌లో స్థిరపడిన నోబెల్ శాస్త్రవేత్త వెంకట్రామన్(వెంకి) రామకృష్ణన్. మతం ప్రాతిపదికన వివక్ష చూపడమనేది విజ్ఞానశాస్త్రానికి గానీ, సమాజానికి గానీ ఏ మాత్రం మేలు చేయదని ఆయన స్పష్టం చేశారు. ‘ఎటువంటి దురభిమానాలు, వివక్షకు తావులేకుండా ప్రతిభాసామర్థ్యాలను గుర్తించి, గౌరవించే వాతావరణాన్ని విద్యావేత్తలు కోరుకుంటారు. అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణంలోనే వైజ్ఞానిక పరిశోధనలు సత్ఫలితాలను సాధించగలుగుతాయని’ వెంకీ నొక్కి చెప్పారు.

ప్రొఫెసర్ రామకృష్ణన్ ఇటీవలి సంవత్సరాలలో తరచు తాను పుట్టి పెరిగిన ఈ దేశానికి వస్తున్నారు (ఆయన ఉన్నత విద్యాభ్యాసం ఒకనాటి ప్రశస్త, ఇప్పుడు పతనావస్థలో వున్న బరోడాలోని ఎమ్.ఎస్.యూనివర్శిటీలో జరిగింది). ఆయన ఏటా భారత్‌ను సందర్శిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు; విద్యావిషయిక సదస్సులలో పాల్గొంటున్నారు; వివిధ వయస్సులలో వున్న, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన భారతీయులతో మాట్లాడుతున్నారు. ఈ ప్రత్యక్ష అనుభవాల ఆధారంగానే ఆయన ఇలా అన్నారు: ‘యువ భారతీయులు అపూర్వ జ్ఞానాన్వేషకులు. కష్టపడి పనిచేసే మనస్తత్వంగల వారు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో అత్యంత క్లిష్ట పరిస్థితులలో చాలా ఓర్పుతో శ్రమిస్తున్నారు. దేశంలో విభేదాలు, చీలికలు సృష్టించడం ద్వారా జాతి నిర్మాణంలో నిమగ్నమైన ఆ యువ మేధావులకు ఎటువంటి ఆటంకాలు కల్పించకూడదని మేము కోరుతున్నాము’.

ఇతర ప్రముఖ శాస్త్రవేత్తల వలే వెంకీ రామకృష్ణన్ కూడా తన పరిశోధనలకే ప్రాధాన్యమిస్తారు. ప్రజాసమస్యలు, జాతి హిత అంశాలపై బహిరంగ చర్చలలో తరచూ పాల్గొనరు. అయితే, పౌరసత్వ సవరణ బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘నేను బ్రిటన్‌లో స్థిరపడినప్పటికీ నా మాతృదేశం అంటే నాకు ఎంతో అభిమానం. ఆ కారణంగానే నేను పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తాలని నిర్ణయించుకున్నాను. ఒక మహా సహనశీల ఆదర్శానికి భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని నేను భావిస్తున్నాను. భారత్ సకల రంగాలలో సర్వోత్కృష్ట విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నానని’ ఆయన అన్నారు. వెంకీ ఇంకా ఇలా అన్నారు: ‘ఇరవై కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి మీ మతం ఇతర మతాలకు సమానమైనది కాదని చెప్పడాన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తునన్నాను. అటువంటి ధోరణి భారతీయ సమాజంలో సామరస్యాన్ని భగ్నం చేస్తుంది. ఇది ఎంత మాత్రం జాతి శ్రేయస్సుకు తోడ్పడదు’.

మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి (ఈయనే శాస్త్ర, సాంకేతిక రంగాల మంత్రి కూడా) వివిధ ప్రజా వేదికలపై భారతీయ వైజ్ఞానిక ప్రతిభ గురించి మిథ్యాసత్యాలను ప్రకటిస్తుండడంపై దేశంలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివిధ కీలక పదవులకు సంబంధించిన నియామకాలలో రాజకీయ జోక్యం పెరిగిపోతుండడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. స్వతంత్ర, మౌలిక వైజ్ఞానిక పరిశోధనకు దోహదం చేసే అనుకూల వాతావరణం మరింత తగ్గిపోగలదనే వారి భయాందోళలను పౌరసత్వ సవరణ చట్టం ధ్రువీకరించింది.

వైజ్ఞానిక పరిశోధనలకు అత్యుత్తమ సదుపాయాలు, సమున్నత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్న దేశం అమెరికా. ఒకప్పుడు ఈ ఘనత జర్మనీకి వుండేది.. వెంకీ రామకృష్ణన్ ఇలా అన్నారు: ‘పాలకుల భావజాల కోణం నుంచి సైన్స్ గురించి ఆలోచించిన దేశాలు తమ వైజ్ఞానిక ప్రతిభను సర్వనాశనం చేసుకున్నాయి. జర్మనీయే ఇందుకొక ఉదాహరణ. హిట్లర్ సంకుచిత భావజాల ప్రభావంనుంచి కోలుకునేందుకు జర్మనీకి యాభై సంవత్సరాలు పట్టింది’. జర్మనీకి జరిగిన నష్టం అమెరికాకు విశేష లబ్ధిని సమకూర్చిందని కూడా వెంకీ చెప్పి వుండవల్సింది. హిట్లర్ అనుసరించిన మూర్ఖపు విధానాల కారణంగానే ఎంతో మంది జర్మన్ శాస్త్రవేత్తలు అమెరికాకు వలసపోయారు.

ఏ దేశంలో నైనా సైన్స్ నిజంగా వర్ధిల్లాలంటే ఆ దేశానికి పటిష్ఠ వ్యవస్థ వుండాలి; వైజ్ఞానిక పరిశోధనలకు ప్రభుత్వ సహాయ సహకారాలు సంపూర్ణంగా వుండాలి; ప్రజాస్వామ్యాన్ని, బహుళత్వ సంస్కృతిని పరిపుష్టం చేసే రాజకీయ వాతావరణం వుండాలి. ఈ మూడు పరిస్థితులు అమెరికాలో పరిపూర్ణంగా వున్నాయి. ఆ మూడు విధాల పరిస్థితులను పెంపొందించుకునేందుకు భారత్ చాలా ప్రయాస పడుతున్నది. మోదీ ప్రభుత్వ విధానాల కారణంగా ఆర్థికాభివృద్ధి మందగమనంలో పడిపోయింది. మోదీ సర్కార్ పూర్తిగా మేధావుల వ్యతిరేక ప్రభుత్వం. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంతో ప్రజాస్వామ్యం, బహుళత్వ సంస్కృతికి పెనుముప్పు వాటిల్లనున్నది. ఈ కారణాల వల్లే కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారతీయ శాస్త్రవేత్తలు మున్నెన్నడూ లేని విధంగా సమష్టిగా నిరసన తెలిపారు.

నిరంకుశాధికార తత్వం వైజ్ఞానిక పరిశోధనల పురోగతికి దోహదం చేయదు. మత దురభిమానం వల్ల శాస్త్ర పరిశోధనలకు అంత కంటే ఎక్కువ హాని జరిగే అవకాశం ఎంతైనావున్నది. ప్రతి వైజ్ఞానిక సత్యాన్ని హిందువులు ఏనాడో కనిపెట్టారని, ముస్లింల కంటే హిందువులే ఉత్కృష్టులని విశ్వసించే రాజకీయవేత్తలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నంత వరకు మన వైజ్ఞానిక ప్రతిభ వికసించదు, వర్ధిల్లదు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ కూడా పరిపూర్ణంగా పురోగమించలేదు.

1950, 1960 దశకాలలో విదేశాలలో శిక్షణ పొందిన ఎంతో మంది భారతీయ శాస్త్రవేత్తలు తమ ప్రతిభాపాటవాలను మాతృదేశ సేవలో ఉపయోగించడానికి స్వదేశానికి తిరిగివచ్చారు. సమున్నత ఆదర్శాల ప్రేరణతో స్వతంత్ర భారత్‌ను ఒక శక్తిమంతమైన జాతిగా తీర్చిదిద్దేందుకు వారు పాటుపడ్డారు. లౌకిక విలువలు, ప్రజాస్వామ్యానికి నిబద్ధమై నవీన వైజ్ఞానిక పరిశోధనలను ప్రోత్సహించిన మన ప్రథమప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ఆనాడు దేశంలోని రాజకీయ వాతావరణం కూడా ఆ దేశభక్తి ప్రపూరితులైన శాస్త్రవేత్తలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. నెహ్రూ అనంతర కాలంలోకూడా విదేశాలలో శిక్షణ పొందిన భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగివచ్చారు. వ్యక్తిగత జీవితాలకు, పరిశోధనా వ్యాపకాలకు పాశ్చాత్య దేశాలలో అపార అవకాశాలు ఉన్నప్పటికీ వారు భారత్‌కు తిరిగిరావడం చెప్పుకోదగిన విషయం. మౌలిక పరిశోధనలను స్వేచ్ఛగా ప్రోత్సహించే ఉన్నత విద్యాసంస్థలు ఇంకా వర్ధిల్లుతుండడం వల్లే వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. నా సహపాఠులు పలువురు హార్వార్డ్, కొలంబియా, ప్రిన్స్‌టన్, కార్నెల్ మొదలైన ప్రపంచ అగ్రగామి విశ్వ విద్యాలయాలలో పరిశోధనలు చేశారు. వారు కోరుకుంటే ఆ విశ్వవిద్యాలయాలలోనే వారికి అధ్యాపకులుగా నియామకాలు లభించివుండేవి. అయినా వారు మాతృదేశానికి తిరిగివచ్చారు. మరి వారి విద్యార్థులు సైతం అలా తిరిగిరావడానికి ఇష్టపడుతున్నారా?

టెస్ట్ ట్యూబ్ బేబీలను సృష్టించడం, విమానాలను రూపొందించి నడపడం పురాతన హిందువులకు బాగా తెలుసని చెబుతున్న కేంద్ర మంత్రులే గాక, ప్రధాన మంత్రి సైతం చెప్పడాన్ని నేటి యువ భారతీయ శాస్త్రవేత్తలు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వైజ్ఞానిక నిపుణుల సలహాలు, సూచనలను ఉపేక్షించడాన్ని కూడా వారు చూస్తున్నారు. మన ఉత్కృష్ట విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు సైతం ఆరెస్సెస్ విధేయులను వీసీలుగా, డైరెక్టర్లుగా నియమించడాన్ని కూడా వారు చూస్తున్నారు. పోలీసులు విశ్వ విద్యాలయాల గ్రంథాలయాలను కూడా ధ్వసం చేయడాన్ని (బ్రిటిష్ పాలకుల హయాంలో కూడా ఎన్నడూ సంభవించని పరిణామమిది) కూడా వారు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైజ్ఞానిక పరిశోధనకు సంపూర్ణ సానుకూల పరిస్థితులు ఉన్న దేశంలో తమ పరిశోధనా వ్యాసంగాలకు అవకాశం లభిస్తే వారు ఈ దేశంలో ఎందుకు వుంటారు?

పౌరసత్వ సవరణ చట్టం (అలాగే సాధారణంగా హిందూత్వ అధిక సంఖ్యాక వాదం) పర్యవసానంగా మేధావుల వలసలు (బ్రెయిన్ డ్రెయిన్) ముమ్మరమయ్యే అవకాశం ఎంతైనా వున్నది. విదేశాలలో చదువుకున్న భారతీయ శాస్త్రవేత్తలలో అతి కొద్ది మంది మాత్రమే, సంకుచిత దురభిమనాలు పెచ్చరిల్లిపోయిన స్వదేశానికి తిరిగివస్తారు. భారత్‌కు వాటిల్లే నష్టం అమెరికాకు లాభదాయకం కానున్నది. భారతీయ వైజ్ఞానిక పరిశోధనలకు ఉజ్వల భవిష్యత్తు విషయమై భరోసా కన్పించడం లేదు. అయితే వివక్షాపూరిత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మన శాస్త్రవేత్తలు పలువురు తమ గళమెత్తడం హర్షదాయకం. వారికి మనం కృతజ్ఞతాబద్ధులం. జాతి భవిష్యత్తు గురించి జాగరూకత వహించే ప్రభుత్వం భారతీయ వైజ్ఞానిక ప్రపంచంలోని సమున్నత ఆలోచనాపరులు చెప్పే మాటలను తప్పకుండా వినాలి. మోదీ ప్రభుత్వం వినదు. ఎందుకంటే అది మేధావులకు వ్యతిరేకమైనది. అంతేకాదు మూఢ విశ్వాసాలు, మత దురభిమానంతో వ్యవహరించే ప్రభుత్వమది. అయితే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మన శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను నిండు నిజాలని చరిత్ర నిరూపిస్తుంది. శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడం భారతదేశానికి అవసరం. అందుకే వారు కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడారు.

(Courtesy Andhrajyothi)