– రావత్‌ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
– నిర్లక్ష్యం కారణంగానే తీవ్రవాదం వైపునకు యువత
– వారి సమస్యలపై దృష్టి సారించాలంటున్న అధ్యయనాలు

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు చెందిన చిన్నారులకు సంబంధించి సైనిక దళాల అధిóపతి బిపిన్‌ రావత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పదవి చేపట్టిన అనంతరం ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో రావత్‌ పలు అంశాలపై ప్రసంగించారు. ఇదే సమ యంలో జమ్ముకాశ్మీర్‌లో తీవ్రవాదం వైపు ప్రభావితం (రాడికలైజేషన్‌) అవుతున్నారని ఒక 12 ఏళ్ల వయస్సున్న బాలుడిని ఉద్దేశించి అన్నారు. అటువంటి వారిని తీవ్రవాద నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఉంచాలని వ్యాఖ్యానించారు. రావత్‌ చేసిన వ్యాఖ్యలకు కొన్నిరోజుల తర్వాత జమ్ముకాశ్మీర్‌ డిజిపి కూడా వత్తాసు పలికారు. తీవ్రవాద నిరోధక క్యాంపుల ఏర్పాటు ఒక మంచి ఆలోచన అని చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో రావత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనుమానితుల పేరుతో చిన్నారులను నిర్బంధ క్యాంపుల్లో ఉంచడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. తీవ్రవాదులకు అనుకూలమన్న అనుమానంతో క్యాంపుల్లో ఉంచితే .. వారు నిజంగానే తీవ్రవాదులు మారే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది తీవ్రవాద శక్తులకు మనమే ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు.

ఈ ‘రాడికలైజేషన్‌’ అనేది కొత్త పదం కాదు. ఇటీవలి కాలంలో ఈ పదానికి బాగా ప్రాచుర్యం వచ్చింది. 2001లో అమెరికాలో జరిగిన దాడుల అనంతరం సుస్థిరాభివృద్ధి, సమగ్ర సమాజం, జాతీయవాద భావనలు ప్రజలను ఐక్యం చేస్తాయని భావించే పశ్చిమ దేశాలు తీవ్ర షాక్‌కు గురయ్యాయి. అదేవిధంగా ఆ తరువాత 2004లో మాడ్రిడ్‌లో, 2005లో లండన్‌లో, 2013లో బోస్టన్‌లో జరిగిన ఉగ్రదాడులు బయట వ్యక్తులు చేసిన పని కాదని, అక్కడ పెచ్చరిల్లిన ఉగ్రవాద శక్తులే కారణమని తేలింది. ఈ దాడులను పరిశీలించినప్పుడు తీవ్రమైన మత విశ్వాసాలతో కూడిన కొన్ని శక్తులు యువతను తప్పుదారి పట్టించడంతో వారు ఇటువంటి దాడులవైపు మళ్లారు. అనంతర కాలంలో ఈ రాడికలైజేషన్‌ అనేది ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది.

గత ఐదు సంవత్సరాలుగా భారత్‌లో కూడా ఈ పదంపై మాట్లాడుకోవడం అధికంగా కనిపిస్తోంది. కాశ్మీర్‌లో ఏ సమస్య తలెత్తినా దీనిపైనే వేలెత్తి చూపడం పరిపాటిగా మారింది. దీనికి తీవ్రవాద నిరోధక క్యాంపులు (డి-రాడికలైజేషన్‌) పరిష్కారం చూపుతాయని వాదనలను కొందరు ముందుకు తెచ్చారు. ఇదే సమయంలో ఈ విష యానికి సంబంధించి ఉన్న రెండు అపోహలను తొలగించా ల్సిన అవసరం ఉంది. ఒకటి ఈ రాడికలైజేషన్‌ను ఏఒక్క మతానికో పరిమతం చేయడంపై చర్చ జరగాలి. తీవ్రవాదం వైపునకు మరలేందుకు అనేక కారణాలు ఉంటా యని, ఒక్కటే కారణమని చెప్పడం అసాధ్యమని యూరోపియన్‌ కమిషన్‌కు చెందిన నిపుణుల కమిటీ పేర్కొంది. రాజకీయ పరమైన హింస, అధికారుల అణచి వేత చర్యలు, పరాయీకరణ, తమ పట్ల ప్రభుత్వాలు చూపు తున్న వివక్ష.. ఇలాంటి అంశాలతో కూడిన వాతావరణం తీవ్రవాదం వైపు మళ్ళేందుకు దోహదపడుతుందని తన నివేదికలో పేర్కొంది. మరొక అపోహ ఏమిటంటే ఈ రాడికలైజేషన్‌కు ఇంటర్నెట్‌ ప్రధాన కారణమనే వాదన. దీన్ని సాకుగా చూపి జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత దాదాపు ఐదు నెలల పాటు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేయడం వలన తీవ్రవాద రిక్రూట్‌మెంట్‌ తగ్గిందని అధికారులు కూడా చెప్పు కొచ్చారు. ఈ వాదన కూడా తప్పని 2016లో ఒక జర్మన్‌ అధ్యయనం పేర్కొంది. తీవ్రవాదం వైపు ప్రభావితం అయ్యేలా చేయడంతో ఇంటర్నెట్‌కు ఉన్న పాత్ర తక్కువేనని పేర్కొంది.

యువత సమస్యలను పరిష్కరించాలి
ఈ రాడికలైజేషన్‌ అనేది పూర్తిగా వ్యక్తిగత ప్రక్రియ. ఇలా అనుమానితుల పేరుతో ఒక మతానికి చెందిన యువకులను తీవ్రవాద నిరోధక క్యాంపుల్లో ఉంచడం వలన కేవలం మతపరమైన భయాలను పెంచుతుందని, సానుకూల ఫలితాలను సాధించేందుకు తక్కువ అవకాశాలు ఉన్నాయని మేధావులు పేర్కొంటున్నారు. ఇలా అనుమానం పేరుతో యువకులను వేధిస్తే భవిష్యత్తులో వారు నిజంగానే తీవ్రవాదం వైపునకు మరల్చే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో నిజంగానే అటువంటి భావాలున్న యువకులు ఉంటే వారిని క్యాంపుల్లో ఉంచడం కంటే వారిని చైతన్య పర్చడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఒక అధ్యయనం పేర్కొంది. యువతను ఉగ్రవాదం వైపునకు వెళ్లకుండా చేయడానికి సంబంధించిన ప్రక్రియలో తొలుత వారిని ప్రభావితం చేస్తున్న అంశాలను గుర్తించాలి. ఇదే సమయంలో పరాయీకరణ, వారికి జరుగుతున్న అన్యా యం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడంతో పాటుగా సుపరిపాలన అందించాలని భారత ఆర్మీకి చెందిన ఒక మాజీ అధికారి చెప్పారు.

Courtesy Prajashakthi