• మేడ్చల్‌ జల్లా నుంచి భూపాలపల్లికి
  • సర్కారుకు వ్యతిరేకంగా రెవెన్యూ
  • సంఘాలను కూడగడుతున్నందుకేనా?

హైదరాబాద్‌ : ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెవెన్యూ సంఘాలను కూడగడుతున్నారనే ఆరోపణతో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు

వేసింది. ఆయనకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ, పునరావాసం, పునర్‌ నిర్మాణం)గా పోస్టింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మల్కాజ్‌గిరి ఆర్డీవో ఎన్‌.మధుసూదన్‌కు బాధ్యతలు అప్పగించారు. లచ్చిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అండమాన్‌ నికోబార్‌ దీవుల పర్యటనలో ఉండగా ఈ బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. రెండేళ్లుగా లచ్చిరెడ్డి కీసర ఆర్డీవోగా పని చేస్తున్నారు. గతంలో ఆయనకు ప్రభుత్వానికి విధేయుడిగా పేరుంది. రెండేళ్ల కిందట సబ్‌ రిజిస్ట్రార్ల అధికారాలను తహసీల్దార్లకు కట్టబెట్టరాదని తహసీల్దార్లంతా కోరుతున్న సమయంలో లచ్చిరెడ్డి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ప్రకటన చేశారు. దాంతో, సీఎం కేసీఆర్‌ నేరుగా లచ్చిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి.. ఆయనకు కీసర ఆర్డీవోగా పోస్టింగు ఇచ్చారు.

మాజీ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి అల్లుడిపై బదిలీ వేటు వేసి.. మరీ ఆయనను నియమించారు. భూ రికార్డుల నవీకరణకు సంబంధించి సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ‘మీ భూమి-మీ పట్టా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ) ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ (ట్రెసా)లో విలీనం అవుతుండగా.. పూర్తిస్థాయిలో విలీనం కాకుండా అడ్డుకున్నారు. తహసీల్దార్ల సంఘం ఉండాల్సిందేనంటూ కొంతమందితో కలిసి ప్రత్యేకంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఏర్పాటు చేశారు. తాజాగా నిజామాబాద్‌ అర్బన్‌ తహసీల్దార్‌ జ్వాలా గిరిరావు ఆత్మహత్య నేపథ్యంలో రెవెన్యూ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సంతాప సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. దాంతో ఆయనను కీసర ఆర్డీవో పదవి నుంచి తప్పించి భూపాలపల్లికి బదిలీ చేసింది. అయితే, ఆ పోస్టులో చేరకూడదని లచ్చిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెవెన్యూ సంఘాలతో కలిసి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా.. రెవెన్యూ చట్టం రూపకల్పనపై కొద్ది రోజుల కిందట కలెక్టర్ల సదస్సు జరిగిన విషయం తెలిసిందే. అందులో సీఎం కేసీఆర్‌ అంతర్గతంగా చేసిన వ్యాఖ్యలను మంత్రి ఈటల రాజేందర్‌ కీసర ఆర్డీవో లచ్చిరెడ్డికి తెలిపారని, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగేలా ఆయన వ్యవహరించారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి కూడా. ఆయా కథనాలకు సంబంధించి మంత్రి ఈటల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ప్రభుత్వ తాజా ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Courtesy Andhra Jyothy..