– డీమానిటైజేషన్‌ జరిగి నేటికి మూడేండ్లు పూర్తి
– ఆర్థికంపై దుష్ప్రభావం చూపిదంటున్న ప్రజలు
– మందగమనానికి కారణమైందంటూ ఆవేదన
– తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దనోట్ల రద్దు చేపట్టి సరిగ్గా నేటికి (శుక్రవారానికి) మూడేండ్లు పూర్తికావొస్తోంది. దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు, ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళనకు తాము చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటున్నామంటూ టీవీల ముందుకు వచ్చి మరీ ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు(డీమానిటైజేషన్‌) నిర్ణయాన్ని ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్లు (దేశ ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న 86శాతం కరెన్సీ) 2016, నవంబర్‌ 8 నుంచి చెలామణిలో ఉండబోవని ఆ రోజు ప్రధాని మోడీ ప్రకటించారు. ఉగ్రవాదులకు అందే నిధులకు అడ్డుకట్టవేయడం, నల్లధనాన్ని గుర్తించడం, అవినీతికి అడ్డుకట్టవేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్రం వరుసగా ప్రకటనలను వెలువరించింది. అనాలోచితంగా కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆ మూడు లక్ష్యాలు నెరవేర్చలేదు సరికదా.. దేశంలోని సామాన్య ప్రజలను, ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మోడీ సర్కారు ఏకపక్ష నిర్ణయంతో దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. సర్కారు నిర్ణయంతో సకాలంలో చేతికి డబ్బులందక, బ్యాంకుల ముందు క్యూలైన్లలో అలసిపోయి దాదాపు 110 మంది ప్రాణాలు వదిలారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయానికి సంబంధించిన భయానక పరిస్థితుల నుంచి ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావాన్ని చూపిందన్న భావన దేశ ప్రజల్లో ఇంకా బలంగానే కనిపిస్తోందన్న విషయం ‘లోకల్‌ సర్కిల్స్‌’ అనే ఓ సంస్థ జరిపిన తాజా సర్వేలో మరోసారి వెల్లడైంది.

ఆర్థిక వ్యవస్థ, ఉపాధి పైనా తీవ్ర ప్రభావం
నోట్లరద్దుతో దేశ ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందనీ, ఉపాధి పైనా దీని ప్రభావం పడిందని సర్వేలో పాల్గొన్న 66శాతం మంది ప్రజలు తెలిపారు. ఇక డీమానిటైజేషన్‌ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ మందగించిందనీ, దీని నుంచి కేంద్రం బయటపడలేకపోతున్నదని సర్వేలో పాల్గొన్న 33 శాతం తెలిపారు. నోట్ల రద్దు ప్రకటనకు ముందు భారత ఆర్థిక వ్యవస్థ చక్కటి స్థితిలో ఉన్నదని వారు గుర్తు చేశారు. ఆ తర్వాతి రెండు త్రైమాసికాలకు ఆర్థికం నేల చూపులు చూసింది. భారత ఆర్థిక వ్యవస్థ పడిపోయేందుకు నోట్ల రద్దు నిర్ణయంతో పాటు మోడీ సర్కారు తీసుకున్న పలు అంశాలూ ఉన్నాయని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. పన్ను ఎగవేతదారులకు డీమానిటైజేషన్‌ ఒక ఔషదంలా పనిచేసిందని పెద్దనోట్ల రద్దుపై సానుకూలంగా స్పందించిన 42శాతం మంది తెలుపడం గమనార్హం.

అసంఘటిత రంగంపై..
అసంఘటిత రంగంపై డీమానిటైజేషన్‌ దుష్ప్రభావాన్ని చూపిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ఉద్యోగ, ఉపాధులు కోల్పోవడమే కాకుండా గ్రామాల్లో ప్రజలకు సంపాదన లేకుండాపోయిందని వారు తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికుల ఆర్జన తగ్గడానికి ప్రధాన కారణం పెద్దనోట్ల రద్దేనని సర్వేలో పాల్గొన్న 32శాతం మంది ఒప్పుకున్నారు.

Courtesy NavaTelangana..