మూడు శాతం మందగించిన ఆర్థిక కార్యకలాపాలు
హార్వార్డ్‌, ఐఎంఎఫ్‌ పరిశోధకుల అధ్యయనం
న్యూఢిల్లీ : మోడీ సర్కారు ఉన్నపళంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదుపునకు లోనైంది. చెలామణిలోని దాదాపు 86శాతం నగదును ఎలాంటి హెచ్చరికల్లేకుండానే కేంద్రం రాత్రికి రాత్రి రద్దు చేసింది. ఊహించని ఈ నిర్ణయంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు. నల్లదనం వెలికితీత, నకిలీ నోట్ల నివారణ, అవినీతిని అడ్డుకునేందకని ప్రకటిస్తూ.. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్థిక నిపుణులు పెదవి విరిచారు. ఇప్పటికీ ఈ చర్యను మోడీ సర్కారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. దాని విషఫలితాలు ప్రస్తుతం దేశ ప్రజానీకం అనుభవిస్తూనే ఉంది. ఆర్థిక మందగమనానికి బీజం ఈ చర్యలోనే పడ్డాయని ఇప్పటికే పలువురు నిపుణులు వివరించారు. తాజాగా, పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందని హార్వార్డ్‌ యూనివర్సిటీ, ఐఎంఎఫ్‌ పరిశోధకులు ఓ అధ్యయనంలో తేల్చారు. ఈ నిర్ణయంతో ఆర్థిక వృద్ధి మందగించిందనీ, తత్ఫలితంగా నోట్లరద్దు చేసిన త్రైమాసికంలో కొలువులు రెండు నుంచి మూడు శాతం మేరకు కుచించుకుపోయిందని వివరించింది. హార్వార్డ్‌ ప్రొఫెసర్‌ గ్యాబ్రియెల్‌ చోడోరో-రీచ్‌, ఐఎంఎఫ పరిశోధక విభాగం ఎకనామిక్‌ కౌన్సిలర్‌, డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌, గోల్డ్‌మన్‌ సాచ్స్‌ ఉద్యోగి ప్రాచీ మిశ్రా, ఆర్బీఐకు చెందిన అభినవ్‌ నారాయణన్‌లు దేశవ్యాప్తంగా జిల్లాలపై పడిన పెద్దనోట్ల రద్దు ప్రభావాన్ని అధ్యయనం చేశారు.
ఊడిన ఉద్యోగాలు
నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌, డిసెంబర్‌లలో ఆర్థిక కార్యకలాపాలు 2.2 శాతం మందగించాయని ఈ అధ్యయనం వివరించింది. రాత్రిపూట విరజిమ్మే వెలుగు జిలుగులతో ఆర్థిక వ్యవస్థను మదించే ప్రక్రియ ఆధారంగా ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగిత మూడు పాయింట్ల శాతం మేరకు పడిపోయిందని గణించింది. ఆ త్రైమాసిక వృద్ధి దాదాపు రెండు శాతానికి పైగానే క్షీణించిందని వివరించింది. ఈ నిర్ణయంతో ఉన్న ఉద్యోగాలు ఊడాయని పేర్కొంది. 2016 నాలుగో త్రైమాసికంలో రుణ పరపతీ రెండు శాతం మేరకు దిగజారిపోయిందని తెలిపింది. ఈ చర్యను ప్రకటించేవరకు సర్కారు, ఆర్బీఐ ఎంతో గోప్యంగా ఉంచాయనీ, కనీసం నోట్లను రద్దు చేయగానే వాటి స్థానంలో కొత్త నోట్లను భర్తీ చేసేందుకు వాటి ముద్రణ కూడా ప్రారంభించలేదని వివరించింది. దీంతో రాత్రికి రాత్రే రద్దయిన దాదాపు 75శాతం నగదును కొత్త నోట్లతో భర్తీ చేసేందుకు కొన్ని నెలలు పట్టిందని తెలిపింది.
ఉన్న డబ్బునంతా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన ప్రజలు.. వ్యాపారం, వ్యవసాయం, ఇతర వృత్తులు సహా కనీసం నిత్యావసరాలకూ తమ నగదును తిరిగిపొందలేక నానాతంటాలు పడ్డారని వివరించింది. ఈ చర్యతో బ్యాంకులపైనా భారం పడిందనీ, డిపాజిట్లపై ఆర్బీఐ ఎలాంటి వడ్డీ ఇవ్వకున్నా.. ఖాతాదారులకు బ్యాంకులు మిత్తి చెల్లించాల్సి వచ్చిందని పేర్కొంది. అధ్యయనంలో ముగింపులో.. ఇప్పటికీ భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల్లో నగదు ప్రధాన పాత్ర పోషిస్తున్నదని పరిశోధకులు వివరించారు.

Courtesy Nava telangana…