– ప్రభాత్‌ పట్నాయక్‌
అనువాదం: నెల్లూరు నరసింహారావు
ప్రభాత్‌ పట్నాయక్‌
ప్రభాత్‌ పట్నాయక్‌
2016వ సంవత్సరం నవంబరు నెలలో ప్రభుత్వం చేసిన రూ.500, 1000 నోట్ల రద్దుతో ఆకస్మికంగా పెద్ద ఎత్తున నగదు బ్యాంకుల భోషాణాలలోకి వచ్చిపడింది. బలవంతంగా ప్రజలచేత బ్యాంకులకు చేర్చిన ఈ నగదుపై బ్యాంకులు వడ్డీ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి బ్యాంకులు ఈ నగదుపై ఆదాయాన్ని సంపాదించాలి. లేకపోతే బ్యాంకుల లాభాలు క్షీణిస్తాయి. అలా విపరీతంగా వచ్చిపడిన నగదును బ్యాంకులు ఎలా ఉపయోగించాయి అనేది ఒక పాఠం అవుతుంది.
ఈ నగదును బ్యాంకులు బ్యాంకేతర ఫైనాన్షియల్‌ కంపెనీల ద్వారా రియల్‌ ఎస్టేట్‌, ఇతర రంగాలకు అప్పులు ఇవ్వటంతో ఆ రంగాలలో బూమ్‌(వ్యాపార విజృంభణ) నెలకొందని, ఈ బూమ్‌ పతనంతో ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం కనపడుతున్న మందగమనం ఏర్పడటమే కాకుండా దానితో బ్యాంకులు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్థక ఆస్తుల సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగావున్న అరవింద్‌ సుబ్రమణ్యం పేర్కొన్నాడు. అయితే ఈ అభిప్రాయానికి అనుకూలంగా చాలా తక్కువ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒకవేళ బ్యాంకులలోగల విస్తృతమైన నగదు డిపాజిట్లను బ్యాంకేతర ఫైనాన్స్‌ కంపెనీల ద్వారానైనా రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాలకు అప్పుగా ఇచ్చివుంటే ప్రజల నగదు-డిపాజిట్‌ నిష్పత్తిలో తాత్కాలిక క్షీణత ఉండివుండేదే.
దీనిని ఈవిధంగా వివరించవచ్చు. ప్రజలు తమవద్దనున్న రూ.100 విలువైన రద్దయిన నోట్లను బ్యాంకులకు స్వాధీనం చేసి కొత్త నోట్లు తీసుకోవటం కోసం బ్యాంకులకు వచ్చారనుకుందాం. అలా మార్చుకోవాలనుకున్న రూ.100రూపాయలలో కొత్త నోట్ల కొరత కారణంగా రూ.80లను బ్యాంకులలో డిపాజిట్‌ చేయవలసి వస్తుంది. బ్యాంకులకు చేరిన ఈ రూ.80 ఆధారంగానే బ్యాంకులు రియల్‌ ఎస్టేట్‌, ఇతర రంగాలకు అప్పులు ఇస్తాయి. కానీ ఒకవేళ కొన్ని నెలల్లో కొత్త నోట్లు అందుబాటులోకి రాగానే ఈ రూ.80లను నగదుగా మార్చితే, ఆ తరువాత ఈ వనరులు బ్యాంకుల నుంచి కనుమరుగయ్యేవే. అటువంటి పరిస్థితులలో బ్యాంకులు పెద్ద ఎత్తున అప్పులు ఇవ్వజాలని నోట్లరద్దుకు ముందరి స్థితికి చేరుకుంటాం. అంటే మనం మొదలుపెట్టిన దగ్గరకే వస్తాం.
కాబట్టి నోట్ల రద్దుతో బ్యాంకులకు చేరిన నగదును ప్రజలు కొత్త నోట్లలోకి మార్చుకోకుండా బ్యాంకులలో దీర్ఘకాలం ఉంచితేనే బ్యాంకులు తాము ఇచ్చే అప్పుల పరిమాణాన్ని పెంచగలుగుతాయి. వేరే మాటల్లో చెప్పాలంటే ప్రజల వద్దనుంచే నగదు-డిపాజిట్‌ నిష్పత్తి దీర్ఘ కాలంపాటు పెరిగితేనే బ్యాంకులకు పెద్ద ఎత్తున చేరిన నగదు బ్యాంకులకు బూమ్‌గా మారగలుగుతుంది.
అయితే అలా ఏమీ పెరగలేదు. ప్రజలు తమ వద్దనున్న రద్దయిన నోట్లను 99శాతం మార్చుకోవటంతో నోట్లరద్దుతో ‘నల్లధనం’ నాశనం అవుతుందనే ప్రభుత్వ ఊహ నిజం కాదని తేలిపోయింది. అంతేకాకుండా ప్రజలు అలా మార్చుకున్న నగదును బ్యాంకులలో డిపాజిట్లుగా ఉంచకుండా తమ వద్దనే ఉంచుకున్నారు. కొత్త నోట్ల ఆగమనంతో ప్రజల వద్దనున్న నగదు పరిమాణం కూడా పెరిగింది. నిజానికి నోట్లరద్దు తరువాత ఒక ఏడాది కాలంలో ప్రజల నగదు-డిపాజిట్ల నిష్పత్తి నోట్లరద్దు ముందటి స్థాయికి చేరుకుంది. నోట్లరద్దు తరువాత పరోక్షంగానైనా రియల్‌ ఎస్టేట్‌వంటి రంగాలకు పెద్ద ఎత్తున అప్పులు ఇచ్చారని, దానితో ఈ రంగాలలో బూమ్‌ ఉత్తేజితం అయిందనే కథనం వాస్తవంలో ఎక్కడా కనిపించటంలేదు.
నిజానికి బ్యాంకులనిండా నగదు పోగైన కాలంలో బ్యాంకులు తమవద్దకు చేరిన నగదును ‘రివర్స్‌ రిపో ఆపరేషన్స్‌’ ద్వారాగానీ లేక వడ్డీ లభించే ప్రభుత్వం సృష్టించి న బాండ్లలోగానీ ఉంచాయి. కానీ ఆ మొత్తాలను ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఎందుకంటే ఆ మొత్తాలను వ్యయం చేస్తే అది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన విత్తలోటు పరిమితిని దాటిపోయే ప్రమాదం ఉంటుంది. వాస్తవంలో బ్యాంకులకు అదనంగా చేరిన నగదుతో అప్పుల పరిమాణం కూడా పెరగలేదు. వాణిజ్య బ్యాంకులు 2016 మార్చి నుంచి 2017 మార్చి వరకు ఆహారేతర వస్తువులకు ఇచ్చిన అప్పులు 9.1శాతం నుంచి 8.4శాతానికి తగ్గాయి. ‘వ్యవసాయ, దాని అనుబంధ కార్యకలాపాలకు’ ఇచ్చిన అప్పు 15.3శాతం నుంచి 12.4శాతానికి పడిపోయింది. అలాగే ‘పరిశ్రమల’కు ఇచ్చిన అప్పు 2.7శాతం నుంచి -1.9శాతానికి పతనం అయింది. ‘ప్రాథమ్య రంగానికి’ ఇచ్చిన అప్పు కూడా మొత్తం మీద 10.7శాతం నుంచి 9.4శాతానికి తగ్గిపోయింది.
నోట్లరద్దు కారణంగా రైతుల చేతుల్లో తీవ్రమైన నగదు కొరత ఏర్పడింది. తాము వేయబోయే పంటలకు అవసరమైన పెట్టుబడులకు కావలసిన నగదు రైతులకు అంతకుముందు పండించిన పంటల ఉత్పత్తులను అమ్ముకున్నప్పుడు అందలేదు. తాము పండించబోయే పంటలకు కావలసిన పెట్టుబడులకోసం రైతులు ఎక్కువ శాతం వడ్డీలు గుంజే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వచ్చింది. దానితో పెరిగిన రుణభారం రైతుల నిసృహను పెంచింది. ఇది నోట్లరద్దు కారణంగా ఏర్పడిన తీవ్రమైన, స్థిరంగా కొనసాగుతున్న ప్రభావం. కొత్త నోట్ల ఆగమనంతో తగ్గని దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంది. రైతులకు అప్పు అవసరం తీవ్రంగా ఉన్నప్పుడు, వారు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నప్పుడు కూడా తమ భోషాణాలలో మూలుగుతున్న నగదును రైతులకు అప్పుగా ఇవ్వటానికి బ్యాంకులు ముందుకు రాలేదు. పర్యవసానంగా వాస్తవంలో వ్యవసాయానికి ఇచ్చే అప్పు వృద్ధి మందగించింది. అప్పు వృద్ధి మందగించటానికి కాల వ్యవధి కారణమనుకున్నా 2017 మార్చి తరువాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. వాస్తవంలో ‘వ్యవసాయం, దాని అనుబంధ కార్యకాలాపాల’కు ఇచ్చే అప్పు వృద్ధిరేటు ఆ తరువాత మరింతగా క్షీణించింది. 2016 జూన్‌, 2017 జూన్‌ మధ్యకాలంలో రైతులకు బ్యాంకులు ఇచ్చే అప్పు వృద్ధి రేటు 7.5శాతంగా ఉంది. ఇది 2016 మార్చి, 2017 మార్చి మధ్యకాలంలోని 12.4శాతం వృద్ధి రేటు కంటే కూడా తక్కువ. 2017 మార్చి, 2018 మార్చి మధ్యకాలంలో వ్యవసాయరంగానికి ఇచ్చిన అప్పు వృద్ధిరేటు నామమాత్రంగా 3.8శాతం ఉంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అసాధారణ స్థాయిలో వనరులు సమకూరినప్పుడే రైతాంగ వ్యవసాయానికి అత్యంత అధమ స్థాయిలో ఇచ్చిన అప్పు భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుకు అద్దంపడుతోంది.
నయా ఉదారవాద కాలంలో రైతాంగ వ్యవసాయానికి సంస్థాగత అప్పులను కుదించే ధోరణి ప్రబలి రైతాంగం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నూతన వడ్డీ వ్యాపారుల జాతి వలస పాలన నాటి వడ్డీ వ్యాపారులకు భిన్నమైనది. అయితే వడ్డీ గుంజటంలో వీరికీ, గతంలోని వారికి మధ్య తేడా ఏమీ లేదు.
రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని అందరికీ తెలుసు. అయినప్పటికీ బ్యాంకులలో మూలుగుతున్న నగదును రైతాంగ వ్యవసాయానికి అప్పుగా ఇవ్వమని ప్రభుత్వం ఎటువంటి సూచనా చేయలేదు. అంతేకాకుండా బ్యాంకులకు ప్రభుత్వ బాండ్లను ఇవ్వటం జరిగింది. ఈ బాండ్ల ద్వారా డబ్బు సమకూరినప్పటికీ ప్రభుత్వ వ్యయం పెరగలేదు. ఈ వనరులను నగదు కొరతను ఎదుర్కొంటున్న రైతులకు ఇవ్వకపోవటంవల్ల వారు అనివార్యంగా ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడవలసి వచ్చింది.
అలాఅని కొన్ని రంగాలకు అప్పు ఇవ్వమని ప్రభుత్వం బ్యాంకులపై వత్తిడి చేయలేదని కాదు. నిజానికి ఈ శాతాబ్దారంభంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి బ్యాంకులు పెద్ద ఎత్తున అప్పులు ఇవ్వటానికిగల కారణం ప్రభుత్వం వత్తిడి చేయటమే. అయితే రైతాంగ వ్యవసాయం ఎన్నడూ ఆవిధంగా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించలేదు.
ప్రభుత్వమే గనుక రైతాంగ వ్యవసాయంపై తన దృష్టిని సారించినట్టయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడేవి. నగదు కొరతను ఎదుర్కొంటున్న రైతాంగానికి సహాయకారిగా ఉండేది. ప్రత్యేక బాండ్లను ఫ్లోట్‌ చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులు లాభాల బాటపట్టేవే. అయితే ప్రభుత్వం ఈ ఆలోచనను ఎన్నడూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇలా చేయటం నయావుదారవాద రాజ్యంలోని ప్రభుత్వ లక్షణం

(Courtesy Nava Telangana)