దుష్యంత్‌ దవే

స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు సార్వభౌమత్వానికి సంబంధించిన ఒక నూతన ఆలోచనకు ఆధీనమౌతున్నాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం జరిగిన పోరాటంలో అంతిమ దశగా ‘రాజ్యాంగ పరిషత్‌’ ఏర్పడింది. స్వాతంత్య్ర పోరాటంలో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు వివిధ రూపాలలో మహత్తరమైన త్యాగాలు చేశారు. 1950 సంవత్సరం జనవరి 26న భారత దేశంలో నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ గ్రంథాన్ని అందించిన మన పూర్వీకుల పట్ల దేశంలోని ప్రతి తరం సర్వదా కృతజ్ఞతతో ఉండాలి. రాజ్యాంగ విలువలను, నైతికతను రక్షిస్తూ మనం దాని స్ఫూర్తి నిలబెట్టాలి.
అయితే రాజ్యాంగం ఎలా నాశనమవుతున్నదో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, కార్య నిర్వాహక వర్గం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. వేగంగా మారుతున్న కాలంలో విషయాలు పెడతోవ పడుతున్నాయి. రాజ్యాంగ నీతితోను, మౌలిక మానవ విలువలతోను ఘర్షణ పడుతున్న ఒక భావ జాలంతో ప్రజలు కదులుతున్నారు. కదిలింపబడుతున్నారు. తత్ఫలి తంగా ప్రజలతో నడిచే ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోతున్నారు. అందుకు బదులుగా ప్రజల కోసం ఉన్న ప్రభుత్వానికి మద్దతు పలుకు తున్నారు. ఇది ప్రజల ప్రభుత్వమా, ప్రజలతో నడిచే ప్రభుత్వమా అనే విషయాలను వారు పట్టించు కోవటం లేదు. ‘ప్రజలతో నడిచే ప్రభుత్వాన్ని కాకుండా ప్రజల కోసం నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకునేలా చేసి మన మార్గానికి అడ్డంకిగా నిలిచే దుష్ట శక్తులను మనం గుర్తించటంలో బద్దకించ వద్దు’ అని డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు. అయితే మనం ఆ హెచ్చరికను గమనంలోకి తీసుకున్నామా?

కనపడని చర్చ
సార్వభౌమాధికారానికి చెందిన ఒక నూతన ఆలోచనకు నేడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆధీనమవుతున్నాయి. వీర జాతీయవాద పద ఘట్టనలో ముఖ్యంగా ‘అణగారిన’, ‘మైనారిటీ’ వర్గాల మౌలిక మానవ హక్కులు, పౌరుల గౌరవ మర్యాదలు నలిగిపోతున్నాయి. రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలనే విషయాన్ని మర్చి పోతున్నారు. దానితో చట్టపరమైన, న్యాయ సంబంధిత, కార్యనిర్వాహక అధికారాలను ప్రజాస్వామిక నియమాలు నియంత్రించలేక పోతున్నాయి. ఈ మౌలిక నియమానికి ప్రతి విభాగము ఇస్తున్న గౌరవం నామమాత్రంగానే ఉంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలుగా మన నిత్యజీవితంలో కనపడుతూనే ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన భావజాలానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం తన ఎజెండాగా మార్చుకుని దృష్టి కేంద్రీకరించటంపై చర్చ జరగాలి. అధికారంలో వున్న ఒక రాజకీయ పార్టీ తన విధానాల అమలుకు ప్రయత్నం చేస్తుంది. అయితే అసలు విషయాలను విస్మరిస్తూ అదే పనిలో వుంటే అది సవాలుగా మారుతుంది.
ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా మార్చటం, 370వ ఆర్టికల్‌ను రద్దు చేయటం వంటి చర్యలతో డబ్బా వాయించుకోవటంతో పాలక పార్టీ సంతృప్తి పడలేదు. పేదరికం, ఆర్థిక మాంద్యం, విద్వేషంతో చేస్తున్న హత్యలు, జనాభా పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలపై చర్చ జరగాల్సినంత జరుగుతున్నదా? ఈ సమస్యలపై యుద్ధాన్ని ఎందుకు ప్రకటించటం లేదు? 370వ ప్రకరణాన్ని రద్దు చేయటమనే ప్రభుత్వ వ్యూహం సమాఖ్య వ్యవస్థకు ఒక పెను సవాలుగా మారింది. జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రాన్ని చీల్చటం అన్నింటి కంటే ఖండించవలసిన చర్య. మెజారిటీ వున్న ప్రభుత్వం తనకు తోచిన విధంగా రాష్ట్రాలను చీల్చటానికి ఇది మార్గాన్ని సుగమం చేయదా?

వెనకడుగు వేయటం
పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించేది న్యాయ వ్యవస్థ. ముఖ్యంగా సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ చట్టం లేకపోవటం వల్ల సమస్య రాలేదు. చట్టం అమలు కాకపోవటమే ఇక్కడ సమస్య. జమ్ము-కాశ్మీర్‌ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి సుప్రీంకోర్టు ప్రయత్నించక పోవటం దాని బాధ్యతా రాహిత్యాన్ని చాటుతోంది. కార్యనిర్వాహక వర్గ చర్యలను న్యాయ సమీక్షకు లోబడి వుంచడం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమేనని న్యాయ వ్యవస్థే పేర్కొంది. ‘రాజ్యాంగ విధి విధానంలో న్యాయ సమీక్షకు అతీతమైన చర్యలేమీ ఉండవ’ని ప్రకటించింది. అనేక తీర్పులను చూసినట్టయితే ప్రభుత్వ అధికారాల న్యాయబద్ధతను గురించి విచారించవలసిన బాధ్యత సుప్రీం కోర్టుకు ఉంది.
‘ప్రాణ రక్షణ, వ్యక్తి స్వేచ్ఛ’లను పరిరక్షించే రాజ్యాంగం లోని 21వ ప్రకరణాన్ని న్యాయ వ్యవస్థ మరింతగా బలోపేతం చేసింది. కానీ జమ్ము-కాశ్మీర్‌లో గత 15 రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ‘చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం’ కాకుండా జమ్ము-కాశ్మీర్‌ ప్రజల పౌర హక్కులకు భంగకరంగా ఉన్నాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, 1973 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 144వ సెక్షన్‌ విధించటం ఏమాత్రం సమర్థనీయం కాదు. అయినా అత్యున్నత న్యాయస్థానం వహించిన మౌనం ఎందుకు అంత భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది? దీనికి గల కారణం తెలుసుకోలేనిదేమీ కాదు. న్యాయ వ్యవస్థ, రాజకీయ, కార్యనిర్వాహక వర్గాలకు చెందిన నాయకుల మధ్య దూరం తరిగి పోవటమే దీనికి కారణం. వీరి మధ్య ఉండకూడనంత సాన్నిహిత్యం ఎందుకు ఉంది?

‘రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు. అయితే దానిని అమలు చేయవలసిన వాళ్లు చెడ్డ వాళ్ళైతే అది కూడా చెడ్డదానిగా మారుతుందని నాకనిపిస్తుంది’. ‘నూతనంగా ఆవిర్భవించిన ఈ ప్రజాస్వామ్యం తన రూపాన్ని నిలబెట్టుకోవటం సాధ్యపడొచ్చేమో గానీ సారంలో అది నియంతృత్వంగా మారవచ్చు. ఏ పార్టీ అయినా ఏకపక్షంగా అత్యధిక స్థానాలు గెలిస్తే రెండవ సాధ్యత వాస్తవ రూపం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని అంబేద్కర్‌ గట్టిగా హెచ్చరించారు. అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించ వలసిన వ్యక్తుల మెదళ్ళలో ఈ విషయం ఇంకినట్టు అనిపించటం లేదు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఫలితం అంబేద్కర్‌ జోస్యాన్ని నిజం చేసింది. వాస్తవంలో రాజ్యాంగాన్ని పరిరక్షించ వలసిన వారు దీన్ని పట్టించుకోకపోవటం విషాదం. ప్రభుత్వాన్ని తనకు తోచిన విధంగా చేయనివ్వటం లోనే వారు సంతృప్తి చెందుతున్నారు. జనాకర్షణవాదం ముందు ప్రజాస్వామ్యం నిశ్చింతగా ఓడిపోతూనే ఉంది.

 ( వ్యాసకర్త సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది, ‘ది హిందూసౌజన్యంతో )

(Courtacy Prajashakti)