– అడ్డదారిలో అధికారం
– అనైతిక ఎత్తుగడలతో గద్దెనెక్కిన బీజేపీ
– ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కమలనాథులు
– ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ రహస్య ప్రమాణస్వీకారం
– ఎన్‌సీపీ నేత అజిత్‌పవార్‌ మద్దతు..డిప్యూటీ సీఎంగా ప్రమాణం
– వేకువజామున రాష్ట్రపతి పాలన ఎత్తివేత
– వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపిన మోడీ-అమిత్‌ షా ద్వయం
– విస్మయానికి గురిచేసిన మహా రాజకీయాలు
– సుప్రీంకోర్టుకు శివసేన, కాంగ్రెస్‌, ఎన్‌సీపీ కూటమి
– నేడే పిటిషన్‌ విచారణ

ముంబయి: శనివారం వేకువజామున జరిగిన కుట్రతో మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. తగినంత సంఖ్యాబలం లేకున్నా ఫడ్నవీస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శనివారం తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌సీపీ ఫిరాయింపు నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ అడ్డదారులు తొక్కింది. అధికార దాహంతో ఆ పార్టీ మరోసారి తన రాజకీయ అనైతికను ప్రదర్శించింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. దిగజారుడు రాజకీయాల్లో కొత్త రికార్డును సృష్టించింది. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ బలపరిచిన శివసేన నేత ఉద్దవ్‌థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ నేతలు రాత్రికి రాత్రే కుట్ర పన్నడంతో సీన్‌రివర్స్‌ అయింది. మహారాష్ట్ర గవర్నరు భగత్‌సింగ్‌ కొశ్యారి బీజేపీకి కొమ్ముకాయడం, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దానికి తలూపడంతో ప్రధాని మోడీ, అమిత్‌షా అండ్‌ కో కుట్ర ఫలించింది. ఈ నెల 30లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని బీజేపీకి గవర్నర్‌ వారం రోజుల సమయం ఇచ్చారు. వేకువజాము కుట్రపై శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌పార్టీలు ఉమ్మడిగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశాయి. ఫడ్నవీస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నరు వారం రోజులు గడువు ఇవ్వడం ద్వారా ఎమ్మె ల్యేల కొనుగోలుకు తెర తీసినట్టు అవుతుందని విమర్శిం చాయి. గవర్నరు చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహిం చాయి. 144 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు తమకుం దని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరాయి. పిటిషన్‌పై ఆదివారమే విచారణ చేపట్టాలని కోరగా, దానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉదయం 11.30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకవేళ ఆదివారమే బలపరీక్ష జరిపితే మహారాష్ట్ర రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారానికి అనువుగా.. ముందుగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు శనివారం ఉదయం 5.47 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరుకుమార్‌ బల్లా ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం దాదాపు 7.30 గంటల సమయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగిపోయింది.

సంఖ్యాబలం
ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోనూ భారీ సంఖ్యలో వలసలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎన్సీపీలో వచ్చే భారీ చీలికే ఫడ్నవీస్‌ సర్కార్‌ భవితవ్యాన్ని తేల్చనుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44, ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందారు. బలనిరూపణ (మ్యాజిక్‌ ఫిగర్‌ 145) సందర్భంగా వీరిలో ఎవరు ఎటువైపు నిలబడతారన్నది తెలియాల్సి ఉంది.

సంచలనం రేపిన పరిణామాలు…
ఉద్ధవ్‌ థాక్రే సీఎంగా, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని శుక్రవారం సాయంత్రం శరద్‌ పవార్‌ ప్రకటించటం తెలిసిందే. ఉద్ధవ్‌ థాక్రే మహారాష్ట్రకు కాబోయే సీఎంగా దేశవ్యాప్తంగా అన్ని వార్తా పత్రికల్లోనూ వచ్చింది. దీనికి పూర్తి విరుద్ధంగా శనివారం తెల్లవారుజామున పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి షాక్‌కు గురయ్యాయి. మూడు రోజుల క్రితం ప్రధాని మోడీ-శరద్‌ పవార్‌ల మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఏదో జరగబోతుందన్న అనుమానాలు నిజమయ్యాయి.

ఎన్సీపీ ఏనాటికీ బీజేపీతో చేతులు కలపదు..:ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌
మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో, ఎన్సీపీ, శివసేన సంయుక్త విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశాయి. ఈ సందర్భంగా తొలుత శరద్‌ పవార్‌ మాట్లాడుతూ…”శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని భావించాం. 170 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉంది. కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలూ మద్దతు తెలిపారు. అజిత్‌ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయం. ఆయన పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. ఆయన నిర్ణయంతో ఎన్సీపీలో ఎవరూ సంతోషంగా లేరు. పార్టీ ఫిరాయిస్తే శాసనసభ సభ్యత్వం కూడా కోల్పోతారని ఆయనతో వెళ్లినవాళ్లు గుర్తుంచుకోవాలి. అజిత్‌తోపాటు కలిసివెళ్లినవారు 8 లేదా 9మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నిజమైన ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు ఎప్పుడూ బీజేపీతో చేతులు కలపరు. ఫడ్నవీస్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్న విషయం శనివారం ఉదయం 6.30 గంటలకు తెలిసింది” అని వెల్లడించారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం అసెంబ్లీ బలపరీక్షలో నిలబడలేదన్నారు. సంతలో వస్తువులా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారనీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రపై బీజేపీ చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ : ఉద్ధవ్‌ థాక్రే
ఎన్సీపీ పార్టీని చీల్చి, అజిత్‌ పవార్‌తో కలిసి మహా రాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయడంపై శివసేన అధి నేత ఉద్ధవ్‌ థాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహా రాష్ట్రలో బీజేపీ చర్యను ఓ సర్జికల్‌ స్ట్రైక్‌గా అభివర్ణించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ప్రజాతీర్పును అవమానించారంటూ తమపై బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారనీ, ఇప్పుడు బీజేపీ చేసిన పనేంటిదనీ ప్రశ్నించారు.

అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారు : సంజయ్ రౌత్‌
మహారాష్ట్రలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలపై శివసేన స్పందించింది. ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్ రౌత్‌ మాట్లాడుతూ…”ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారు. దీంట్లో శరద్‌ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదు. శుక్రవ్రారం రాత్రి 9గంటల వరకు ఆ మహాశయుడు (అజిత్‌ పవార్‌) మాతోనే ఉన్నారు. అనుకోకుండా మాయమైపోయారు. అనంతరం కండ్లల్లో కళ్లుపెట్టి చూడడానికి కూడా ఇష్టపడలేదు. తప్పుచేసిన వాళ్లు ఎలా తలదించుకొని మాట్లాడుతారో అలాగే మాట్లాడారు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. అజిత్‌ పవార్‌, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఛత్రపతి శివాజీ సిద్ధాంతాల్ని అవమానించారు” అని వ్యాఖ్యానించారు.
అజిత్‌ పవార్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని సంజరు రౌత్‌ ఆరోపించారు. ఈ కుట్రలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వారి పేర్లు త్వరలోనే శివసేన అధికార పత్రిక సామ్నా వేదికగా బయటపెడతామని అన్నారు. తాము ఎన్సీపీ నేత ధనుంజయ ముండేతో సంప్రదింపులు చేస్తున్నామనీ, అజిత్‌ వెళ్లి వెనుకడుగు వేసే అవకాశముందనీ అన్నారు. అజిత్‌ వెంట వెళ్లిన 8మంది ఎమ్మెల్యేల్లో ఐదుమంది వెనుదిరిగారు. వారిని కారులో ఉంచి కిడ్నాప్‌నకు పాల్పడ్డారని సంజరు రౌత్‌ ఆరోపించారు.

అజిత్‌ పవార్‌ రమ్మంటే వెళ్లాం…
మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రా మా చోటుచేసుకుంది. ముంబయిలో జరుగుతున్న పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. అజిత్‌ పవార్‌వైపు వెళ్లిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు (సందీప్‌ క్షీరసాగర్‌, సునిల్‌ భూసారా, రాజేంద్ర సింఘానే) తిరిగి ఎన్సీపీ గూటికే చేరారు. అజిత్‌ పవార్‌ తమకు ఫోన్‌ చేసి రాజ్‌భవన్‌కు రమ్మంటే వెళ్లామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ వారు అంటున్నారు. అజిత్‌ పవార్‌ ఫోన్‌ చేసి తనను రమ్మన్నారనీ, రాజ్‌భవన్‌ వద్ద ఏం జరుగుతుందో అర్థం చేసుకొనే లోపే ప్రమాణ స్వీకారం పూర్తయిపోయిందనీ రాజేంద్ర సింఘానే మీడియాకు తెలిపారు. ఆ తర్వాత శరద్‌ పవార్‌ వద్దకు వచ్చామన్నారు. శరద్‌ పవార్‌తోనే ఉంటామని వారు చెబుతున్నారు.

గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహరించారు…: సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌
ముంబయి : మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరాయి. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వ్యవహరించిన తీరు ఏకపక్షంగా ఉందని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ సంయుక్తంగా సుప్రీంలో రిట్‌ పిటిషన్‌ దాఖలుచేశాయి. గవర్నర్‌ వ్యవహరించిన తీరును పిటిషన్‌లో తీవ్రంగా తప్పుబట్టారు. సీఎంగా ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణ స్వీకారం చేయడంలో గవర్నర్‌ పక్షపాత ధోరణిలో వెళ్లారని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవీస్‌ను ఆహ్వానించడాన్ని పిటిషన్‌లో సవాల్‌ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమికి అవకాశం కల్పించాలని పిటిషన్‌లో కోరారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తీరు కూడా వివాదాస్పదమైంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపకుండా, కేవలం ప్రధాని ఆదేశాలతో రాష్ట్రపతి పాలన ఎత్తేయడం రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించటమేనని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు.

Courtesy Navatelangana…