కర్నాటక ఐఏఎస్‌ అధికారి ఎస్‌.శశికాంత్‌ సెంథిల్‌
ఉద్యోగంలో కొనసాగలేనంటూ రాజీనామా

బెంగళూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కలత చెందిన మరో ఐఏఎస్‌ అధికారి తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. భారత ప్రజాస్వామ్య పునాదులు ఎన్నడూ లేనంత తీవ్రంగా దెబ్బతిన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్‌ సర్వీసు నుంచి తప్పుకోవడమే మంచిదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. వివరాల్లోకెళ్తే.. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.శశికాంత్‌ సెంథిల్‌ 2009లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. తాజాగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

దీనిపై స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య ప్రాథమిక పునాదులు అసాధారణ రీతిలో దెబ్బతిన్న వేళ ఓ ఐఏఎస్‌ అధికారిగా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికమని భావిస్తున్నాను. నా రాజీనామాతో ఏ వ్యక్తికీ ఎలాంటి సంబంధమూ లేదు. రాబోయే రోజుల్లో మన దేశ సమాజంలోని మౌలిక స్వరూపానికి తీవ్రమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయని నాకు అనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్‌ అధికారిగా కంటే బయట ఉండటమే మంచిదనీ, అప్పుడే నా పనులను స్వేచ్ఛగా చేసుకోగలనని భావిస్తున్నా. ఇక నేను ఎంతమాత్రం సర్వీసులో కొనసాగలేను. విధుల నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నందుకు ప్రజలు నన్ను క్షమించాలి’ అని వ్యాఖ్యానించారు.

గతనెల దాద్రనగర్‌ హవేలీలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారి కణ్ణన్‌ గోపీనాథ్‌.. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే ఈ ఏడాది జనవరిలో జమ్మూకాశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న అప్రజాస్వామ్య చర్యలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి షాఫైజల్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

(Courtacy Nava Telangana)