60 మందికి పైగా బాధితులకు రక్షణ
ద్విచక్ర వాహనాలపై సురక్షిత ప్రాంతాలకు తరలింపు

న్యూఢిల్లీ : తీవ్ర హింసాత్మక అల్లర్లతో అట్టుడికిపోయిన ఈశాన్య ఢిల్లీలో తండ్రీ, కొడుకులు తమ ధైర్యాన్ని ప్రదర్శించారు. హిందూత్వ మూకలు, బీజేపీ కార్యకర్తల దాడులతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులను అల్లరి మూకల నుంచి వారు రక్షించారు. తమ వద్ద ఉన్న ద్విచక్రవాహనాల సహాయంతోనే బాధితులను ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరంలిచారు. ఇలా దాదాపు 60 మందికి పైగా బాధితులను వారు కాపాడారు. ఆ తండ్రీ, కొడుకులే గోకుల్‌పురీకి చెందిన మోహిందర్‌ సింగ్‌(53), ఆయన కొడుకు ఇందర్‌జీత్‌(28). ఈశాన్య ఢిల్లీలో అల్లర్లతో ప్రభావితమై ప్రాంతాల్లో గోకుల్‌పురీ ఒకటి. అల్లర్లు జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే మోహిందర్‌ షాపు ఉంది. ఆ సమయంలో కాషాయ మూక ప్రత్యేకించి ఒక వర్గంపై దాడికి దిగింది. అది గమనించిన మోహిందర్‌, ఇందర్‌జీత్‌లు ఆ మూక నుంచి బాధితులను రక్షించారు. తమ వద్ద ఉన్న రెండు ద్విచక్రవాహనాలను బయటకు తీశారు. కర్దంపురీలో చిక్కుకున్న దాదాపు 60 మందికి పైగా బాధితులను వారు రక్షించారు. ”1984 అల్లర్ల సమయంలో నన్ను 16 మంది చుట్టుముట్టిన భయంకరమైన జ్ఞాపకాలు ఇప్పటికే అలాగే ఉన్నాయి.

మనుషుల ప్రాణం విలువను ఈ సంఘటన నాకు గుర్తు చేసింది” అని మోహిందర్‌ తెలిపారు. మతాలకతీతంగా బాధితులను రక్షించాం. కేవలం తోటి మానవులను రక్షించాలని మాత్రమే అనుకున్నాం” అని ఆయన చెప్పారు. ” బాధితులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న క్రమంలో నేను ఏ మాత్రమూ భయపడలేదు. ఆపదలో ఉన్న ఏ మనిషినైనా కాపాడాలన్నదే ఆ సమయంలో ఆలోచించాను” అని ఇందర్‌జీత్‌ గుర్తుకు చేశారు. ”అల్లర్ల సమయంలో మా షాపు, ఇంటిపై దాదాపు వెయ్యి మంది దాడికి దిగారు. వారి చేతిలో కత్తులు కూడా ఉన్నాయి. మా ఇంటిలో నగదు, ఆభరణాలను వారు లూటీ చేశారు. ఆ సమయంలో అక్కడ చిక్కుకున్న మమ్మల్ని మోహిందర్‌ తన స్కూటీపై ఎక్కించుకొని భద్రమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు” అని ఆరోజు ఘటనను నయీమ్‌ అనే వ్యక్తి గుర్తు చేసుకున్నారు.

Courtesy Nava Telangana