– పోలీసుల పహారాలో ఢిల్లీ.. ఎటు చూసినా భీతావహ దృశ్యాలే..!
– 38కి చేరిన మృతుల సంఖ్య
– గాయపడిన వారు 200 మందికి పైగానే
– కొనసాగుతున్న బీజేపీ నాయకుల వివాదాస్పద ప్రసంగాలు
– హింసాత్మక ఘటనలపై 48 ఎఫ్‌ఐఆర్‌లు.. 106 మంది అరెస్టు
– దర్యాప్తు కోసం రెండు సిట్‌ బృందాలు ఏర్పాటు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో ఎటు చూసినా భీతావహ దృశ్యాలే కనబడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై కాషాయమూకలు రాళ్లు రువ్వడం, కాల్పుల ఘటనలు, పోలీసుల లాఠీచార్జి, భాష్పవాయు గోళాల ప్రయోగంతో రణరంగమైన ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. గురువారం పలు ప్రాంతాల్లో పోలీసుల తుపాకులతో గస్తీ కాశారు. ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలు వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ముస్తాఫాబాద్‌లో ధ్వంసమైన దుకాణాలు, ఇండ్లు కనిపించాయి. రాళ్లు, కర్రలు, ఇటుకల, రేకులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనేక ఇండ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. బృజ్‌పురీ, మస్తాఫాబాద్‌లలోని కొన్ని పాఠశాలల్లో కాలిపోయిన బల్లలు, పుస్తకాలు, బెంచీలు, కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆందోళనకారులు జరిపిన ఘటనలో పేరుకుపోయిన రాళ్లు, ఇటుకలు, శిధిలాలను ట్రాక్టర్లలో నింపుతున్న చిత్రాలు కనిపించాయి. మరోపక్క, బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే కొనసాగుతున్నాయి. ఇటు దిల్షద్‌ గార్డెన్‌లోని జీటీబీ ఆస్పత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో మృతులు, క్షతగాత్రుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి. అల్లర్ల మృతుల సంఖ్య పెరిగిపోతున్నది. గురువారం మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య 38కు చేరింది. బుధవారం మృతుల సంఖ్య 27గా నమోదు కాగా.. అందులో దిల్షద్‌ గార్డెన్‌లోని జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించిన వారి సంఖ్య 25గా ఉన్న విషయం తెలిసిందే. ”జీటీబీ ఆస్పత్రిలో మరో ఐదు మరణాలు చోటుచేసుకున్నాయి. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో ఒకరు, జగ్‌ ప్రవేశ్‌ చంద్ర ఆస్పత్రిలో మరొకరు చనిపోయారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 38కు చేరింది” అని ఢిల్లీ ఆరోగ్య విభాగానికి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. కాగా, గత ఆదివారం నుంచి ఈశాన్యఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారి సంఖ్య 200 మందికి పైగానే ఉన్నది. వీరందరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటు అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 48 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే 106 మందిని అరెస్టు చేశారు.

అల్లర్ల దర్యాప్తు క్రైం బ్రాంచ్‌కు బదిలీ
అల్లర్లపై దర్యాప్తు బాధ్యతను ఢిల్లీ పోలీసులు క్రైం బ్రాంచ్‌కు తరలించారు. ఇందుకోసం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్‌)ను ఏర్పాటు చేసినట్టు అధికారులు గురువారం తెలిపారు. ఈ బృందాలకు డీసీపీలు జారు టిర్కే, రాజేశ్‌ డియోలు నేతృత్వం వహిస్తారు. ఈ రెండు బృందాల్లో నలుగురు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ర్యాంకు అధికారులు ఉంటారు. పోలీసు అదనపు కమిషనర్‌ బి.కె సింగ్‌.. దర్యాప్తును పర్యవేక్షిస్తారు. కాగా, హింసాత్మక ఘటనలపై పోలీసులు ఇప్పటి వరకూ 48 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు.

కేంద్రం వైఫల్యం: శిరోమణి ఎంపీ గుజ్రాల్‌ ఆగ్రహం
ఢిల్లీ అల్లర్లలో పోలీసుల ఉదాసీనత 1984 సిక్కుల ఊచకోత ఘటనను గుర్తుకు తెచ్చిందని శిరోమణి అకాళీదళ్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యులు నరేశ్‌ గుజ్రాల్‌ ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌, ఎల్జీ అనిల్‌ బైజాల్‌, కేంద్ర హౌం మంత్రి అమిత్‌షాలకు ఫిర్యాదు చేస్తూ లేఖను రాశారు. అల్లర్ల సమయంలో ఘోంద్‌ చౌక్‌ వద్ద చిక్కుకున్న 15 మందిని రక్షించాలంటూ నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ, బాధితులకు పోలీసులు ఎలాంటి సహాయాన్నీ అందించలేదు. కాబట్టి ఢిల్లీ అల్లర్లలో ఆశ్చర్యం ఏమీలేదు” అని ఆయన అన్నారు. 1984 లాంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కానివ్వకూడదని అన్నారు. దేశరాజధానిలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు.

పరీక్షలను తిరిగి నిర్వహిస్తాం : సీబీఎస్‌ఈ
ఈశాన్యఢిల్లీలో చెలరేగిన అల్లర్ల కారణంగా పరీక్షలకు హాజరుకాలేక పోయిన విద్యార్థులకు తిరిగి పరీక్షలను నిర్వహిస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గురువారం ప్రకటించింది. సీఏఏ అల్లర్ల నేపథ్యంలో గత రెండ్రోజులుగా ఈశాన్య, తూర్పు ఢిల్లీలో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అల్లర్ల ప్రభావిత ప్రాంతాల్లోని 80 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరగాల్సిన 12వ తరగతి ఇంగ్లీష్‌ పరీక్షను బోర్డు వాయిదా వేసింది. అలాగే ఈశాన్యఢిల్లీలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగబోయే 10,12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అల్లర్ల కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు కూడా తిరిగి పరీక్షలు నిర్వహిస్తామనీ, వారికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రాంతీయ కార్యాలయానికి పంపాలని పాఠశాలలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు ఈ ప్రకటనను చేసినట్టు తెలుస్తున్నది. విద్యార్థులకు 10 రోజుల ముందే షెడ్యూల్‌ను తెలియజేయాల్సిన అవసరం ఉందనీ, ముఖ్యంగా 12 వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇతర ప్రత్యామ్నాయాలను చూడాలని కోర్టు బోర్డును సూచించింది.

Courtesy Nava Telangana