రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

చట్టాల పక్షపాతానికి, అవి తమను బలిపశువులను చేయడం పట్ల రగులుతోన్న ఆగ్రహావేశాలకు మధ్య చిక్కుకున్నషహీన్ బాగ్ మహిళల భావావేశ వ్యాఖ్యలు అమితంగా భయపెడుతున్నాయి. సమాజంలోని వివిధ మత వర్గాల వారి మధ్య అత్యంత సున్నితమైన సంబంధాల ఉపరితలం కింద ఒక మహోద్రిక్త పరిస్థితి నెలకొనివున్నది. ఏమాత్రం అలక్ష్యం చేసినా అది ఏ క్షణంలోనైనా ఒక అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయం. ఇప్పటికే సామాజిక సామరస్యత బలహీనపడిన నేపథ్యంలో సిఏఏ, – ఎన్‌ఆర్‌సిపై చర్చ అటువంటి విషమ పరిస్థితికి దారితీసే అవకాశం ఎంతైనా వున్నది. ఈ భయానక భవిష్యత్తే షహీన్ బాగ్ మహిళలను వీధుల్లోకి తీసుకువచ్చి అవిరామ ఆందోళనకు పురిగొల్పింది.

బస్తీ బతుకుల్లో ఆందోళన లేకుండా ఎలా వుంటుంది? అయితే న్యూ ఢిల్లీలోని షహీన్ బాగ్ ప్రాంత మహిళలు ప్రస్తుతం అవిరామంగా నిర్వహిస్తున్న ఆందోళన భిన్నమైనది. మన గణతంత్ర రాజ్యపు విలువల భవిష్యత్తును కాపాడుకోవడానికి చేస్తున్న ఆందోళన అది. ఒక దుశ్శాసనంపై ధర్మాగ్రహమది. షహీన్ బాగ్ బస్తీ ‘స్వచ్ఛ భారత్’కు ప్రతిబింబమేమీ కాదు. మోరీ(మురుగుకాలవ)లు సదా ‘వరద’ పోటుతో వుంటాయి. కరెంట్ తీగలు ఎక్కడ చూసినా ప్రమాదకరంగా వేలాడుతుంటాయి. సంక్షేపించి చెప్పాలంటే షహీన్ బాగ్ ఒక మురికి నెలవు. మామూలు రోజుల్లో అయితే న్యూఢిల్లీ నగర పటంలో ఎవరి చూపుకూ నోచుకోని బస్తీ అది. అయితే ఇవి సాధారణ దినాలా? ఈ ప్రశ్న ఎందుకంటే మన పాలకులు పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చారు కదా.

దేశ రాజధానిలో ఆ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శనలకు కేంద్రంగా ఉన్న యమునా నదీ తీరస్థ జామియా నగర్ చుట్టూ వున్న జనసమ్మర్ద ప్రాంతాలలో షహీన్ బాగ్‌ ఒకటి. కనుకనే ఎటువంటి ప్రత్యేకతలు లేని ఈ బస్తీ ఆకస్మికంగా గళమెత్తింది. పక్షం రోజులకు పైగా ఆ ఘోష చాలా ప్రదేశాలలో ప్రతిధ్వనిస్తోంది. ప్రతి రోజూ రేయింబవళ్ళూ, ప్రచండ శీత గాలులను (ఢిల్లీలో డిసెంబర్ నెలలో చలి మహాతీవ్రంగా వుండడం గత 118 సంవత్సరాలలో ఇది రెండో పర్యాయమని రికార్డు అయింది) లక్ష్య పెట్టకుండా ప్రధాన వీధిలో మహిళలు భారీ సంఖ్యలో బైఠాయింపు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆ నిరసనకారుల్లో అత్యధికులు ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్న వారే. ఆఫీసు వేళల అనంతరం వారు నేరుగా ధర్నా ప్రదేశానికి నిరసనలో పాల్గొంటున్నారు. ఇక గృహిణులయితే, ఈ మహా నిరసనల్లో భాగస్వాములుగా చేసేందుకు తమ పిల్లలను సైతం తీసుకు వస్తున్నారు.

మనసులో ఆందోళన నిశ్శబ్దంగా వుంటుందా? ఆ మహిళలు నినాదాలు చేస్తున్నారు; చైతన్య శీల, దేశ భక్తి ప్రపూరిత పాటలు పాడుతున్నారు; నిరసనలకు సంబంధించిన పోస్టర్లను సృజిస్తున్నారు; వాహనాల రాకపోకలను స్తంభింప చేస్తున్నారు; రాజ్యాంగ న్యాయాన్ని కోరుతున్నారు; ప్రతి మూస ధోరణినీ బద్దలు చేస్తున్నారు. ఇది ఒక నిరసన ప్రదర్శన మాత్రమే కాదు, షహీన్ బాగ్ జనావళి ‘మెహ్‌ఫిల్’ (సామాజిక వేదిక) కూడా. ఆగ్రహావేశాల్లో వున్న షహీన్ బాగ్ మహిళలు రాళ్ళు రువ్వడం లేదు, దుర్భాషలాడడం లేదు. వారు, జామియా మిలియా ఇస్లామియా గ్రంథాలయంలోకి చొరబడి, విద్యార్థులను చితక బాదిన ఢిల్లీ పోలీసులపై కోపం ఎంతగా వ్యక్తం చేస్తున్నారో, మోదీ సర్కార్ (ఇది ‘ముస్లిం- వ్యతిరేక’ ప్రభుత్వమని వారు పూర్తిగా విశ్వసిస్తున్నారు) పై అంతగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకూ షహీన్ బాగ్ ఆందోళనకారుల్లో పౌరసత్వ సవరణ చట్టం (సి ఏఏ) నియమ నిబంధనలు, ఇతర వివరాలను చదివిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. అయితే అది ఒక ‘రాక్షస’ చట్టమని ప్రతి ఒక్కరూ గొంతెత్తి మరీ చెబుతున్నారు. అయితే పౌరసత్వ సవరణ చట్టం ఏ భారతీయ ముస్లింనూ ప్రతికూలంగా ప్రభావితం చేయదని, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి) గురించి కూడా అసలు చర్చించనే లేదని ప్రధాన మంత్రి, హోం మంత్రి పదే పదే స్పష్టం చేస్తున్న విషయాన్ని నేను గుర్తు చేయగా ‘మేము వారి మాటలను నమ్మం’ (భరోసా నహీ హై) అని వారు కుండబద్దలు గొట్టారు. ఈ ఆందోళన, భిన్న దృక్పథాల మధ్యనే కాకుండా, కొత్త పౌరసత్వ చట్టంలోని మత పరమైన పక్షపాత వైఖరి వారి మనస్సుల్లో అమిత కలవరాన్ని కలిగిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టంపైన, దాని గురించి ప్రభుత్వాధినేతలు ఇస్తున్న హామీలపైన షహీన్ బాగ్ ఆందోళన కారుల్లో ఇసుమంత నమ్మకం లేదు.

ఈ విశ్వాసరాహిత్యమే సిఏఏ,- ఎన్‌ఆర్‌ సి వ్యతిరేక నిరసనల కొనసాగింపును అనివార్యంగా ప్రేరేపిస్తోంది. మోదీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వివక్షాపూరితంగా, మతపరమైన అధిక సంఖ్యాకుల అనుకూల వైఖరితో వ్యవహరిస్తున్నదని ఈ ఆందోళనకారులు పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ‘‘అమిత్ షా ఒక రోజు ‘జాతీయ పౌర పట్టిక’ను దేశ వ్యాప్తంగా అమలుపరుస్తామని చెబుతారు. ఆ మరుసటి రోజే నరేంద్ర మోదీ అసలు దాని గురించి చర్చించనేలేదని ప్రకటిస్తారు! మేము ఎవరిని నమ్మాలి? అసలు వారి మాటలను మేము ఎందుకు విశ్వసించాలి?’’ అని షహీన్ బాగ్ ఆగ్రహ మహిళ ఒకరు నన్ను నిలదీసి ప్రశ్నించింది.

‘మరి మీరంతా మోదీ సర్కార్ అమలు పరుస్తున్న ఉజ్వల, ముద్రా యోజన, ఆయుష్మాన్ భారత్ మొదలైన పథకాల వల్ల లబ్ధి పొందడం లేదా? వాటిలో హిందూ–-ముస్లిం బేధ భావం ఎక్కడ వున్నది?’అని నేను ఎదురు ప్రశ్నించాను. ‘అవన్నీ ఎన్నికలలో ఓట్లను దండుకునేందుకు కాదాండీ? ప్రధానమంత్రి మా ముస్లింలను సమాన పౌరులగా పరిగణిస్తున్నారని మీరు విశ్వసిస్తున్నారా? ఆయన ప్రభుత్వ దృష్టిలో మేమందరమూ ఉగ్రవాదులం కాదూ? ’అని ఒక వృద్ధ మహిళ తీవ్ర స్వరంతో ప్రతిస్పందించింది. సరే, ఢిల్లీ నగర పటాన్ని ఒకసారి తేరిపార చూడండి.

జామియా నగర్ పరిసరాలలోనే వున్న బాట్లా హౌజ్ (గుర్తొచ్చిందా? 2008లో ఒక ఉగ్రవాద ఎన్ కౌంటర్ అనంతరం అది దేశవ్యాప్తంగా పతాక శీర్షికల కెక్కింది), షహీన్ బాగ్‌కు కూతవేటు దూరంలోనే వున్నది సుమా! సిఏఏ-, ఎన్‌ఆర్‌సి వ్యతిరేక నిరసనల సందర్భంగా జామియా, దేశంలోని ఇతర ప్రాంతాలలో బస్సుల దగ్ధం, ప్రభుత్వాస్తుల ధ్వంసం మొదలైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం గురించి నేను ప్రశ్నించగా ఆ ఆగ్రహ మహిళల్లో ఒకరు ఇలా ప్రతిస్పందించారు: ‘మీ టీవీ వాలాలు దగ్ధమవుతున్న బస్సుల దృశ్యాలను అదేపనిగా చూపిస్తుంటారు. అయితే మేము ఇక్కడ పోలీసులకు గులాబీలు, మంచినీరు ఇవ్వడం మీ దృష్టికి రాలేదా?’

‘ఇంతకూ మీరు ఆ హింసాత్మక చర్యలను సమర్థిస్తున్నారా?’అని నేను ప్రశ్నించగా ‘ఏ హింసాత్మక చర్యలనైనా మేము సమర్థిస్తున్నామని ఎవరు చెప్పారు’ అనే ఎదురు ప్రశ్నతో ఒక యువతి తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘నిరసనల సందర్భంగా సంభవించిన హింసాకాండకు మమ్ములనందరినీ తప్పు పట్టడాన్ని మానివేయండి. అవి కొంతమంది ‘‘బయటి వ్యక్తుల’’ చర్యలు. గౌరవ ప్రదంగా జీవించేందుకు మాకు గల హక్కును కాపాడుకోవడానికై ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేసేందుకు మాకు అనుమతి నివ్వరా? మేము ఎలా నిరసన తెలుపాలనే విషయమై కొత్త నియమ నిబంధనలను మీరు నిర్దేశించనున్నారా? జామియా మిలియా ఇస్లామియా గ్రంథాలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన పోలీసులు అక్కడ అధ్యయనంలో వున్న విద్యార్థులను చితక బాదడం హింసాకాండ కాదా? అలాగే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో జరిగిన పోలీసు దాడులు, మీరట్ లో ప్రైవేట్ అస్తులను ధ్వంసం చేయడం హింసాకాండ కాదా? ఆ హింస గురించి మీరు ఎందుకు మాట్లాడరు?’అని కూడా ఆ యువతి తీవ్ర స్వరంతో ప్రశ్నించింది.

‘మీరు పాకిస్థాన్‌కు వెళ్ళిపోండి’ అని మీరట్ లో నిరసనకారులకు సీనియర్ పోలీసధికారి ఒకరు చెప్పడాన్ని చూపిస్తున్న వాట్సాప్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. మీరట్ వీడియో ఒక్కటే కాదు, ఇంకా అలాంటి పలు వీడియోలు వైరల్ అయ్యాయి. షహీన్ బాగ్ ప్రాంతమున్న నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు అమానుల్లాఖాన్‌తో ప్రమేయమున్న వీడియో నొక దాని గురించి ప్రస్తావించాను. ఆ శాసనసభ్యుడు ఒక గుంపు నుద్దేశించి మాట్లాడుతూ ముస్లింలు ఊపరి పీల్చుకోవడమూ, స్వేచ్ఛగా జీవించడమూ కష్టతరమవుతోందని వ్యాఖ్యలు చేయడాన్ని ఆ వీడియో చూపించింది.

‘ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా? అమానుల్లా ఖాన్ చేసింది మతతత్వ ప్రసంగం కాదా? ఎందుకు మీరు ఆయన్ని నిలదీయరు?’అని నేను ప్రశ్నించగా ఒక మహిళ ఇలా ప్రతిస్పందించారు: ‘ చూడండి. ఆయన ఇక్కడ మా నాయకుడు. మా సమస్యల గురించి ప్రస్తావిస్తే అందులో తప్పు ఏమిటి? హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి ప్రసంగాలు చేయడం లేదా? ప్రధానమంత్రి సైతం ఒక శ్మశానం విషయమై మాట్లాడలేదా?’

ఇలా వాదోపవాదాలు కనీసం గంటసేపు సాగాయి. అప్పటికే చీకటి పడుతోంది. చలి పెరుగుతోంది. అయినా అక్కడకు వచ్చిన వారెవ్వరూ ఇళ్ళకు తిరగి వెళ్లడం లేదు. కొంతమంది మహిళలు దుప్పట్లు కూడా తెచ్చుకున్నారు. ఆ శీతరాత్రి, వీధిలోనే హిమావృత ఆకాశం కింద గడపడానికి వారు సిద్ధమయి వచ్చారు. నేను వెళ్ళి పోయేందుకు సిద్ధమవ్వగా ఒక మహిళ నాకు వీడ్కోలు చెప్పుతూ ఇలా అన్నారు: ‘మీరు ఎప్పుడూ మీ స్టూడియోకు మౌల్వీలు, పూజారులు, రాజకీయ నేతలనే ఆహ్వానిస్తుంటారు. ఈ సారి దయచేసి మమ్ములను పిలవండి’. బహుశా, నేను నిజంగా వారినే మా టీవీ స్టూడియోకి ఆహ్వానించవచ్చు.

బహుశా మన విఐపీ నేతలు, మంత్రులు కూడా వాస్తవాలు తెలుసుకునేందుకు షహీన్ బాగ్ మహిళలను కలిసి, వారు చెప్పేది విన వలసిన అవసరమున్నదని నేను గట్టిగా భావిస్తున్నాను. చట్టాల పక్షపాతానికి, అవి తమను బలిపశువులను చేయడం పట్ల రగులుతోన్న ఆగ్రహావేశాలకు మధ్య చిక్కుకున్న షహీన్ బాగ్ మహిళల భావావేశ వ్యాఖ్యలు అమితంగా భయపెడుతున్నాయి. . సమాజంలోని వివిధ మత వర్గాల వారి మధ్య అత్యంత సున్నితమైన సంబంధాల ఉపరితలం కింద ఒక మహోద్రిక్త పరిస్థితి నెలకొనివున్నది. ఏమాత్రం అలక్ష్యం చేసినా అది ఏ క్షణంలోనైనా ఒక అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయం. ఇప్పటికే సామాజిక సామరస్యత బలహీనపడిన నేపథ్యంలో సిఏఏ, – ఎన్‌ఆర్‌సిపై చర్చ అటువంటి విషమ పరిస్థితికి దారితీసే అవకాశం ఎంతైనా వున్నది. ఈ భయానక భవిష్యత్తే షహీన్ బాగ్ మహిళలను వీధుల్లోకి తీసుకువచ్చి అవిరామ ఆందోళనకు పురిగొల్పింది.

(Courtesy Andhrajyothi)