మరో ఇద్దరికి కూడా శిక్షలు ఖరారు
తాత్కాలికంగా నిలుపుదల చేసిన హైకోర్టు

దిల్లీ: ఇరవై ఏళ్ల నాటి రక్షణ పరికరాల అవినీతి కేసులో సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీ సహా మరో ఇద్దరికి దిల్లీ కోర్టు.. గురువారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దోషులకు రూ.లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. 2001 జనవరిలో తెహల్కా వెబ్‌ పత్రిక ‘ఆపరేషన్‌ వెస్టెండ్‌’ పేరుతో శూలశోధన నిర్వహించింది. తెహల్కా విలేకరి.. తాను రక్షణ పరికరాలను అమ్మే ‘వెస్టెండ్‌ ఇంటర్నేషనల్‌’ (ఊహాజనిత సంస్థ) ప్రతినిధినంటూ జయాజైట్లీకు పరిచయం చేసుకున్నారు. సైన్యానికి అవసరమైన థర్మల్‌ ఇమేజర్స్‌ను తమ సంస్థ తయారుచేస్తుందని, అందుకు సంబంధించిన కాంట్రాక్టును అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జిఫెర్నాండెజ్‌కు చెప్పి ఇప్పించాల్సిందిగా జయాజైట్లీని కోరారు. ఇందుకు ఆమె అంగీకరిస్తూ.. రూ. 2 లక్షలు తన ప్రతినిధి గోపాల్‌ పచేర్‌వాల్‌కు ఇవ్వాలని సూచించింది.

అంతకుముందు జయాజైట్లీతో సమావేశం ఏర్పాటు చేయిస్తానంటూ రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ మురగయ్‌ తెహల్కా విలేకరి దగ్గర రూ.20 వేలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తెహల్కా విలేకరులు.. కెమెరాల్లో బంధించారు. దీంతో రక్షణ శాఖ మంత్రి  జార్జి ఫెర్నాండెజ్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. కేసులో జయాజెట్లీ సహ మిగతా నిందితులపై 2006లో కేసు నమోదైంది. తాజాగా జయాజైట్లీ సహా పచేరివాల్‌, మురగయ్‌ దోషులుగా దిల్లీ కోర్టు పేర్కొంది. గురువారం సాయంత్రం లోపు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే శిక్షలు వెలువరించగానే జయాజైట్లీ న్యాయవాదులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జైలు శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.

Courtesy Eenadu