దీపికా పదుకునె జేఎన్‌యూ రాకపై సినీ పండితుల ప్రశంసలు

న్యూఢిల్లీ : ఎవరూ ఊహించని విధంగా జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో మూకదాడులకు గురైన విద్యార్థులను పరామ ర్శించడానికి వెళ్లిన బాలీవుడ్‌ అగ్రతార దీపికా పదుకునెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఆమె నిరాశ, నిస్పృహలకు కుంగిపోయినా.. ఒత్తిడిని జయించింది గనుకనే ఆమె అడుగులు జేఎన్‌యూ వైపునకు పడ్డాయని వారు చెబుతున్నారు. సీఏఏ నిరసనలు, జేఎన్‌యూ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడినా.. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు బాలీవుడ్‌కు చెందిన రెండో శ్రేణి దర్శకులు, నటులు ఈ విషయమై పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నా.. బీ-టౌన్‌ అగ్ర తారాగణం మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. కానీ ఈ తరుణంలో విద్యార్థులకు సంఘీభావంగా దీపికా రావడం ఆమె ధైర్యాన్ని చూపుతున్నాయని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యాసిడ్‌ బాధితురాలి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన చపాక్‌ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఢిల్లీలో ఉన్న దీపికా.. మంగళవారం రాత్రివేళ జేఎన్‌యూకు వచ్చారు.
అక్కడ జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌తో పాటు ఏబీవీపీ, హిందూ రక్షాదళ్‌ గుండాల దాడిలో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారికి సంఘీభావంగా కొంతసేపు అక్కడే ఉన్నారు. తన సిన్మాకు సంబంధించి గానీ, అక్కడ దాడి గురించి గానీ ఆమె పల్లెత్తు మాట మాట్లాడలేదు. కానీ..

బీజేపీ, ఏబీవీపీ, అతివాద హిందూత్వ అనుకూల శక్తులు మాత్రం సోషల్‌మీడియాలో ఆమెపై దాడికి దిగాయి. సరిగ్గా రెండేండ్ల క్రితం దీపికా నటించిన పద్మావత్‌ విషయంలో చేసినట్టే ఇప్పుడూ అదే తరహా దాడికి దిగుతున్నారు. ‘బ్యాన్‌ చపాక్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఆమెపై పుంఖానుపుంఖాలుగా విద్వేషాన్ని వెదజల్లుతున్నారు. ఇంత జరుగుతున్నా ఖాన్‌ల త్రయంగానీ, బిగ్‌ బీ గానీ స్పందించలేదు.

సాధారణంగా జేఎన్‌యూ, సీఏఏ నిరసనలు లాంటివి జరిగినప్పుడు సినీ తారలు స్పందించడానికి ఇష్టపడరు. తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ దర్శకులు అనురాగ్‌ కశ్యప్‌, అనుభవ్‌ సిన్హా, స్వరభాస్కర్‌, రిచా చద్దా వంటి చిన్న తారలు, దక్షిణాదిలో ప్రకాశ్‌రాజ్‌, కమలహాసన్‌, సిద్ధార్థ్‌ వంటివారు దేశంలో నెలకొన్న అశాంతి, అసహనంపై ట్విట్టర్‌ వేదికగానే గాక బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఫలితంగా దుండగులు వారి కుటుంబాలను టార్గెట్‌ చేస్తున్నా, సిన్మాలలో అవకాశాలు కోల్పోతున్నా వారు వెరవడం లేదు.

ఇదే సమయంలో దీపికా సైతం.. జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించడంతో ‘భక్తులకు’ ఆమె ఒక్క సారిగా టార్గెట్‌ అయ్యారు. అయితే, గతంలో ఆమె కొంతకాలం ఒత్తిడితో కుంగిపోయారు. తాను సైతం నిరాశ, నిస్పృహలకు గురయ్యా ననీ బహిరంగంగా ఒప్పుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఆ సమయంలో తాను ఎదుర్కొన్న సంఘర్షణ, సమాజం ఆమెపై చూపించిన వైఖరిపై ఓ ఇంటర్వ్యూలో ధైర్యంగా వివరించారు. అప్పట్నుంచి తన ఆలోచనా విధా నాన్ని మార్చుకున్నానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. అదే ధైర్యంతో దీపికా జేఎన్‌యూకు వెళ్లారనీ, తనతో తాను చేసిన పోరాటమే ఆమెను అటువైపుగా కదలించిందని సినీ పండితులు అంటున్నారు. మరోవైపు జేఎన్‌యూకు దీపికా రాకతో బాలీవుడ్‌ రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తున్నదని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీపికా జేఎన్‌ యూకు వెళ్లొచ్చిన మరుసటిరోజే మరో బాలీవుడ్‌ నటి జూహీచావ్లా.. ముంబయిలో సీఏఏకు అనుకూలంగా బీజేపీ చేపట్టిన ర్యాలీలో పాల్గొ న్నారు. ఆమె స్పందిస్తూ.. సెలబ్రిటీలు అన్ని విషయాల మీద స్పందిం చాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం బాలీవుడ్‌లో రెండు వర్గాలు న్నట్టు స్పష్టమవుతున్నదని సినీ విశ్లేషకుల వాదన.

బీజేపీ అనుకూల నటులు సైతం దీపికా పేరును ప్రస్తావించకుండా ట్విట్టర్‌కు పనిచెబు తున్నారు. కాగా, కొంతకాలంగా దేశం పలు సమస్యలతో కొట్టుమిట్టా డుతున్నా ఖాన్‌ త్రయం మాత్రం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గతంలో కొద్దో గొప్పో స్పందించిన మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీ ర్‌ ఖాన్‌.. అసహనంపై మాట్లాడినందుకు గానూ పలు కీలకమైన ‘ఒప్పం దాలు’ కోల్పోయారనీ, అందుకే ఆయన మౌనం దాల్చుతున్నారని అంటు న్నారు.

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఆస్తులపై ఐటీ అధికారులు కన్నేసి ఉంచారనీ, పలుమార్లు ఆయన ఆస్తులకు సంబంధించి ఐటీ దాడులు జరిగాయనీ, అందుకే ఆయన ఏం మాట్లాడటం లేదని ఓవర్గం వాదన. బిగ్‌ బీ సైతం మౌనాన్నే ఆశ్రయించారు.

అడపాదడపా బాలీవుడ్‌ అగ్ర హీరోలు ప్రధాని మోడీని కలిసి ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తారే తప్ప ఇలాంటి ఘటనలకు స్పందించిన దాఖలాలు లేవు. కానీ, తన సిన్మా విడుదల అవుతున్న సమయంలో అక్కడికి వెళ్తే తాను విమర్శలకు గురవుతానని తెలిసినా.. దీపికా (చపాక్‌కు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించారు) జేఎన్‌యూకు వచ్చి సంఘీభావం తెలపడం గమనార్హం.

(Courtesy Nava Telangana)