N Venugopal

Image result for Decoding Niti ayog Telangana rank"ఎన్‌. వేణుగోపాల్‌

కఠోర వాస్తవాలను తలకిందులు చేసే, తారుమారు చేసే, మసిపూసి మారేడు కాయ చేసి, ఆ మారేడు కాయనే సుమధుర ఫలంగా, ప్రతిఫలంగా అందిస్తే చూడడానికీ, వినడానికీ, చదవడానికీ బాగానే ఉంటుంది. సరిగ్గా తుపాకి వెంకటరాముడి ప్రగల్బాల లాగ. ఆ తుపాకి రాముడి అతిశయోక్తులలో కూడా చెరువు నిండా వడ్లుపోసి, తూములో మంట పెట్టి వంటకం సాగించినంత వరకూ వినడానికి హాస్యమో, చమత్కారమో కనబడి, అద్భుతమో, ఆనందమో కలగవచ్చు గాని, ఆ తర్వాత ఊరందరినీ కూచోబెట్టి చింతాకు విస్తరి వేస్తున్నానన్నప్పుడూ, ఒక్కొక్కరికి ఒక మెతుకు వడ్డిస్తున్నానన్నప్పుడూ, వారది తినలేక చచ్చారనీ, అజీర్తి పట్టుకుందనీ అంటున్నప్పుడూ అసలు విషాదం బైటపడుతుంది. ఎంత బీభత్స అవకతవక అవాస్తవిక రాజ్యం అమలవుతున్నదో తేటతెల్లమవుతుంది. ఈ మంగళవారం నిటి అయోగ్‌ విడుదల చేసిన 2019-20 రాష్ట్రాల అభివృద్ధి తులనాత్మక జాబితా – ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ను, అందులో తెలంగాణకు దక్కిన స్థానాన్ని పరిశీలిస్తుంటే అది గుర్తుకొచ్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టేనబుల్‌ డెవలప్‌ మెంట్‌ గోల్స్‌ – ఎస్‌డీజీ)ను సాధించడంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఏ మేరకు విజయం పొందాయో లెక్కించి ఈ సూచికను తయారు చేస్తారు. అందులో తెలంగాణ మూడో స్థానంలో అగ్రభాగాన ఉన్నదని, గత యేడాది అది తొమ్మిదో స్థానంలో ఉండిందని, ఈ సంవత్సరంలో ఇతోధిక అభివృద్ధి సాధించి వందకు 67 పాయింట్లు సాధించి మూడో స్థానానికి ఎగబాకిందని తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వానుకూల పత్రికలూ, ప్రచారసాధనాలూ చెపుతున్నాయి.

ఈ సూచికలకూ, తులనాత్మకతకూ సంబంధించి నిశితంగా పరిశీలించవలసిన సూక్ష్మ అంశాలెన్నో ఉన్నాయి గాని, మొట్టమొదట గుర్తించవలసినది గత సంవత్సరపు తొమ్మిదో స్థానం నుంచి ఈ సంవత్సరం మూడో స్థానానికి ఎగబాకిందనడం పచ్చి అబద్ధం. ”ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2019-2020కి రూపొందించుకున్న సూచికల గుచ్ఛం చాల పెద్దది. అందులో 100 సూచికలున్నాయి. దీనితో పోలిస్తే 2018 ఇండెక్స్‌లో కేవలం 62 సూచికలు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ రెండు సూచికల సమాహారాన్ని కచ్చితంగా పోల్చి చూడడానికి వీలులేదు. ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2018కీ, ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్‌ 2019-20కీ ఉమ్మడిగా ఉన్న సూచికలు 40మాత్రమే” అని స్వయంగా నిటి అయోగ్‌ వెబ్‌ సైట్‌ మీద స్పష్టంగా రాశారు. కాబట్టి గత సంవత్సరం కన్న ఎదిగామనో, ఎక్కువ అభివృద్ధి సాధించామనో చెప్పుకోవడానికి ఎంతమాత్రం వీలు లేదు.

అంటే ప్రస్తుత సూచికను దానికదిగానే చూసి విశ్లేషించవలసి ఉంటుంది గాని ఇతర సంవత్సరాల సూచికతో దీన్ని పోల్చి ఎదిగామనో, దిగజారామనో అనడానికి కుదరదు. అసలు ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే వాటిని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలన్నీ కలిసి 2015లో ఆమోదించాయి. 2030 నాటికి ప్రపంచంలో పేదరికాన్ని అంతం చేయాలని, భూగోళాన్ని పరిరక్షించాలని, ప్రపంచ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించేలా చూడాలని ఈ లక్ష్యాలు నిర్దేశించాయి. ఈ లక్ష్యాలు మొత్తం పదిహేడు: 1. దారిద్య్ర నిర్మూలన. 2. ఆకలి నిర్మూలన. 3. మంచి ఆరోగ్యం. 4. నాణ్యమైన విద్య 5. స్త్రీపురుష సమానత. 6. శుభ్రమైన తాగునీరు – పారిశుధ్యం. 7. సరసమైన, శుభ్రమైన శక్తి వనరులు. 8. గౌరవప్రదమైన ఉపాధి – ఆర్థికాభివృద్ధి. 9. పారిశ్రామికీకరణ, అన్వేషణ, మౌలిక సౌకర్యాలు. 10. అసమానతల తగ్గింపు. 11. సుస్థిర పట్టణాభివృద్ధి, సాముదాయక అభివృద్ధి. 12. బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి. 13. వాతావరణ చర్యలు. 14. జలంతో సమన్వయంలో జీవం. 15. భూమితో సమన్వయంలో జీవం. 16. శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు. 17. ఈ లక్ష్యాల సాధనలో భాగస్వామ్యం.
ఐక్య రాజ్య సమితి సూచించిన ఈ పదిహేడు లక్ష్యాలలో 12, 13, 14, 17 అనే నాలుగు లక్ష్యాలను పక్కన పెట్టి, మిగిలిన పదమూడు లక్ష్యాల విషయంలో 62 జాతీయ సూచికలను రూపొందించి, ఆయా సూచికలలో ఏ రాష్ట్రం, ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఏ స్థానంలో ఉన్నాయో అంచనా వేసేందుకు నిటి అయోగ్‌ 2018లో ఒక మౌలిక నివేదిక తయారు చేసింది. ఆ మౌలిక నివేదిక తయారీలో ఉపయోగించిన సూచికలను, ప్రమాణాలను సవరిస్తూ 2019-20 కోసం మళ్లీ దేశవ్యాప్త కసరత్తు చేశారు.

కేంద్రప్రభుత్వ గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, ఐక్య రాజ్య సమితి, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో రూపొందిన కొత్త సంవిధానం అంతకుముందే కేంద్ర మంత్రిత్వశాఖ తయారు చేసిన జాతీయ సూచికా చట్రాన్ని అనుసరించింది. మొదటి నివేదిక కన్న దృఢమైన నివేదిక తయారు చేయడానికి రూపొందించిన ఈ కొత్త సంవిధానంలో 17లక్ష్యాలలోని పదహారిటిని పరిమాణాత్మకంగా లెక్కించడానికి, చివరి లక్ష్యాన్ని మాత్రం గుణాత్మకంగా లెక్కించడానికి పూనుకుని 100సూచికలు ప్రాతిపదికగా పెట్టుకున్నారు. ఒక్కొక్క సూచికలో ఆయా రాష్ట్రాలు సాధించిన ఫలితాలను బట్టి మార్కులు వేశారు. ఆ మార్కుల మొత్తాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్థానాలు కేటాయించారు. ”ఆయా రాష్ట్రాలు సాధించిన ఫలితాలు” అనేది కూడా పూర్తి వాస్తవం కాదు, దాన్ని సరిగ్గా చెప్పాలంటే, ”తాము సాధించామని ఆయా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తయారు చేసిన నివేదికల ఆధారంగా రూపొందించిన ఫలితాలు” అని చెప్పాలి.

ఆధునిక యుగంలో ప్రజాజీవనానికి సంబంధించిన అత్యంత సాధారణ విషయాలు కూడా ఆ ప్రజలకే అర్థం కాకుండా చేయడం, అర్థమైనా వాటి మీద ఆచరణకు దిగడానికి వీలులేని స్థితి కల్పించడం ఆధునిక యుగంలో ప్రభుత్వాలు కళగా అభివృద్ధి చేశాయి. ఆ కళలో భాగమే ఆర్థికశాస్త్ర భావనలను, ప్రమాణాలను, పరిభాషను ఇంత సంక్లిష్టంగా, సాంకేతికంగా మార్చడం. నిజానికి ప్రజాజీవన ప్రమాణాలలో మెరుగుదల కనబడుతున్నదా లేదా, ఏ ప్రాంతంలో కనబడుతున్నది, ఏ ప్రాంతంలో కనబడడం లేదు, ఏ వర్గాలలో కనబడుతున్నది, ఏ వర్గాలలో కనబడటం లేదు, ఎందువల్ల కనబడటం లేదు అనే మామూలు విషయాల్ని, అందరికీ తెలిసే విషయాల్ని ఇలా సాంకేతికమైన పారిభాషిక సూచికలుగా మార్చడం, ఆ సూచికలతో రాష్ట్రాల మధ్య పోటీ పెట్టడం, ఆ సూచికలలో పైన ఉన్న వారు తామేదో ఘనత సాధించామని జబ్బలు చరుచుకోవడం సాధారణమైంది. వాస్తవానికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది. ప్రతి ఇంట చీకటే, ప్రతి కంట కన్నీరే సాగుతున్నది. వాస్తవంగా ప్రతి మనిషికీ కనబడే ఈ దృశ్యానికి మసిపూసి మారేడు కాయ చేయడం, రంగుల కలలూ వలలూ సృష్టించడం తద్వారా ప్రజలను భ్రమల్లో ముంచి జోకొట్టడం పాలకులకు అవసరం. అందుకు అర్థశాస్త్ర పరిభాష ఒక సాధనం. ఈ అగ్రస్థానంలో ఉండడం అనే దానికి సాంకేతికంగా ప్రాధాన్యత ఉందేమో, గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తుందేమో గాని, వాస్తవంగా ఏ ప్రాధాన్యతా లేదు. ఉదాహరణకు, ఇదే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగ మంత్రిత్వ శాఖ (పర్సనెల్‌ మినిస్ట్రీ) మూడు రోజుల కిందనే విడుదల చేసిన సుపరిపాలనా సూచికలో తెలంగాణ పదకొండో స్థానంలో ఉంది. ఒక మంత్రిత్వశాఖ పరిశీలనలో సుపరిపాలనలో అట్టడుగున పదకొండో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు రోజులు తిరగకుండానే మరొక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఆ సుపరిపాలన వల్లనే జరిగిన, లేదా, జరగని, సామాజిక అభివృద్ధిలో మూడో స్థానానికి ఎగబాకగలగడం నిజంగా ఒక ఇంద్రజాలమే. అలా జరిగిందంటే ఆ పదకొండో స్థానమైనా పొరపాటై ఉండాలి, లేదా ఈ మూడో స్థానమైనా పొరపాటై ఉండాలి.

నిజానికి ఈ సూచికలూ, మదింపులూ, అంచనాలూ ఏవీ కూడా ప్రజలను కలిసి, ప్రజా జీవితాన్ని పరిశీలించి, వాస్తవాలు గ్రహించి తయారు చేస్తున్నవి కావు. తాము సక్రమంగా పనిచేస్తున్నామని చూపుకోవడానికి కింది నుంచి పైదాకా సిబ్బంది పంపించే నివేదికలను క్రోడీకరించి అధికారవర్గం ఎయిర్‌ కండిషన్డ్‌ గదుల్లో తయారు చేసే సూచికలివి. వాటికీ వాస్తవ ప్రజా జీవనానికీ హస్తిమశకాంతరం ఉంటుంది. భారతదేశంలో గణాంకాల నాణ్యత సక్రమమైనది కాదని. ఆ గణాంకాల విశ్వసనీయత సందేహాస్పదమైనదని భారత ప్రభుత్వ గణాంకాల రూపకల్పనలో కీలక శాఖల్లో పనిచేసిన, చివరికి ప్రధాన మంత్రి కూడా అయిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా ఎన్నో సందర్భాలలో అన్నారు.

ఇప్పుడు తెలంగాణ మూడోస్థానం సాధించడానికి కారణమైన సూచికలలో కూడా చాల విచిత్రంగా వంద సూచికల మదింపు జరగగా, అందులో కనీసం పదమూడు సూచికల సమాచారమే లేదు. కనీసం ఈఎస్‌డీజీల కోసం మంత్రిత్వశాఖ తయారు చేసిన వెబ్‌ సైట్‌లో అన్ని రాష్ట్రాల, అన్ని సూచికల పట్టికలో పదమూడు సూచికల దగ్గర తెలంగాణ దగ్గర ఏ అంకె రాయకుండా, ఒక డాష్‌తో సరిపెట్టారు. అంటే సమాచారం లేదు అని సాధారణ అర్థం. ఉదాహరణకు రాష్ట్రంలో జాతీయ స్థాయి దారిద్య్ర రేఖ కన్న దిగువన జీవిస్తున్న ప్రజల జనాభా అనే సమాచారం లేదు. వ్యవసాయంలో తలసరి విలువ చేర్పు అనే సమాచారం లేదు. ఆరు నుంచి పదమూడేండ్ల వయసు గల పిల్లల్లో బడికి వెళ్లని వాళ్ల శాతం అనే సమాచారం లేదు. ఐదు నుంచి పందొమ్మిదేండ్ల వయసులో పాఠశాలకు వెళ్తున్న దివ్యాంగులు అనే సమాచారం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వంద మందికి మొబైల్‌ కనెక్షన్‌ ఉన్న వారి సంఖ్య (మొబైల్‌ టెలి డెన్సిటీ) అనే సమాచారం లేదు. వంద మందిలో ఎంత మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంది అనే సమాచారం లేదు. గ్రామీణ భారత కుటుంబ ఖర్చులో, పట్టణ భారత కుటుంబ ఖర్చు అసమానత సూచిక (జిని కోఎఫిషియెంట్‌) ఇక్కడ ఎంత ఉన్నది అనే సమాచారం లేదు. షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ ప్లాన్‌ నిధులను ఎంత శాతం వినియోగించారు అనే సమాచారం లేదు. ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ నిధులను ఎంత శాతం వినియోగించారు అనే సమాచారం లేదు. పట్టణ జనాభాలో ఎంత శాతం కుటుంబాలు మురికివాడల్లో నివసిస్తున్నాయి అనే సమాచారం లేదు. విపరీతమైన వాతావరణ పరిస్థితుల వల్ల సంభవించిన మరణాల సమాచారం లేదు.

మరొకపక్క, ఐదారు సూచికలు పూర్తిగా సముద్ర తీర ప్రాంతాలకు వర్తించేవి గనుక తెలంగాణకు వర్తించవు. అవి సహజంగానే డాష్‌తో ఉన్నాయి. అంటే మొత్తం వంద సూచికల్లో ఆ పదమూడూ ఈ ఆరూ కలిపితే పందొమ్మిది సూచికలు తెలంగాణ విషయంలో అసలు పరిగణనకే రాలేదు. అలా మొత్తంలో దాదాపు ఐదో భాగపు సమాచారమే లేనప్పుడు, చివరికి తేలిన ఫలితపు విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించక తప్పదు. అలాగే విద్యుత్‌ సౌకర్యం ఉన్న ఇండ్లు, బ్యాంక్‌ ఖాతా ఉన్న కుటుంబాలు వంటి సూచికలలో నూటికి నూరు శాతం అని రాసి ఉంది. ఇది ఎంత నిజమో ఎవరికి వారు తెలుసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఈ సమాచారానికి విశ్వసనీయత లేదు, అందువల్ల వచ్చిన రాంక్‌ కూ విశ్వసనీయత సందేహాస్పదమవుతోంది.
అంతదూరం కూడా పోనక్కరలేదు, అక్షరాస్యతలో రాష్ట్రాల జాబితాలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం, అంతకు ముందు ఆ కొరతకు పరాయి పాలకులను కారణంగా చూపిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదేండ్లలో అక్షరాస్యతను పెంచడానికి ఎన్ని పాఠశాలలు నెలకొల్పిందో, ఎంత మంది ఉపాధ్యాయులను నియమించిందో, ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించిందో, లేక ఉన్న పాఠశాలలను మూసి వేసిందో అందరికీ తెలుసు. ఆ సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో ఏ దిశగా పయనించామని మూడో స్థానంలో నిలబడ్డాం? లైంగికదాడులు, కుల దురహంకార హత్యలు, ఆత్మహత్యలు, అవినీతి వగైరా అన్ని సూచికల్లోను అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం స్త్రీ పురుష సమానత, శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు అనే లక్ష్యాల సాధనలో ఏ దిశగా పయనిస్తున్నదని ఈ మూడో స్థానం?

(Courtesy Nava Telangana)