• ఉన్నావ్‌కేసుపై సుప్రీం డెడ్‌లైన్‌
  • ప్రమాదంపై వారంలోగా దర్యాప్తు
  • బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు
  • కేసుల విచారణ మొత్తం ఢిల్లీకి బదిలీ
  • కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ సర్కార్లకు
  • సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు

దేశంలో ఏం జరుగుతోంది?

‘ ఒక 19 ఏళ్ల అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేశారు. ఆమె తండ్రి పోలీసు కస్టడీలో చనిపోయాడు. ఆమెతో పాటు మేనత్తలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి, వారిని హత్య చేసే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఇంతకీ ఈ దేశంలో ఏం జరుగుతోంది?

సీజే రంజన్‌ గొగోయ్‌

ఉన్నావ్‌ అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఐదు కేసుల విచారణనూ ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, విచారణను- ప్రారంభించిన 45 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు జడ్జి ఎవరన్నది తాము చర్చించి వెంటనే నిర్ణయిస్తామని తెలిపింది. అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం రాయ్‌బరేలీ వద్ద ప్రమాదానికి లోనైన ఘటననూ సీరియ్‌సగా పరిగణించింది. దీనిపై దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో వెంటనే నివేదించాలని సీబీఐని ఆజ్ఞాపించింది. ఒక బాఽధ్యత గల అధికారిని మధ్యాహ్నం 12 గంటలకల్లా తమ వద్దకు పంపాలని ఉదయం 10 గంటలకే ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు హుటాహుటిన వెళ్లి ప్రమాద ఘటనపై తమ దర్యాప్తులో వెల్లడైన వివరాలను వివరించారు. అది విన్నాక ‘‘వారం రోజుల్లోగా మీ దర్యాప్తు పూర్తి కావాలి.. అత్యవసర పరిస్థితుల్లో మరో వారం రోజులు కోరవచ్చు. కానీ అది కూడా మేం వెంటనే ఆమోదిస్తామని భావించవద్దు’’ అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.

నెలరోజుల గడువు ఇవ్వాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరినప్పటికీ సీజే తిరస్కరించారు. ఈ బెంచ్‌లో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల తాత్కాలిక నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని బెంచ్‌ ఆదేశించింది. వారి వైద్యానికి, రవాణాకు, ఇతర కోర్టు-సంబంధ అవసరాలకు అన్నీ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. తమకు ప్రాణహాని ఉందని, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, కేసులో ప్రథమ నిందితుడైన కుల్‌దీప్‌ సెంగార్‌ అనుయూయుల నుంచి నిత్యం బెదిరింపులు వస్తున్నాయని బాధితురాలు సీజేకు లేఖ రాశారు. దీంతో ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల రక్షణ కల్పించాలని, కమాండెంట్‌ స్థాయి అధికారి ఇందుకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కూడా ఆదేశించింది.

ఉద్దేశపూర్వకంగా రాంగ్‌సైడ్‌లో వచ్చి ఢీ..

‘‘గత ఆదివారం రాయ్‌బరేలీ శివార్లలో యాక్సిడెంట్‌ జరిగింది. ఆ సమయంలో జోరుగా వాన పడుతోంది. బాధితురాలి కుటుంబం స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో ప్రయాణిస్తోంది. ఎదురుగా ఓ లారీ రాంగ్‌సైడ్‌లో వచ్చి దాన్ని ఢీకొట్టింది. అపుడు కారువేగం 100 కిలోమీటర్లు కాగా, లారీ కూడా 80 కిలోమీటర్ల వేగంలో ఉంది. రెండూ వేగంగా ప్రయాణిస్తున్నందున ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కారు ముందుభాగం నుజ్జయిపోయింది. లారీని తప్పించడానికి కారు డ్రైవరు శతధా ప్రయత్నించినట్లు మా దర్యాప్తులో తేలింది. లారీ ఉద్దేశపూర్వకంగానే రాంగ్‌సైడ్‌లో వచ్చి గుద్దినట్లు స్పష్టమవుతోంది. లేకుంటే కారు పక్కకి తొలగి ఉండేది లేదా భారీ వర్షానికి స్కిడ్‌ అయి ఉండేది.

ఇద్దరు ప్రత్యక్షసాక్షులను, ఆ ప్రాంతంలో ఉన్న రెండు దుకాణాల యజమానులను, ఫోరెన్సిక్‌ నిపుణులను ప్రశ్నించాం. యాక్సిడెంట్‌ జరిగిన స్థలానికీ వెళ్లి పరిశీలించాం. ఈ విషయమై ప్రస్తుతం జైల్లో ఉన్న ఎమ్మెల్యే (బాంగర్మౌ) కుల్‌దీప్‌ సింగ్‌ను కూడా ఇంటరాగేట్‌ చేస్తాం’’ అని సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యే నుంచి తమకు బెదిరింపులు వసున్నాయని, రక్షణ కల్పించండని కోరుతూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి దాదాపు 36 లేఖలు రాసినట్లు బాధిత కుటుంబం వెల్లడించింది. నలువైపుల నుంచీ విమర్శలు రావడంతో ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి భద్రత నిమిత్తం నియోగించిన ముగ్గురు పోలీసులను యూపీ ప్రభుత్వం గురువారం నాడు సస్పెండ్‌ చేసింది.

సుప్రీంలోనూ ఆలస్యం?

యోగి ప్రభుత్వం నుంచి తమకు రక్షణ అందడం లేదని, సెంగార్‌ అనుచరుల నుంచి నిత్యం బెదిరింపులు వస్తున్నాయని, తమను ఆదుకోవాలని కోరుతూ బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జూలై 12న లేఖ రాసింది. అయితే ఇది ఆయనకు చేరలేదని తెలుస్తోంది. ‘‘లేఖను నేను ఇప్పటికీ చూడనేలేదు. సుప్రీంకోర్టు కూడా న్యాయం చెయ్యకపోతే ఎలా.. అని వార్తాపత్రికల్లో చదివాను. నిజంగా ఇది నా దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. దీనిపై ఎక్కడ తప్పు జరిగిందో తేలుస్తా.. సిటింగ్‌ న్యాయమూర్తి చేతే అంతర్గత దర్యాప్తు చేస్తాం. ఈ కేసు చాలా తీవ్రమైనది. పత్రికల్లో వార్తలను పరిశీలించాక కేసు విచారణను త్వరితం చెయ్యాలని నిశ్చయించాం’’ అని సీజే పేర్కొన్నారు.

చిన్న కూతురిపైనా అఘాయిత్యం: తల్లి

‘‘మా పెద్దమ్మాయిపైనే కాదు ఆమె చెల్లిపైనా అఽఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సెంగార్‌ గూండాలు మా ఇంటికొచ్చి, బెదిరించినపుడు మా చిన్నమ్మాయి కూడా అక్కడే ఉంది.. ఆమెపైనా అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన నా భర్తను ఓ చెట్టుకు కట్టేసి బాదేశారు. ఆ దెబ్బలకు అతని మూత్రపిండం కూడా దెబ్బతింది. ఈ హింస జరుగుతున్నంత సేపూ ఎమ్మెల్యే సోదరుడు అతుల్‌ సెంగార్‌ అక్కడే ఉండి ఉసిగొల్పాడు. ఆ తరువాత వారు నా భర్తను లాక్కెళ్లారు’’ అని బాధితురాలి తల్లి మహిళా కమిషన్‌ సభ్యుల ముందు బయటపెట్టింది. ఆమె భర్తను ఆ తరువాత పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. వారి హింసకు తాళలేక వారం తరువాత ఆయన చనిపోయాడు.

(Courtacy Andhrajyothi)