* 9 మంది ప్రత్యూష కంపెనీ భాగస్వాములవి కూడా
* విశాఖ డాబా గార్డెన్స్‌లోని ఇండియన్‌ బ్యాంకు ప్రకటన
గ్రేటర్‌ విశాఖ బ్యూరో:
మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గంటా పేరిట ఉన్న విశాఖలోని అల్లిపురం ఎక్స్‌టెన్షన్‌ వార్డు, బాలయ్య శాస్త్రి లే-అవుట్‌లోని త్రివేణి టవర్స్‌లోగల ఎ/12, ప్లాట్‌-11ను, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్‌ బ్యాంకు సోమవారం ప్రకటన ఇవ్వడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. విశాఖలోని ఇండియన్‌ బ్యాంకులో ప్రత్యూషా రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ ఫ్రా ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరిట గతంలో తీసుకున్న అప్పు ప్రస్తుతం రూ.209 కోట్లకు చేరుకున్నట్లు బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. ఈ అప్పును రికవరీ చేసుకునేందుకు గంటాతోపాటు ఆయన సంబంధీకులు పి.రాజారావు, పి.ఎ. ప్రభాకర్‌రావు, పి.ఎ.భాస్కరరావు, కె.బి. సుబ్రమణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష మెస్సర్స్‌కు చెందిన ఆస్తులను ఈ-వేలం వేస్తున్నట్లు బ్యాంకు నోటీసులో పేర్కొంది. అప్పు కట్టకపో వడంతో ఎగవేతదారులుగా బ్యాంకు గుర్తించింది. బ్యాంకుకు తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35 కోట్లకు లెక్కకట్టి స్వాధీనం చేసుకుంది. మిగిలిన బకాయిలు చెల్లించాలని గంటాతోపాటు ఆయన సంబంధీకు లకు నోటీసులు పంపినా స్పందన లేకపోవడంతో గంటా వ్యక్తిగత ఆస్తులను డిసెంబరు 20న ఈ-వేలం వేస్తున్నట్లు డాబాగార్డెన్స్‌ ఇండియన్‌ బ్యాంకు శాఖ సోమవారం ప్రకటించింది. 2016 సెప్టెంబరు 30 నాటికే రూ.142 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ నోటీసు పంపినా, స్పందన లేకపోవడంతో అప్పటికే కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. 2019 నవంబరు ఆరు నాటికి రూ.209 కోట్లు బకాయి పడినట్లు బ్యాంకు చెబుతోంది. ప్రత్యూష సంస్థ డైరెక్టర్‌ పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన తర్వాత తీసుకున్న అప్పు అని, ఆయన కేవలం అప్పు కోసం గ్యారంటీ సంతకం మాత్రమే చేశారని గంటా సన్నిహితుడు ఒకరు వ్యాఖ్యానించారు.

వేలం వేస్తున్నట్లు ప్రకటించిన ఆస్తులు
1. గంగుల వారి వీధిలోని ప్రత్యూష అసోసియేట్స్‌కు చెందిన భవనం
2. అల్లిపురం, బాలయ్య శాస్త్రి లే అవుట్‌ ప్రాంతాల్లోని స్థలంతో పాటు ఇతర ఆస్తులు
3. ఎండాడలోని సుమారు 556 గజాల స్థలం4. ద్వారకానగర్‌లో మొదటిలైన్‌ అల్లిపురంలోని ప్లాట్లు
5. తమిళనాడులోని కాంచిలోని 600 గజాల స్థలం
6. కాకినాడలోని 333 గజాల స్థలం
7. ఆనందపురం దరి వేములవలసలోని 4.61 ఎకరాల స్థలం
8. హైదరాబాద్‌లోని మణికొండలోగల 67 గజాల స్థలం
9. కాకినాడలోని 1,101 గజాల స్థలం

Courtesy Prajasakti..