దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
తప్పుబట్టిన సైన్యం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని సస్పెండ్‌ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారంటూ మంగళవారం ఆయనకు ఈ శిక్షను ఖరారు చేసింది. ముషారఫ్‌ పరోక్షంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక మాజీ సైనిక పాలకుడికి మరణశిక్ష విధించడం ఈ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. దీన్ని తప్పుబడుతూ సైన్యం తీవ్రస్థాయిలో స్పందించింది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏర్పడ్డ ప్రత్యేక న్యాయస్థానంలోని త్రిసభ్య ధర్మాసనం 2-1 మెజార్టీతో ఈ తీర్పు చెప్పింది.  ధర్మాసనంలో పెషావర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సేథ్‌, జస్టిస్‌ నజర్‌ అక్బర్‌ (సింధ్‌ హైకోర్టు), జస్టిస్‌ షాహిద్‌ కరీమ్‌ (లాహోర్‌ హైకోర్టు) సభ్యులుగా ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న 76 ఏళ్ల ముషారఫ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో ప్రవాసంలో ఉంటున్నారు. పాకిస్థాన్‌లో పౌరప్రభుత్వం కన్నా సైన్యం శక్తిమంతమైనది. 72 ఏళ్ల చరిత్రలో ఈ దేశం.. సగం కాలం పాటు సైనిక నియంతల పాలనలోనే ఉండిపోయింది. అలాంటి చోట ఒక మాజీ సైనిక పాలకుడికి మరణ శిక్ష విధించడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2014లోనే ఆయనపై దోష నిర్ధారణ జరిగింది. అయితే 2016లో ఆయన దుబాయ్‌ వెళ్లడంతో కేసు విచారణ నెమ్మదించింది. మునుపటి సైనిక పాలకులు అయూబ్‌ ఖాన్‌, యాహ్యా ఖాన్‌, జియావుల్‌ హక్‌లు కూడా రాజ్యాంగాన్ని రద్దు చేశారు. అయితే వారు ఎన్నడూ కోర్టు విచారణను ఎదుర్కోలేదు.

గత నెల 28నే ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వాల్సింది. అయితే అప్పుడే వెలువరించవద్దని గత నెల 27న ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్‌ 5కల్లా కొత్త ప్రాసిక్యూషన్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. కొత్త ప్రాసిక్యూషన్‌ బృందం ఈ నెల 5న ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయింది. 17న తీర్పు వెలువరించనున్నట్లు అదే రోజున ప్రత్యేక కోర్టు తెలిపింది. ముషారఫ్‌కు సహకరించినవారిని కూడా నిందితులుగా చేర్చాలని, తీర్పును ఇప్పుడే వెలువరించవద్దని మంగళవారం ప్రాసిక్యూటర్లు కోరారు. దీన్ని ధర్మాసనం తిరస్కరించింది.

నాటి ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ను పదవీచ్యుతుడిని చేయడం ద్వారా 1999లో ముషారఫ్‌ అధికారాన్ని దక్కించుకున్నారు. 2001 నుంచి 2008 వరకూ పాక్‌ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన పలువురు న్యాయమూర్తులను జైలుకు పంపారు.

చికిత్స కోసం 2016లో దుబాయ్‌ వెళ్లిన ముషారఫ్‌.. భద్రతా, ఆరోగ్య కారణాలను చెబుతూ ఆ తర్వాత స్వదేశానికి తిరిగిరాలేదు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ నెల మొదట్లో అక్కడి ఆసుపత్రిలో చేరారు. తాజా తీర్పును సుప్రీం కోర్టులో ముషారఫ్‌ సవాల్‌ చేయవచ్చు. ఇందుకు ఆయన స్వదేశానికి తిరిగిరావాల్సి ఉంటుంది. కోర్టు మినహాయింపు ఇస్తే ఆ అవసరం ఉండదు.

ఆయన ద్రోహి కాదు: సైన్యం : తాజా తీర్పును ఖండిస్తూ పాక్‌ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘సైన్యాధిపతిగా, త్రివిధ దళాధిపతుల కమిటీ ఛైర్మన్‌గా, దేశాధ్యక్షుడిగా, పాక్‌కు 40 ఏళ్ల పాటు సేవలు అందించి, మాతృ భూమి కోసం యుద్ధాల్లో పోరాడిన వ్యక్తి ఎన్నడూ ద్రోహి కాజాలరు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు, స్వీయ వాదనను వినిపించుకునే ప్రాథమిక హక్కు నిరాకరణ, వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని విచారణ చేపట్టడం ద్వారా నిర్దేశిత న్యాయ ప్రక్రియను విస్మరించినట్లు కనపడుతోంది. రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయం జరుగుతుందని పాక్‌ సైనిక దళాలు ఆశిస్తున్నాయి’’ అని సైనిక అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ పేర్కొన్నారు.

Courtesy Nava telangana