నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో దోషులను ఉరిశిక్ష అమలు చేయడాన్ని అంతర్జాతీయ న్యాయకోవిదుల కమిషన్(ఐసీజే), ప్రముఖ మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్-ఇండియా ఖండించాయి. మరణశిక్షలు అమలు చేసినంత మాత్రాన మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగిపోవని పేర్కొన్నాయి. ‘మరణశిక్షలు పరిష్కారం కాదు. మరణశిక్షల పునరుద్ధరణ భారతదేశ మానవ హక్కుల రికార్డుకు మరో చీకటి మరకను జోడిస్తుంది. భారతీయ న్యాయస్థానాలు పదేపదే దీనిని ఏకపక్షంగా, అస్థిరంగా వర్తింపజేస్తున్నట్లు కనుగొన్నాయి. నిర్భయ కేసు తరువాత లైంగిక వేధింపులు, అత్యాచారాలపై చట్టాలను సంస్కరించడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ వర్మ కమిటీ కూడా అత్యాచారం కేసులలో మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించింది. మరణశిక్షను అమలుచేస్తున్న మైనారిటీ దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రపంచ దేశాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ అంటే 140 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి’ అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్-ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాష్ కుమార్ అన్నారు.

మరణశిక్షల అమలుపై తక్షణమే మారటోరియం విధించాలని భారత ప్రభుత్వాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కోరింది. క్రూరమైన, అమానవీయ, అవమానకరమైన శిక్షను రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. ‘2015 ఆగస్టు నుంచి భారతదేశం ఎవరినీ ఉరితీయలేదు. మహిళలపై హింసను అరికట్టే చర్య పేరిట ఈ రోజు నలుగురు పురుషులను ఉరితీయడం దురదృష్టకరం. భారతదేశంలో చట్టసభ సభ్యులు కూడా నేరాలను పరిష్కరించడానికి మరణశిక్షను చిహ్నంగా భావించే పరిస్థితులు నెలకొన్నాయి. లింగ ఆధారిత హింసను తగ్గించడానికి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. న్యాయ విచారణలు మెరుగుపరడచం, బాధితుల కుటుంబాలకు మద్దతు వంటి చర్యల ద్వారా నేరాలను నియంత్రించవచ్చు. దీని కోసం విధానపరమైన, సంస్థాగత సంస్కరణలు అవసరం’ అని అవినాష్ కుమార్ పేర్కొన్నారు.

నిర్భయ కేసులో దోషులను ఉరి తీయడాన్ని ఖండిస్తూ ‘న్యాయ నియమానికి అప్రతిష్ట’ అని అంతర్జాతీయ న్యాయకోవిదుల కమిషన్ వ్యాఖ్యానించింది.మరణశిక్షలు అమలు చేయడం వల్ల మహిళలకు న్యాయం జరగదని వ్యాఖ్యానించింది. ‘ప్రభుత్వ అనుమతి పొందిన మరణశిక్షలు పబ్లిక్ థియేటర్ కంటే కొంచెం ఎక్కువ, ఇవి చట్ట నియమం యొక్క వ్యయంతో హింసను జరుపుకుని, శాశ్వతం చేసే ప్రమాదం ఉంది. ఇలాంటి ఘోరమైన నేరాల్లో మరణశిక్ష విధించడం వల్ల ప్రతికూల ప్రభావమే ఎక్కువ. మహిళల జీవితాలను మెరుగుపరచడానికి ఏమాత్రం ఉపయోగపడదు’ అని ఐసీజే ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రెడరిక్ రాస్కీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాలు సూచించినట్టుగా మరణశిక్షను రద్దు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వానికి ఐసీజే పిలుపునిచ్చింది. ఈ విషయంలో మెజారిటీ దేశాలు సరసన చేరాలని కోరింది.

2012 ఢిల్లీ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురు ముఖేష్ సింగ్ (32), అక్షయ్ కుమార్ సింగ్ (31), వినయ్ శర్మ (26), పవన్ కుమార్ గుప్తా (25)లను శుక్రవారం (మార్చి 20) ఉదయం 5.30 గంటలకు తిహార్ జైలులో ఉరి తీశారు. 23 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినందుకు వారికి ఉరిశిక్ష అమలు చేశారు.